పోరాట రూపాలకు దిశా నిర్దేశం- 2020

“మరోపక్క, కరోనా పాండమిక్ సమయాన్ని అడ్డుపెట్టుకుని, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని పూర్తిగా కార్పొరేట్ వర్గాలకు అప్పచెప్పే మూడు వ్యవసాయ చట్టాలను ఏ రకమైన చర్చా లేకుండానే ఆమోదించింది. ప్రపంచీకరణ విధానాల తర్వాత సంక్షోభం తీవ్రమై ఈదేశ రైతాంగంలో ఇప్పటికే నాలుగు లక్షలమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయంలో అనేక సమస్యలున్నప్పటికీ, ఈదేశ ఆహారభద్రతను కాపాడుతున్నది నిస్సందేహంగా ఈ చిన్న, సన్నకారు, కౌలు, మహిళా, ఆదివాసీ రైతాంగమే. ఇప్పుడు తెగించకపోతే ఇక శాశ్వతంగా ఉరితాడే ఉంటుందని, ముంచుకు వచ్చిన ప్రమాదాన్ని పసిగట్టారు కాబట్టే, పాండమిక్ పరిస్థితులను, గడ్డ కట్టించే చలిని కూడా తోసిరాజని దేశ రాజధానికి దగ్గర రాష్ట్రాలలోని లక్షలాదిమంది రైతాంగం దండుగా కదిలారు. దేశరాజధానిని నలువైపులా చుట్టుముట్టారు.”

అత్యంత భారంగా 2020 సంవత్సరం ముగిసి, ఈరోజు నుంచీ కొత్త సంవత్సరం లోకి అడుగెడుతున్నాం. కొత్త సంవత్సరం అంటే కొంతమందికి సరదాగా గడిపే ఒక సందర్భం కావొచ్చు. కాదనలేం. మరికొంతమందికి తమ దాతృత్వాన్ని చాటుకునే అంశం కావొచ్చు. దానినీ కాదనలేం. కానీ, వీటిని దాటుకుని చారిత్రికంగా, రాజకీయంగా మన దేశంలో, రాష్ట్రంలో జరిగిన కొన్ని ముఖ్యమైన అంశాల మీద దృష్టి పెడదాం. ఈ 2020 అనేకమందికి తీవ్రమైన ఆటుపోట్లను మిగిల్చింది. ముఖ్యంగా మైనారిటీ సమూహాలకు, వలస కార్మికులకు. ఉత్తరప్రదేశ్ ‘హత్రాస్’ దళిత మహిళ మీద జరిగిన అత్యంత క్రూరమైన అత్యాచారం సంఘటన, దానికి వెన్నుదన్నుగా నిలబడిన రాజ్యవ్యవస్థలు అన్నీ కలిపి చేసిన దుర్మార్గమైన బ్రాహ్మణీయ ఆధిపత్య కుల, పితృస్వామ్య వ్యవస్థ హింసకు పరాకాష్టగా చెప్పుకోవాలి. కేంద్రప్రభుత్వంలో అధికారంలోవున్న బిజేపీ 2019 చివరలో పౌరసత్వ నిరూపణ పేరుతో ముఖ్యంగా ఈదేశ మైనారిటీ సమూహాలకు, దళిత బహుజన, ట్రాన్స్జండర్, మహిళా పౌరుల అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసే చట్టాలను ఏకపక్షంగా ఆమోదించింది.

అవే, పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (NRC), జాతీయ పౌరగణన (NPR). వీటికి వ్యతిరేకంగా దేశవ్యాపితంగా అనేక సమూహాలు శాంతియుతంగా పోరుబాట పట్టాయి. ఢిల్లీ షాహీన్బాఘ్, ఇతర మొహల్లలోని సామాన్య మహిళలు, విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామ్య విలువల కోసం ఉద్యమిస్తున్న, గళమెత్తుతున్నమహిళా యువతరం ఈదేశ భవిష్యత్తు పోరాటరూపాలు ఎలా ఉండాలో దిశా నిర్దేశం చేశారు. అమ్మమ్మలు, నాయనమ్మలు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు తమ రోజు వారీ బాధ్యతలను చూసుకుంటూనే, వంతులవారీగా రోజుల తరబడి నిరశన దీక్షలో కూర్చుని పట్టుదలతో ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందే అని నినదిస్తూ, ఈదేశ బహుళత్వాన్ని చాటిచెప్తూ, కేంద్ర ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను వినిపిస్తూ వెళ్లారు. షాహీన్ బాగ్ మహిళలు ఈదేశ ముఖచిత్రమైయ్యారు. ప్రజల చైతన్యాన్ని, ముఖ్యంగా మహిళల ప్రజాస్వామిక చైతన్యాన్ని సహించలేని పాలకులే దగ్గరుండి మరీ ఢిల్లీ మహానగరంలో ఊచకోత (‘పోగ్రోం’)తో మత మారణకాండను సృష్టించి విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారు. వేలాదిమందిని భయభ్రాంతులకు గురిచేశారు. కట్టుబట్టలు కూడా లేకుండా ఇళ్లను తగలబెట్టారు. ప్రాణాలను తీసారు. బహుశా ఇప్పటికీ ఆ కుటుంబాలు కోలుకుని ఉండకపోవచ్చు.

వీటన్నిటినీ మించి 2020 సంవత్సరం కేవలం మన దేశానికే కాదు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా కరోనా పాండమిక్ రూపంలో అతిపెద్ద సవాలుని విసిరింది. దేశాలకు దేశాలు అన్ని పనులనూ రద్దు చేసుకుని ఒక నిరంతర అభధ్రతలో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ దేశాల అనుభవాలు కళ్ళముందు కనిపిస్తూనే వున్నాగానీ భారత కేంద్ర ప్రభుత్వం కావాలనే తాత్సారం చేసింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాల మీద ఆంక్షలు వెంటనే తీసుకోలేదు. తమ ప్రియతమ అమెరికా అధ్యక్షుడి పర్యటన కోసం నిస్సిగ్గుగా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టింది. లక్షల మందిని జమచేసి అగ్రరాజ్యానికి హారతులు ఇప్పించింది. కరోనా బారిన పడిన వ్యక్తుల సంఖ్య ఐదు వందలు కూడా మించనప్పుడు అకస్మాత్తుగా ఏమాత్రం సమయం ఇవ్వకుండా లాక్డౌన్ ప్రకటించింది. కేసులు ఉధృతంగా వున్నప్పుడు లాక్ డౌన్ సడలించింది. విజ్ఞత వున్న ఏ పాలకులైనా దశలవారీగా చర్యలు తీసుకుంటూ, ప్రజలను సన్నద్ధం చేస్తారు. అంతేకానీ, తమ కార్యక్రమాల కోసం కోట్లాదిమంది వలస కార్మికుల జీవితాల్ని నిర్లజ్జగా రోడ్డు మీద పడేసిన ఘనత మాత్రం మన కేంద్ర ప్రభుత్వానికే దక్కింది. ప్రపంచంలోని ఇంకే ఇతర దేశంలో కూడా ఈరకమైన పరిస్థితి రాలేదు.

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ లో రైతు సంఘాలు చేస్తున్న పోరాటానికి డిసెంబర్ 30 న హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద మద్దతు తెలుపుతున్న మహిళా సంఘాలు.

పాండమిక్ వంటి పరిస్థితులను అడ్డుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ప్రజల్ని చైతన్య పరచాలి. కానీ ‘పళ్ళాలు మోగించండి, దీపాలు పెట్టండి’ వంటి నిరర్ధక పనులతో కాలక్షేపం చేసారు తప్పించి, ప్రణాళికా బద్ధంగా ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోగలుగుతామో ప్రకటించలేదు. అవసరైన మానవ, ఆర్థిక, సాంకేతిక వనరులను అందించలేదు. ఆ రకమైన చర్యల లోకి వెళ్ళలేదు. దాని ప్రభావం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. కరోనా వైరస్ గురించి ప్రజల్లో అనవసరమైన అపోహ, భయం, వివక్ష పెరిగిందే తప్పించి, దానిని ఎదుర్కోవటంలో చూపించాల్సిన హేతుబద్ధమైన ఆలోచన లోపించింది. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో నిర్దిష్టంగా చేపట్టాల్సిన, చేయాల్సిన పనులను చేపట్టలేదు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజాసమూహాలతో పనిచేసే అనుభవం, నైపుణ్యం వున్న సంస్థలను, ప్రజాసమూహాలను భాగస్వామ్యం చేయలేదు. మతాల కతీతంగా వైరస్ అన్ని వర్గాలనూ కబళించే పరిస్థితి వుందని తెలిసినా కానీ తమ సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లిం సమూహాన్ని బూచిగా చూపే ప్రయత్నం అత్యంత హేయంగా చేశారు. వందల్లో వుండగా అరికట్టగలిగిన పరిస్థితిని లక్షల్లోకి తెసుకెళ్ళారు. ఫలితం, వైరస్ వల్ల చనిపోయినవారి సంఖ్య వేలల్లోకి వెళ్ళింది. అధికారిక గణాంకాల ప్రకారమే మనదేశంలో 2020 డిసెంబర్ 31 అంటే నిన్నటికి చనిపోయిన వారి సంఖ్య 1,48,738 (ఒక లక్షా నలభైవేల ఏడువందల ముప్ఫై ఎనిమిది మంది). తెలంగాణ రాష్ట్రంలో 1,541(పదిహేనువందల నలభైఒకటి)మంది. ఇప్పటికీ పూర్తిగా ప్రమాదం తగ్గలేదనటానికి సూచనే ఆగని ఈ మరణాలు. ఇప్పుడు దేశంలో ప్రతిరోజూ ఇరవైవక్కవేలకి పైగా, తెలంగాణలో దాదాపు నాలుగువందల పైన పాజిటివ్ కేసులు నమోదవుతూనే వున్నాయి. ఇప్పుడు మరో కొత్త పేరుతో మరింత ప్రమాదకరంగా వైరస్ మొదలయ్యిందనీ, మరోసారి లాక్ డౌన్ పెడతారనే పేరుతో ప్రజలను భయపెడుతున్న వార్తా కథనాలు కోకొల్లలుగా వస్తున్నాయి. ఇప్పటికే మొదటి లాక్ డౌన్ వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. జీవితాలు అస్థవ్యస్థమైపోయాయి. మళ్లీ ఇంకోసారి లాక్ డౌన్ అంటే ఎంతో కష్టం అవుతుంది. కానీ, విచిత్రమేమిటంటే, కార్పోరేట్ వ్యాపార వర్గాల లాభాలు మాత్రం అత్యంత లాభాల వేటలో వున్నాయట! ప్రభుత్వాల విధానాలు ఎవరికీ ఉపయోగపడతాయో అర్థం కావటం లేదా!? కరోనా రూపంలో బహుశా అనేకమందికి ఆప్తుల ఆకస్మిక మరణాల రూపంలో అత్యంత విషాదాన్ని చూసిన సంవత్సరం కూడా ఇదే కావొచ్చు. అనేకమంది సామాజిక, పౌరహక్కుల కార్యకర్తలను, నాయకులను, కళాకారులను, రచయితలను కూడా కరోనా వల్ల భౌతికంగా కోల్పోవడం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు.

ఒకపక్క లాక్ డౌన్ తో అల్లకల్లోలమయిన హైదరాబాద్ నగర జీవితం కొంచం కుదురుకుంటున్న సమయంలో అధికవర్షాలతో మళ్లీ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. నగర జీవితం చిందరవందర అయిపొయింది. రోజుల తరబడి అనేక కాలనీలు నీట మునిగాయి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వేలాది ఎకరాల పంట మునిగి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. అటు పౌరసత్వ చట్టాలకు నిరసన నుండీ, లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు, కరోనా వైద్య సహాయంలో ప్రజలకు ప్రత్యక్షంగా, హెల్ప్ లైన్ల ద్వారా నిరంతరం విశ్రాంతి అనేది లేకుండా చేయూత నందించిన నగర సామాజిక సంస్థలు, సామాజిక కార్యకర్తలే మళ్లీ వరదల సమయంలో కూడా అపూర్వమైన మద్దతుని క్రమ బద్ధంగా అందించారు. సమయానికి స్పందించడం, బాధితుల్ని రక్షణ ప్రదేశాలకు తరలించడం, జరిగిన నష్టాన్ని బేరీజు వేయడం, తక్షణ సహాయాన్ని అందించడంతో పాటు, సమస్య మూలాల్ని గుర్తించి వాటి పరిష్కారాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి సూచించడం వరకూ కూడా వీరందరి పాత్ర ఎంతో వుంది.

మరోపక్క, కరోనా పాండమిక్ సమయాన్ని అడ్డుపెట్టుకుని, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని పూర్తిగా కార్పొరేట్ వర్గాలకు అప్పచెప్పే మూడు వ్యవసాయ చట్టాలను ఏ రకమైన చర్చా లేకుండానే ఆమోదించింది. ప్రపంచీకరణ విధానాల తర్వాత సంక్షోభం తీవ్రమై ఈదేశ రైతాంగంలో ఇప్పటికే నాలుగు లక్షలమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయంలో అనేక సమస్యలున్నప్పటికీ, ఈదేశ ఆహారభద్రతను కాపాడుతున్నది నిస్సందేహంగా ఈ చిన్న, సన్నకారు, కౌలు, మహిళా, ఆదివాసీ రైతాంగమే. ఇప్పుడు తెగించకపోతే ఇక శాశ్వతంగా ఉరితాడే ఉంటుందని, ముంచుకు వచ్చిన ప్రమాదాన్ని పసిగట్టారు కాబట్టే, పాండమిక్ పరిస్థితులను, గడ్డ కట్టించే చలిని కూడా తోసిరాజని దేశ రాజధానికి దగ్గర రాష్ట్రాలలోని లక్షలాదిమంది రైతాంగం దండుగా కదిలారు. దేశరాజధానిని నలువైపులా చుట్టుముట్టారు. ఈ క్రమంలో ముప్ఫైమందికి పైగా ప్రాణాలను కోల్పోయినా గానీ, రైతాంగానికి నష్టం చేసే ఆ చట్టాలను రద్దు చేయాల్సిందే అని కరాకండిగా తేల్చిచెబుతున్నారు. కదలివచ్చిన వచ్చిన రైతాంగం మీద ప్రారంభంలో అత్యంత నిర్బంధాన్ని ప్రయోగించినా, వారి మీద వేర్పాటువాదులనీ, టెర్రరిస్టులని అనేక ముద్రలు వేసినా గానీ, వారి పట్టుదల ముందు తలవంచి ప్రభుత్వం వారితో ప్రత్యక్షంగా చర్చలకు రావాల్సి వచ్చింది.

చట్టాలు ఏకపక్షంగా చేయటానికి అడ్డురాని కరోనా పాండమిక్ సమయం, రైతుల డిమాండ్లను ప్రతిపక్షాలతో చర్చించాల్సి వస్తుందనే సాకుతో పార్లమెంటు సమావేశాలనే రద్దుచేస్తే ప్రజలు ఆ మోసాన్ని గుర్తించరా!? అందుకే, ఆరుగాలం కష్టపడుతూ ఈ దేశమంతటికీ ఆహారభద్రతను అందించే కోట్లాదిమంది రైతాంగం 2020ని ఒక పోరాటాల చరిత్రగా మార్చేశారు. ఈ పోరాటం కేవలం ఒకటి రెండు రాష్ట్రాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. నెమ్మదిగా అన్ని రాష్ట్రాల్లో కొలిమి అంటుకుంటోంది. తెలంగాణ రాష్ట్రవ్యాపితంగా కూడా రైతుల నిరసనలు పెరుగుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో గత పదిహేనురోజులుగా నిరవధిక దీక్షలు జరిగాయి. డిసెంబర్ 30న రెండువేలమందికి పైగా సన్న,చిన్న, మహిళా, ఆదివాసీ రైతాంగం ధర్నాచౌక్ లో కదం తొక్కారు. వారికి సంఘీభావంగా మతాల కతీతంగా నగర ప్రజలు చేతులు కలిపారు. ఇది కేవలం రైతులపోరాటం మాత్రమే అనుకుంటే అంతకంటే హాస్యాస్పదం ఇంకోటి వుండదు. రైతు పండించే పంటను ఆహారంగా తీసుకునే ప్రతి ఒక్కరి సమస్య. పేద కుటుంబాల ఆహారభద్రత సమస్య. ప్రభుత్వం జవాబుదారీగా, మద్దతు వ్యవస్థలను పెంచాలని ఒకపక్క రైతులు అడుగుతున్నారు. కానీ, ప్రజల ఆహార భద్రత కన్నా కార్పోరేట్ల లాభాలే ముఖ్యమంటున్నాయి ప్రభుత్వాలు. పంటను పండించే ప్రజల వైపా? నిరంకుశత్వంతో వ్యవహరించే ప్రభుత వైపా? మనమెటు అనే ప్రశ్నే ఇప్పుడు కీలకమైనది.

corona pandemic
Comments (0)
Add Comment