బాయిల్డ్ ‌రైస్‌ ‌కొనేలా కేంద్రాన్ని ఒప్పించండి

  • బిజెపి నేతలపై మంతి హరీష్‌ ‌రావు మండిపాటు
  • సిద్ధిపేటలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

రాష్ట్ర బిజెపి నేతలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ బిజెపి నేతలు  అనవసరంగా నోరు పారేసుకోకుండా బాయిల్డ్ ‌రైస్‌ ‌కూడా కొనుగోలు చేసేలా కేంద్రాన్ని ఒప్పించాలన్నారు. సోమవారం సిద్ధిపేటలోని వ్యవసాయ మార్కెట్‌ ‌యార్డులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో 6 మెట్రిక్‌ ‌టన్నుల సామర్థ్యం గల గోదాంలు ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 35 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల సామర్థ్యం గల గోదాంలను నిర్మించామన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు ప్రత్యేక కృషి వల్లే తెలంగాణలో వ్యవసాయం సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి పెరిగిందన్నారు. ఎంత పంట వొచ్చినా కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వడ్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందడం లేదనీ ఆరోపించారు.  యాసంగిలో పారా బాయిల్డ్ ‌రైస్‌ ‌తీసుకోమని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు. యాసంగిలో పారా బాయిల్డ్ ‌రైస్‌ ‌కొనాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి మూడుసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. యాసంగిలో పారా బాయిల్డ్ ‌రైస్‌ ‌కొనమని చెప్పడం సరికాదు. ఈ విషయాన్ని కేంద్రం పున:సమీక్షించాలన్నారు.

సిద్దిపేట జిల్లాలో వానాకాలం ధాన్యం పంట కొనుగోలుకు 396 వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామనీ, అన్ని గ్రామాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. వానాకాలంలో రికార్డ్ ‌స్థాయిలో 3 లక్షల 3 వేల ఎకరాలలో వరి సాగు అయిందనీ, 7 లక్షల 50 వేల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం దిగుబడి అయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌ద్వారా బోర్ల నుండి నీరు ఉబికి వొస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, 24 ‌గంటల ఉచిత విద్యుత్‌, ‌సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతుబంధు పంట పెట్టుబడి ఆర్థిక సహాయంతో జిల్లాలో వరి సాగు విస్తీర్ణం, దిగుబడి పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామరెడ్డి, ఏఎంసి ఛైర్మన్‌ ‌పాల సాయిరాం, వైస్‌ ‌ఛైర్మన నందిని శ్రీనివాస్‌, ఆత్మ కమిటీ ఛైర్మన్‌ ‌లక్కరసు ప్రభాకర్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment