దేశంలో తగ్గని కొరోనా ఉధృతి

తాజాగా కొత్తగా 2,58,089 మందికి పాజిటివ్‌..385 ‌మంది మృతి

8,209కి చేరిన ఒమిక్రాన్‌ ‌కేసులు

టీకా తీసుకోవాలని ఎవరినీ బలవంతం చేయం : సుప్రీమ్‌ ‌కోర్టుకు అఫిడవిట్‌లో కేంద్రం స్పష్టం

న్యూ దిల్లీ, జనవరి 17 : దేశంలో రోజువారీ కొరొనా కేసులు స్వల్పంగా తగ్గినా.. వైరస్‌ ఉధృతి కొనసాగుతున్నది. ఆదివారం నమోదైన కేసుల కంటే సోమవారం రోజున 5 శాతం తక్కువగా కేసులు నమోదయినా దేశంలో కొరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య భారీగా నమోదవుతూ రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా 24 గంటల్లో కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తాజాగా దేశంలో 2,58,089 కేసులు నమోదు కాగా మహమ్మారి కారణంగా ఒక్కరోజే 385 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్ ‌బులెటిన్‌ను విడుదల చేసింది. ఆదివారంతో పోల్చుకుంటే..13,113 కేసులు తగ్గినట్లు కేంద్రం పేర్కొంది. కాగా.. దేశంలో పాజిటివిటి రేటు గణనీయంగా పెరుగుతుంది. 24 గంటల్లో 16.28 శాతం నుంచి 19.65 శాతానికి పెరిగింది. వారం పాజిటివిటీ రేటు 14.41 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 16,56,341 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా ఆదివారం కొరోనా నుంచి 1,51,740 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,53,37,461 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 94.27 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,73,80,253కి చేరగా.. మరణాల సంఖ్య 4,86,451కి పెరిగింది. దేశంలో కొరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ‌సైతం అలజడి సృష్టిస్తుంది. రోజురోజుకూ ఒమిక్రాన్‌ ‌కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇప్పటి వరకు దేశంలో 8,209

ఒమిక్రాన్‌ ‌కేసులు నమోదయ్యాయి. 6 శాతం కేసులు పెరిగాయి. ఇప్పటి వరకు దేశంలో 157.20 కోట్ల టీకా డోసులను వేసినట్లు కేంద్రం తెలిపింది. భారత్‌లోని 29 రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌కేసులు నమోదవుతున్నాయి. కేసుల పెరుగుదల కారణంగా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్‌ ‌కర్ఫ్యూ, వీకెండ్‌ ‌కర్ఫ్యూలను అమలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. దేశంలో వ్యాక్సినేషన్‌ ‌పక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతుంది. తాజాగా 24 గంటల్లో 39 లక్షల డోసులు పంపిణీ చేశారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీలో కేసులు నమోదవు తున్నాయి. మహారాష్ట్రలో ఆదివారం 41,327 కొత్త కొరోనా వైరస్‌ ‌కేసులు నమోదయ్యాయి. 29 మంది ఈ మహమ్మారితో మరణించారు. ఢిల్లీలో ఆదివారం 18,286 కొరోనా కేసులు నమోదు కాగా.. 28 మంది మరణించారు.

 

టీకా తీసుకోవాలని ఎవరినీ బలవంతం చేయబోమని కేంద్ర సర్కారు స్పష్టం చేసింది. తీసుకునే వారి అనుమతి తీసుకున్నాకే..వారికి వ్యాక్సినేషన్‌ ‌చేస్తామని సుప్రీమ్‌ ‌కోర్టుకు కేంద్రం తెలిపింది. డోర్‌ ‌టూ డోర్‌ ‌వ్యాక్సినేషన్‌, ‌దివ్యాంగులకు టీకా కార్యక్రమంపై ఓ ఎన్జీవో ఫౌండేషన్‌ ‌వేసిన పిటిషన్‌ ‌విచారణ సందర్భంగా.. సుప్రీమ్‌ ‌కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం పై వ్యాఖ్యలు చేసింది. టీకా తీసుకోవాలని ఎవరినీ బలవంతం చేయబోమని, ప్రజలు తమకు నచ్చితేనే టీకా వేయించుకోవాలని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది.

Comments (0)
Add Comment