కొరోనా పెరుగుతున్న వేళ..పట్టాలెక్కుతున్న ప్రజారవాణా!

ఒక పక్క దేశంలో కొరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నప్పటికీ స్తంభించి పోయిన రవాణా వ్యవస్థను పునరుద్ధరించేపనిలో పడ్డాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. కొరోనా వైరస్‌ ‌కారణంగా దేశవ్యాప్తంగా మార్చి 22న జనతా కర్ఫ్యూతో మొదలయి 25 నుంచి లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చింది. కేంద్ర నిర్ధేశం ప్రకారం మే 17వరకు ఈ లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది. ఆ తర్వాత ఏంచేయ్యాలన్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం మంతనాలు జరుపుతోంది. లాక్‌డౌన్‌ ఎత్తివేయడమా, కొనసాగించడమానన్న విషయాన్ని పక్కకు పెడితే నెలన్నర రోజులకుపైగా స్తంభించిపోయిన రవాణా వ్యవస్థను పునరుద్ధరించాలన్న నిర్ణయానికొచ్చాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఆమేరకు సన్నాహాలు కూడా ప్రారంభిస్తుండడంతో జనం ఊపిరి తీసుకుంటున్నారు. ఇంతకాలంగా ఎక్కడివారక్కడ చిక్కుకు పోవడంతో తమ వారిదగ్గరకు వెళ్ళేందుకు ఇప్పటికైనా అవకాశం ఏర్పడుతు న్నందుకు వారు ఆనందాన్ని వ్యక్తంచేస్తున్నారు.

దేశంలో అనూహ్యంగా విస్తరిస్తున్న కొరోనా వైరస్‌ను నివారించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనసంచారాన్ని నిలిపివేశాయి. గత 50 రోజులుగా రైళ్ళు, బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. లాఠీదెబ్బలు తిన్నవారు, చివరకు ప్రాణాలను కూడా కోల్పోయిన దారుణ పరిస్థితులేర్పడ్డాయి. అనుకోని రీతిలో రవాణా స్తంభించి పోవడంతో వివిధ పనులమీద ఎక్కడెక్కడికో వెళ్ళినవారు ఇన్ని రోజులుగా తిరిగి తమ గూటికి చేరుకోలేక పోయారు. అయితే నాలుగైదు రోజుల ముందు నుండి వలస కార్మికుల కోసం కొనసాగుతున్న రైళ్ళతోపాటు, ఇప్పుడు సాధారణ రవాణా వ్యవస్థకు నెలకొల్పేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రాథమికంగా కొన్ని రైళ్ళను మాత్రమే నడపడం ద్వారా నిన్నటివరకు అమలులో ఉన్న లాక్‌డౌన్‌కు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకుంటోంది. మంగళవారం నుండి ప్రారంభమయ్యే ఈ రైళ్ళను ప్రత్యేక సర్వీసులుగా రైల్వేశాఖ పేర్కొంటున్నది. దేశ రాజధాని ఢిల్లీనుంచి దేశంలోని పదిహేను ప్రధాన నగరాల (రూట్ల)కు వీటిని ముందుగా నడుపాలని రైల్వేశాఖ నిశ్చయించింది. అందులో తెలంగాణకు చెందిన సికిందరాబాద్‌ ‌కూడా ఉండడంతో ఇంతకాలంగా నిర్బంధ కట్టడికి గురైనట్లున్నవారికి కాస్త ఉపశమనంగా మారింది. సోమవారం సాయంత్రం నుండే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌చేసుకునే వెసులుబాటు కూడా కల్పించినప్పటికీ టికెట్‌ ‌కన్ఫర్మ్ అవుతేనే స్టేషన్‌లోకి అనుమతిస్తారు తప్ప కౌంటర్‌లో టికెట్‌ ‌కొనుక్కునే అవకాశం మాత్రం లేదు.

తెలంగాణలో రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ ఈనెల 15 లేదా 17 తేదీలనుండి బస్సులను యథావిధిగా నడిపేందుకు సిద్ధపడుతున్నది. సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా బస్సులన్నిటినీ ఇప్పటి నుండే మరమత్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో కొరోనాను తగ్గించగలిగినా రాష్ట్ర రాజధానిలో మాత్రం పెరుగుతూనే ఉంది. అయినా వైరస్‌ ‌ప్రభావం లేని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ‌సడలింపులు చేస్తోంది ప్రభుత్వం. కిరాణా, మందుల షాపులు మొదటి నుండీ పనిచేస్తూనే ఉన్నాయి. కొద్దిరోజుల కిందే బ్రాండీ షాపులకు అనుమతిచ్చారు. అలాగే బిల్డర్స్‌ను తమ నిర్మాణాలను కొనసాగించుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. వారి డిమాండ్‌ ‌మేరకు నిర్మాణ అనుబంధ సంస్థలకు కూడా ఒక విధంగా ప్రభుత్వం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చినట్లే. రాష్ట్ర వ్యాప్తంగా కంటోన్మెంట్‌ ఏరియాలు తప్ప ఆరేంజ్‌ ‌జోన్‌లు, గ్రీన్‌జోన్లుగా మారుతున్న క్రమంలో ఇంతకాలంగా మూతపడిన మిగతా షాపులు కూడా ఒక్కొక్కటిగా తెరుచుకునేందుకు బేసి సంఖ్యల వారీగా అనుమతులిస్తున్నారు. కొన్ని నిబంధనలు పెట్టినా సోమవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే ఐటి కంపెనీలు కూడా తెరుచుకోనారంభించాయి.

ఐటి కంపెనీలు తన సిబ్బందితో మూడు షిఫ్ట్‌లుగా పనిచేయించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయినా సామాన్యుడికి అందుబాటులో ఉండే ఆటోలకు మాత్రం అనుమతిలేదు. ఆర్టీసీ బస్సులతోపాటు అవి కూడా నడిచే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ స్వంత వాహనాలున్నవారి ప్రయాణంతోనే హైదరాబాద్‌ ‌రోడ్లు బ్లాక్‌ అవుతున్నాయి. కొరోనా కేసుల సంఖ్య మరింతగా పెరుగుతున్న హైదరాబాద్‌ ‌లాంటి మహానగరంలో అనేక నిబంధనలతో సడలింపు విధిస్తేనే ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడుతుంటే, దేశ వ్యాప్తంగా ప్యాసింజర్‌ ‌రైళ్ళను నడుపడం, అటు విమానాల రాకపోకలను కూడా పునరుద్ధరిస్తున్న క్రమంలో హైదరాబాద్‌ ‌పరిస్థితేమిటని ఆందోళన ప్రజల్లో ఉంది. జనసమ్మర్దంతో మళ్ళీ ఏం కొంప ముంచుకొస్తుందోనన్న భయంకూడా ప్రజలను వెన్నాడుతోంది. పలుదేశాల్లో ఇలా సడలింపులు విధించిన తర్వాత మళ్ళీ లాక్‌డౌన్‌ అమలు పర్చాల్సిన పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఒక్కరోజునే మనదేశంలో నాలుగువేలకు పైచిలుకు కొత్తగా కొరోనా కేసులు నమోదైనాయంటే వైరస్‌ ‌విజృంభణ ఏవిధంగా ఉందన్నదన్నది అర్థమవుతున్నది. ప్రజా రవాణాపై కట్టుదిట్టచర్యలు తీసుకోకపోతే ఇంతకాలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పడిన శ్రమంతా వృథా అయ్యే అవకాశాలు లేకపోలేదు.

Comments (0)
Add Comment