కొరోనా..నష్టంతోపాటు లాభం చేసిందా ?

దేశాన్ని ్లఅకల్లోలంలో ముంచిన కొరోనా నష్టంతో పాటు కొంత లాభం కూడా చేసిందంటున్నారు పర్యావరణవేత్తలు. కొరోనా పేరు వింటేనే ప్రపంచ దేశాలన్ని భయపడిపోతున్నాయి. అన్నిట్లో అగ్రగామిగా పేరున్న అమెరికా ఈ వైరస్‌ ‌కారణంగా తీవ్రంగా నష్టపోయింది. ఒక్క అమెరికా ఏమిటి అన్ని దేశాల్లో ప్రధానంగా మానవనష్టంతో పాటు ఆర్థికంగా కృంగిపోయాయి. ప్రపంచ ప్రజలంతా ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతు న్నారు. అన్ని దేశాల ప్రభుత్వాలు కూడా తమ శక్తికి మించి ప్రజలను అన్ని రకాలుగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నా కష్టాలు కడతేరడం లేదు. గడచిన నెలన్నర రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌లోనే కొనసాగుతున్నాయి. మన దేశంలో మార్చ్ 22 ‌నుండి మొదలైన లాక్‌డౌన్‌ ‌మే 17 వరకు కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం మాత్రం మే 29వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు  తెలిపింది. లాక్‌డౌన్‌ ‌సందర్భంగా దేశంలోని 130 కోట్ల ప్రజలు ఇంటికే పరిమితం కావడం దేశ చరిత్రలోనే వింత అనుభవం. నిత్యావసర సరుకులు మినహా వ్యాపార సంస్థలన్నీ మూసివేయబడ్డాయి. ఆకాశ, రోడ్డు, రైలు మార్గాలన్ని ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.

ఒకటిరెండు కిలోమీటర్లు తప్పించి జనసంచారం స్థంబించిపోయింది. అయినా ఎక్కడి నుండి సోకుతున్నదోగాని దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో జనం మృత్యువాత పడక తప్పలేదు. ఇంత విషాదాన్ని కలిగించిన కొరోనా వైరస్‌ ‌కారణంగా పర్యావరణానికి మాత్రం మేలు జరిగిందంటున్నారు శాస్త్రవేత్తలు. రోజూ రోడ్లమీద సెకన్‌కు పదుల సంఖ్యలో పరిగెత్తే వాహనాలవల్ల వచ్చే కాలుష్యం ఇప్పుడు లేకుండా పోయింది. వాహనాలతో చెలరేగే దూళి, వాహనాల పొగగొట్టాలు వదిలే నల్లటి, ఘాటైన పొగ గత నెలన్నర రోజులుగా మటుమాయమైంది. ప్రజా రవాణా పూర్తిగా స్థంబించిపోవడంతో రైళ్ళు, బస్సుల్లో పయనించే లక్షలాది మంది జాడలేకుండా పోయింది. చివరకు ఆకాశమార్గంలో పయనించే విమానయానం కూడా లేకుండా పోవడంతో వాతావరణంలో ప్రశాంతత చేకూరింది. ఈ విషయంలో కేంద్ర కాలుష్య నివారణ శాఖ చాలారోజుల కింద 103 నగరాల్లో జరిపిన పరిశీలనలో దాదాపు 90 నగరాల్లో తొంబై శాతం కాలుష్యం తగ్గినట్లు నిర్ధారణైంది. ఇప్పటికి మరింతగా తగ్గి ఉంటుంది.

ఈ కాలుష్య గాలి పీల్చడం ద్వారా ప్రతీ ఏటా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వారందరికి లాక్‌డౌన్‌ ఒక విధంగా రక్షణ కల్పించిందనుకోక తప్పదు. కాలుష్య నగరాల్లో ఢిల్లీ మొదటిస్థానంలో ఉంటూ వస్తున్నది. ఎన్ని రకాలుగా నివారణ చర్యలు చేపట్టినా లాభం లేకుండా పోతున్నది. సరి, బేసి సంఖ్య వాహనాలను నడపడం, పాఠశాలలకు సెలవులివ్వడం, ప్రభుత్వ కార్యాలయాల పనివేళ్ళల్లో మార్పులు చేయడం లాంటివేవీ కాలుష్యాన్ని నివారించేలకపోయాయి. కాని, కొరోనా కారణంగా నిర్బంధంగా అమలుపర్చిన లాక్‌డౌన్‌తో మెరుగైన ఫలితాలు కనిపించాయని పర్యావరణవేత్తల విశ్లేషణ.  ఢిల్లీలో గత సంవత్సరం ఇదే రోజుల్లో పరిస్థితిని పరిశీలిస్తే  గాలిలోని కాలుష్య కారకాలు ఒక్క ఘనపు మీటరుకు 72 నుంచి 187 మైకోగ్రాములుగా నమోదైంది. అదే లాక్‌డౌన్‌లో సూక్ష్మాతి సూక్ష్మ ధూళి కణాల స్థాయి 35 శాతం తగ్గిందంటున్నారు. అలాగే అహ్మదాబాద్‌, ‌పూణెల్లో 15 శాతం వరకు తగ్గింది, శ్వాసకోశ సమస్యలకు కారమయ్యే ఆక్సైడ్‌ ‌కాలుష్యం ముంబయిలో 43 శాతం తగ్గినట్లు నివేదికలులు తెలుపుతున్నాయి. హైదరాబాద్‌, ‌బెంగుళూరు, చెన్నై లాంటి మహా నగరాల్లో కూడా నైట్రోజన్‌ ‌డయాక్సైడ్‌ ‌వాయువు పరిణామాలు మునుపటితో పోలిస్తే 40 నుండి 50 శాతం తగ్గినట్లు తెలుస్తున్నది.
ఇదిలా ఉంటే మనదేశంలో అతి పవిత్రంగా భావించే జీవనదుల్లో కూడా కాలుష్య శాతం తగ్గడం విశేషం. పర్యాటకులు అత్యధికంగా సందర్శించి పుణ్యస్నానాలు ఆచరించే గంగా, యమున నదుల్లో చాలావరకు మలినాలు లేకుండా స్వచ్చమైన నీరు పారుతున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. పుణ్యస్నానాల పేరిట విడిచిన బట్టలు, ప్లాస్టిక్‌ ‌సంచులు, బాటిల్స్, ఇతర వస్తువులను విసర్జించడం ద్వారా ఏర్పడే కాలుష్యతోపాటు ఈ నదులు దేశంలో ఎంత వరకైతే పారుతున్నాయో అన్ని ప్రాంతాల్లోని చిన్న, పెద్ద పరిశ్రమలు విడుదలచేసే  వ్యర్థ కాలుష్యకారకాలతో నిండిపోయేవి. కాని ఇప్పుడు లాక్‌డౌన్‌ ‌కారణంగా పరిశ్రమల మూతతో నదుల్లో కాలుష్య తగ్గింది. ఏప్రిల్‌ ‌మొదటివారంలో ఢిల్లీలోని యమునా నదిలో 30 శాతం కాలుష్యం తగ్గిందని పర్యావరణ వేత్తలు తెలిపారు. అలాగే గంగా నదినిప్పుడు చూస్తే నీళ్ళన్నీ తేటగా కనిపిస్తున్నాయి. ఇలానే కొనసాగితే గంగా ప్రక్షాళన అవసరం లేకుండా పోతుందనేది వాస్తవం. ఇదిలా ఉంటే పుణ్యనదుల్లో స్నానం చేస్తే సర్వపాపాలు హరిస్తాయన్న నమ్మకముంది. దాని సంగతెలాఉన్నా గంగా నీళ్ళలో ప్రపంచ మహమ్మారిగా మారిన కొరోనా వైరస్‌ను నిరోధించే శక్తి దాగి ఉన్నట్లుగా వార్తలు విహరిస్తున్నాయి. ఈ నీటిలో నింజా అనే బాక్టీరియా ఉంటుం దనేది వాటి సారాంశం. దానిలో కొరోనా లాంటి వైరస్‌లను అంతం చేసే శక్తి ఉంటుందని, అందుకే దీనిపై పరిశోధనలు జరుపాలని విన్నపాలు వస్తున్నాయి. మొత్తం మీద కొరోనా భయంతో సకల జనులు ఇంటికే పరిమితం కావడంతో ఎన్నో ఏళ్ళుగా  కాలుష్య కాసారాలుగా ఉండిపోయిన  నదులు, నగరాలు తేరుకోవడం శుభపరిణామం.

Comments (0)
Add Comment