జాతీయ రాజకీయాలపై ఉత్సుకత

జాతీయ రాజకీయాలిప్పుడు ఆసక్తిని కలిగించేవిగా ఉన్నాయి. ఇప్పటివరకు ఒక మూసలో పోసినట్లుగా కొనసాగుతున్న రాజకీయాల్లో కొత్త వరవడి రానున్నట్లు స్పష్టమవుతున్నది. నిన్నటి వరకైతే ఎన్డీయే లేదా యూపిఏ పార్టీల్లో ఏదో ఒక దానికి అధికారం దక్కుతుందన్నది అందరి జ్ఞానంలో ఉన్న విషయం. కాని, వొచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆ ఆలోచనలో తప్పక మార్పు జరుగుతుందన్నే విషయాన్ని నేడు దేశంలో జరుగుతున్న రాజకీయ సమీకరణలు చెప్పకనే చెబుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ హ్యాట్రిక్‌ ‌కొట్టి తీరుతాడని భారతీయ జనతా పార్టీ ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు ఇప్పటికే దేశంలోని పద్దెనిమిది రాష్ట్రాల్లో పాగా వేసిన బిజెపి ఇప్పుడు పందొమ్మిదవ రాష్ట్రం కోసం అలుపులేని పోరాటం చేస్తున్నది. తెలంగాణపై ఆధిపత్యం కోసం సర్వశక్తులను ఒడ్డుతున్నది. అందులో భాగంగానే వొచ్చే నెల అంటే జూలై రెండు, మూడు తేదీల్లో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేస్తుంది. ఈ సమావేశానికి ఆ పార్టీ పాలిత పద్దెనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు అతిరథ మహారథులు అనేకులు రానున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు జరిగే అవకాశం ఉంటుందను కుంటున్నారు. ఇదే సమయంలో కేంద్రంలోని అధికార బిజెపి(ఎన్‌డిఏ కూటమి)కి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఈ నెల 15న ఈ బేటీ జరుగబోతున్నది. దాదాపు ఇరవైకి పైగా జాతీయ స్థాయి నాయకులు, ప్రాంతీయ పార్టీల నాయకులు ఈ భేటీకి హాజరు కానున్నట్లు తెలస్తున్నది. వీరంతా కలిసి ఏ మేరకు ఐక్యతా రాగం వినిపిస్తారన్నది ఇప్పుడప్పుడే అంచనా వేయడం సాధ్యంకాదు.

ఇదిలా ఉంటే మూడవ ప్రత్యమ్నాయం అంటూ గత కొంతకాలంగా దేశం చుడుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రత్యమ్నాయ జాతీయ పార్టీని ఈ నెల 19న ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకు తగిన కసరత్తు కొంతకాలంగా నడుస్తున్నట్లు వార్తలు వొస్తున్నాయి. ఇప్పటివరకు నడుస్తున్న రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాల్సిన అవసరాన్ని ఆయన కొంతకాలంగా దేశ ప్రజలకు చెబుతూ వొస్తున్నారు. ఆ విషయంలో ఆయన బిజెపి, కాంగ్రేసేతర జాతీయ, ప్రాంతీయ పార్టీలతో పాటు మేధావులు, విభిన్న వర్గాల వారిని కలస్తున్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉంది. జాతీయ స్థాయిలో మార్పులు చేపట్టేందుకు ఇదే సరైన సమయమన్నది కెసిఆర్‌ అభిప్రాయంగా తెలుస్తున్నది. అందుకే తన మంత్రి వర్గం, ఎంపిలు, ఎంఎల్‌ఏలు, మేధావి వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్‌, ‌బిజెపికి ప్రత్యమ్నాయంగా జాతీయస్థాయిలో రాజకీయ పార్టీ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ ఏర్పాటు చేయబోయే పార్టీకి ‘భారత రాష్ట్ర సమితి’(బిఆర్‌ఎస్‌) ‌గా నామకరణం చేయనున్నట్లు మీడియా ఘోషిస్తోంది. దాని ఎజండా, జండా, రంగులు, చిహ్నం లాంటి వాటి విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నట్లు తెలస్తున్నది. అయితే ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌నే బిఆర్‌ఎస్‌గా మారుస్తారా, లేక బిఆర్‌ఎస్‌లో ఇతర ప్రాంతీయ పార్టీలు చేరనున్నట్లు టిఆర్‌ఎస్‌ అం‌తర్భాగంగా ఉంటుందా అన్నది కూడా చర్చనీయాంశంగా సాగుతున్నట్లు తెలుస్తున్నది. పేరు ఏదైనా దాని సింబల్‌ ‌మాత్రం కారుండాలన్న అభిప్రాయాలు బలంగా వినవస్తున్నట్లు తెలుస్తున్నది.

ఇప్పటివరకు కేంద్రంలో అధికారం చెలాయించిన వారిలో ఎక్కువ శాతం ఉత్తరాదివారే. పార్టీలు కూడా ఉత్తరాదికి చెందినవే కావటం విశేషం. ఉత్తరాది నాయకులు ఏపార్టీ వారైనా సహజంగా దక్షిణాది నాయకత్వాలను ఎదగనీయవన్న అభిప్రాయం చాలా కాలంగా ఉంది. అలాగే దక్షిణాది రాష్ట్రాలపట్ల ఉదాసీన వైఖరిని అవలంబిస్తారన్న అపవాదు కూడా ఉంది. ఈ నేపథ్యంలో కెసిఆర్‌ ‌కొత్తగా ఏర్పాటు చేయనున్న బిఆర్‌ఎస్‌ అం‌కురార్పణ దక్షిణాదిలోనే జరుగబోతున్నది. దీన్ని ఉత్తరాది ప్రాంతాలవారు ఎంతవరకు ఆదరిస్తారన్నది ప్రశ్న. గతం సంగతి ఎలా ఉన్నా, ఎనిమిదేళ్ళ బిజెపి పాలనలో తమను చిన్నచూపు చూస్తున్నారంటూ దక్షిణాది రాష్ట్రాలు కొంతకాలంగా గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో తెలంగాణతో సహా పశ్చిమబెంగాల్‌, ‌కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఏపి, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు తరుచూ కేంద్రంతో గొడవ పడుతూనే ఉన్నాయి. కొత్తగా ఏర్పడే ఈ జాతీయ పార్టీలో ఈ రాష్ట్రాలన్నీ నిజంగానే ఏకమైతే ఖచ్చితంగా బిజెపిని ఎదుర్కునే బలమైన పార్టీగా బిఆర్‌ఎస్‌ ఎదిగే అవకాశాలుంటాయి. కాని, మమతా బెనర్జీ ఏర్పాటుచేసిన సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడప్పుడే అంచనాకు రావడం కష్టం.

ఎందుకంటే జాతీయ స్థాయిలో పార్టీ పెట్టేందుకు కార్యాచరణ సిద్దంచేసుకుంటున్న కెసిఆర్‌ ‌మమత ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతారా, ఆ సమావేశానికి హాజరుకాకుండా చూసి తన వైపుకు ఎంతమందిని తిప్పుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తున్న అంశం. జాతీయ స్థాయి ప్రత్యమ్నాయ పార్టీ ఏర్పాటు విషయంలో ఇదివరకే వీరిద్దరూ అనేక దఫాలుగా భేటీ అయిన విషయం తెలియంది కాదు. వీరిద్దరు కూడా బిజెపికి ప్రత్యమ్నాయం గురించి ఆలోచిస్తున్న వారే. అయితే ప్రత్యమ్నాయ కూటమిలో కాంగ్రెస్‌కు స్థానం కల్పించాలంటున్న రాష్ట్రాలు లేకపోలేదు. మమత మొగ్గుకూడా అటువైపుగానే ఉంది. కెసిఆర్‌ ‌మొదటి నుండి ఆ విషయంలో భిన్నమైన అభిప్రాయంతో ఉన్నారు. పక్కనున్న మరో తెలుగు రాష్ట్రమైనా సహకరిస్తుందా అన్నది కూడా ప్రశ్నే. ఇప్పటి వరకైతే అధికార వైఎస్‌ఆర్‌ ‌పార్టీకి కేంద్రంలోని బిజెపితో అంత చెడిపోలేదు. అక్కడి ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన పార్టీలు బిజెపిని పెద్దగా వ్యతిరేకించడం లేదు. ఈ ఒక్క రాష్ట్రం కలిసి వొచ్చినా ఉమ్మడి ఏపిలో మాదిరిగా 42 ఎంపి స్థానాలతో కేంద్ర ప్రభుత్వంతో ఆడుకోవచ్చు. కాని అటు మమత ఏర్పాటుచేసిన సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. అలాగే అంతకు ముందే కెసిఆర్‌ ‌ప్రకటించనున్న కొత్త పార్టీకి వివిధ రాష్ట్రాలు ఏమేరకు మద్దతు ప్రకటిస్తాయన్నది కూడా ఇప్పుడప్పుడే అంచనా వేయడం కష్టం.

Curiosity about national politicsprajatantra newstelangana updatestelugu kavithaluToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment