అన్ని రంగాల అభివృద్ధి..అన్ని వర్గాల సమ్మిళతం

  • సిఎం కేసీఆర్‌ ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదంతో భావితరాల సిద్ధిపేటగా మార్చుకున్నాం
  • నాటి సిద్ధిపేట ట్యాగ్‌లైన్స్…‌నేటి అభివృద్ధికి హెడ్‌లైన్స్
  • ‌మంత్రి హరీష్‌రావు సమక్షంలో కాంగ్రెస్‌ ‌పార్టీ నుండి పలువురు బిఆర్‌ఎస్‌లో చేరికలు
  • మా రికార్డ్ ‌మేమే బద్దలు కొడతాం..సిద్ధిపేట అభివృద్ధిలో భాగస్వామవుతాం

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌, 22 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదం ఫలితంగా భావితరాల సిద్ధిపేటగా మార్చుకున్నామనీ, అన్ని రంగాల అభివృద్ధి..అన్ని వర్గాల సమ్మిళతమే సిద్ధిపేట అభివృద్ధి అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్ధిపేటకు చెందిన పలువురు కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ను వీడి శుక్రవారం మంత్రి హరీష్‌రావు సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. బిఆర్‌ఎస్‌లో చేరిన వారందరికీ మంత్రి హరీష్‌రావు గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..నాడు మంచినీటి సమస్య ఉంటే ఇప్పుడు ఆ సమస్య లేదన్నారు. అండర్‌ ‌గ్రౌండ్‌ ‌డ్రైనేజీ ఏర్పాటు చేసుకొని శుభ్రమైన సిద్ధిపేటగా తయారు చేసుకున్నామన్నారు. ఒకప్పుడు చదువుకోవాలంటే విద్యార్థులకు కాలేజీలు ఉండేవి కావన్నారు. కానీ, ఇప్పుడు అన్ని రకాల విద్యా సంస్థలను నెలకొల్పామన్నారు. పశువుల డాక్టర్‌, ‌పంటల డాక్టర్‌, ‌మనుషుల డాక్టర్‌ ఇలా మూడు రకాల చదువులు ఇక్కడ ఉన్నాయన్నారు. నాలుగు పాలిటెక్నిక్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు.

ప్రభువ ఐటిఐ ఏర్పాటు చేశామన్నారు. నర్సింగ్‌, ‌బి.ఫార్మ్, ‌మెడికల్‌ ‌కళాశాల ఇలా అన్నీ ఏర్పాటు చేసుకున్నామన్నారు. రంగనాయక్‌సాగర్‌ ‌పూర్తి చేయడం ద్వారా లక్ష ఎకరాలకు నీళ్లు అందిస్తున్నట్లు చెప్పారు. కోమటిచెరువును అద్భుతంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఇతర జిల్లాల నుంచి చూసేందుకు వస్తున్నట్లు తెలిపారు. నాడు కైకిలోల్లు దొరకని పరిస్థితి ఉంటే, నేడు కైకిలు కోసం బిహార్‌, ‌యూపీ వంటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. సిద్ధిపేట జిల్లా, సిద్ధిపేట రైల్‌, ‌సిద్ధిపేటకు గోదావరి నీళ్లను సాకారం చేసుకున్నట్లు చెప్పారు. గత నాయకులు ఈ పేరుతో వోట్లు అడిగారన్నారు. కానీ, ఏ ఒక్కరూ నిజం చేయలేదన్నారు. 30 ఏండ్ల కలను సాకారం చేసుకున్నట్లు తెలిపారు. సిద్ధిపేట ఖ్యాతిని, సిద్ధిపేట ప్రతిష్టను పెంచే పనులు చేసినట్లు చెప్పారు. రైలు వచ్చింది, నీళ్లు వచ్చాయి కాబట్టి పరిశ్రమలు కూడా రాబోయే రోజుల్లో వస్తాయన్నారు. అందుకు అవసరమైన కృషి చేస్తామన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా సిద్ధిపేటలో రూ. 7 కోట్లతో నిర్మించిన ముదిరాజ్‌ ‌ఫంక్షన్‌ ‌హాల్‌ను త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గౌడ్స్ ‌ఫంక్షన్‌ ‌హాల్‌ ఇప్పటికే ప్రారంభించామన్నారు. వైశ్యుల ఫంక్షన్‌హాల్‌ ‌ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. ఇలా అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో 2500 డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్ల పంపిణీ పూర్తి చేశామని, అభివృద్ధి నిరంతర పక్రియగా కొనసాగుతుందన్నారు. మరోసారి లక్ష వోట్ల మెజారిటీతో గెలుపు సాధించి సిద్ధిపేట ప్రతిష్టను, గౌరవాన్ని పెంచేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అందుకు అందరి ఆశీర్వాదం కావాలన్నారు. నాటి సిద్ధిపేట ట్యాగ్‌లైన్స్…‌నేటి సిద్ధిపేట అభివృద్ధికి హెడ్‌లైన్స్ అని మంత్రి హరీష్‌రావు అన్నారు.

మా రికార్డ్ ‌మేమే బద్దలు కొడతాం.. : మంత్రి సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన పలువురు కాంగ్రెస్‌ ‌నేతలు..
సిద్ధిపేటకు చెందిన కాంగ్రెస్‌ ‌పార్టీ మహిళా సీనియర్‌ ‌నాయకురాలు బొమ్మగాని పద్మ, సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకుడు చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో సుమారు 55మంది అనుచరులతో మంత్రి హరీష్‌రావు సమక్షంలో బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. వీరితో కండ్లకోయ బాలకృష్ణముదిరాజ్‌, ‌మత్స్యకారుల సంక్షేమ సంఘం జిల్ల వర్కింగ్‌ అధ్యక్షుడు, సామాజిక హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు, ఆయన సతీమణి మమత కూడా తన అనుచరులతో కలిసి మంత్రి హరీష్‌రావు సమక్షంలో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిద్ధిపేటకు దేశ, విదేశ స్థాయి గుర్తింపు తెచ్చిన గొప్ప నాయకుడు మంత్రి హరీష్‌రావు అన్నారు.  2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే రానున్న అసెంబ్లీ ఎన్నికలో అత్యధిక మెజారిటితో అంటే దాదాపుగా లక్షన్నర వోట్ల మెజారిటీతో గెలిపించి మా రికార్డును మేమే బద్దలు కొడతామనీ, సిద్ధిపేట అభివృద్ధిలో భాగస్వామ్యమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ సిద్ధిపేట పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, నేతలు దర్పల్లి శ్రీనివాస్‌, ‌మహ్మద్‌ ‌చాంద్‌, ‌నరేష్‌, ‌లగిశెట్టి నవీన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment