ఆత్మ గౌరవ పతాక
ఆస్తిత్వ నినాద వీచిక
సబ్బండ వర్గాల దీపిక
మహోద్యమాల నాయిక
తెలంగాణ ప్రజా గొంతుక
ఆమే..వీర నారీ
చాకలి అయిలమ్మ
భూమి కోసం భక్తి కోసం
బానిస బతుకు విముక్తి కోసం
విప్లవ శంఖం పూరించిన శిరోమణి
పెత్తందారీ వ్యవస్థ మీద
రగల్ ఎండా ఎత్తిన పోరు శిఖామణి
దొరల గుత్తాధిపత్యం మీద
ధిక్కార గళం విప్పిన ధీర నారీమణి
దున్నే వాడిదే భూమి అంటూ
రైతుకూలీలను సంఘటితం చేసి
ఎర్ర జెండా నీడలో నడిపించింది
బాంచెన్ కాల్మొక్త అన్న గళాలచే
తిరుగుబాటు పాటల పాడించింది
పాలకుర్తి దొర కోటలు కూల్చి
నాగలితో పంట చేలుగా మార్చింది
భూస్వాములు ,గూండాలను
పొలుమారు దాట తరిమికొట్టింది
తల వంచని నిబ్బరం
మడమ తిప్పని నైజం
పట్టు వీడని తత్వం తన సొంతం
స్ఫూర్తి కెరటమా
ఆదర్శ కిరణమా
చాకలి ఐలమ్మా !
ఎర్ర జెండా సాక్షిగా..
తెలంగాణ జనగణమంతా
పోరు నీరాజనం పలుకుతుంది
విప్లవ జోహారులు అర్పిస్తుంది
(సెప్టెంబర్ 10 న చాకలి అయిలమ్మ వర్థంతి సందర్బంగా విప్లవ జోహార్ అర్పిస్తూ..)
– కోడిగూటి తిరుపతి, 9573929493