శ్రీనగర్, ఫిబ్రవరి 7 : జమ్ము కశ్మీర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత పర్వం కొనసాగుతున్నది. అధికారుల తీరును నిరసిస్తూ పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. కూల్చివేతలు జరుపుతున్న రెవెన్యూ సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. స్థానికుల రాళ్ల దాడిలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. ఓ షోరూం యజమానితో పాటు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూల్చివేత పనులు నిలపాలంటూ ఉగ్రవాద సంస్థ నుంచి అధికారులకు బెదిరింపులు కూడా వస్తున్నాయి. ఆప్, కాంగ్రెస్, ఇతర స్థానిక పార్టీలు స్థానికులకు మద్దతుగా నిలిచాయి. జమ్ములోని మాలిక్ బజార్‌లో ఓ షోరూమ్‌ను జేసీబీతో కూల్చివేసేందుకు ప్రయత్నించగా రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. షోరూమ్ యజమాని సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
జమ్ములోని మైసమ్మ, సుంజ్వాన్, బతిండి, నర్వాల్ బైపాస్ ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. కూల్చివేత పనులు ఆపకపోతే తీవ్ర చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులను తీవ్రవాద సంస్థ టీఆర్‌ఎఫ్ బెదిరించింది. జమ్ముకశ్మీర్‌ను బీజేపీ ఆఫ్ఘనిస్తాన్‌గా మార్చిందని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఆప్, కాంగ్రెస్‌తోపాటు ఇతర స్థానిక పార్టీలు ప్రజల ఆందోళనలో పాలుపంచుకున్నాయి. పేదలను ఇబ్బంది పెట్టే చర్యలను ఎంతమాత్రమూ ఉపేక్షించేది లేదని అన్ని పార్టీలు ముక్తకంఠంతో నినదించాయి. దక్షిణ కశ్మీర్‌లో కిసాన్ తెహ్రీక్ అసోసియేషన్ బ్యానర్ కింద పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసన ర్యాలీ చేపట్టారు. ’ఇది మా భూమి.. ఆదేశాలను పాటించం’ అంటూ నినాదాలు చేశారు. లాల్‌చౌక్‌లో దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు. మరోవైపు జమ్ము కశ్మీర్‌లో వేర్పాటువాద నేతలపై చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
అనంత్‌నాగ్ జిల్లాలో హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడు కాజీ యాసిర్ షాపింగ్ కాంప్లెక్స్‌ను బుల్‌డోజర్‌తో ధ్వంసం చేశారు. కేంద్ర మాజీ మంత్రి దివంగత మహ్మద్ మక్బూల్ దార్ భార్య నుంచి ఆక్రమణకు గురైందని ఆరోపిస్తున్న దాదాపు 11 వేల చదరపు అడుగుల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇక్కడ ఆక్రమణలకు గురైన భూములను కొందరు బడా స్వార్థపరులు తీసుకుంటున్నారని, వాటిని ప్రజలకు తిరిగి అందజేయనున్నట్లు కేంద్ర పాలిత ప్రాంతం ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరుణ్‌కుమార్ మెహతా తెలిపారు.