కాంగ్రెస్‌ ‌పార్టీ రైతు రచ్చబండ

కాంగ్రెస్‌పార్టీ చేపట్టిన రైతు రచ్చబండకు అనూహ్య స్పందన వొస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రైతాంగం ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం గమనార్హం. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను కాంగ్రెస్‌ ‌నాయకులకు ఏకరువు పెడుతున్నట్లు వార్తలు వొస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో రాహుల్‌ ‌గాంధీ పర్యటన తర్వాత కాంగ్రెస్‌ ఒక విధంగా దూకుడు పెంచిందనే చెప్పవచ్చు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చనుకుంటున్న తరుణంలో అన్ని పార్టీలు తమ కార్యక్రమాలను పెంచుతున్నాయి. ఇంచుమించు అన్ని పార్టీలు పాదయాత్రలతో ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి.

కాంగ్రెస్‌ ‌కూడా వరుస కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నం చేస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రంపైన ఆధిపత్యం సాధించేందుకు అనేక ఎత్తుగడలు వేస్తుంది. పాదయాత్రలు ఒక పక్క, కేంద్ర నాయకులను తీసుకువచ్చి, కేంద్ర పథకాలు, నిధులు రాష్ట్రానికి ఏవిధంగా సమకూరుతున్నాయన్న విషయాలను ప్రజలకు సోదాహరణగా వినిపించే ప్రయత్నం మరోపక్కన చేస్తుంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి ఒకరి తర్వాత ఒకరుగా ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రధాని కూడా పర్యటించబోతున్నారు. టిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయమే కాకుండా, రాష్ట్రంపై కాషాయ జండా ఎగురవేయడం తథ్యమని ఆ పార్టీ ఘంటా పథంగా చెబుతుంది.

అదే తరహాలో ఇప్పుడు కాంగ్రెస్‌ ‌కూడా విస్తృత స్థాయిలో కార్యక్రమాలను చేపడుతూ గతంలో లేని విధంగా విపరీతమైన హామీలను గుమ్మరిస్తుంది. ఇప్పటివరకు పాదయాత్రలు, బస్సు యాత్రలు, ద్విచక్ర వాహన యాత్రలను కాంగ్రెస్‌ ‌పార్టీ నిర్వహించింది. తమ పార్టీ అధినాయకుడు రాహుల్‌ ‌గాంధీ చెప్పినట్లు పార్టీకి ప్రజలతో సంబంధాలు తెగిపోయాయి. ఆ సంబంధాలను తిరిగి పునరుద్దరింపచేసుకునేందుకు ఇప్పుడు వివిధ కార్యక్రమాలను ఆ పార్టీ చేపడుతుంది. అందులో భాగంగానే కేంద్ర నాయకులను రాష్ట్రానికి ఆహ్వానించాలన్నది ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది ఆ పార్టీ. తాజాగా రాహుల్‌ను వరంగల్‌కు తీసుకువచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో సుమారు వెయ్యి కిలో మీటర్ల పాదయాత్రనైనా ఆయనతో చేయించాలనుకుంటుంది. కాగా ఇటీవల రాహుల్‌ ‌రాక సందర్భంగా ప్రకటించిన వరంగల్‌ ‌డిక్లరేషన్‌ను ఇప్పుడు ప్రజల్లోకి తీసుకు వెళ్ళే కార్యక్రమంగా రైతు రచ్చబండను నిర్వహిస్తున్నది.

వరంగల్‌ ‌డిక్లరేషన్‌లో ప్రకటించిన హామీలన్నీ తు.చ తప్పకుండా పాటిస్తామని ఈ సందర్భంగా ప్రజలకు నమ్మకం కలిగించే పనిలో పడిందిప్పుడు కాంగ్రెస్‌. ‌తమను అధికారంలోకి తీసుకువస్తే ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని వరంగల్‌ ‌డిక్లరేషన్‌లో రైతులకు హామీ ఇచ్చింది. రైతులు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తమ ఉద్దేశ్యంగా చెబుతున్నది. ఇదే విషయాన్ని మరోసారి ప్రజలకు విషదీకరించి చెప్పేందుకు రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. శనివారం నుండి జూన్‌ 21 ‌వరకు అంటే నెల రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. సుమారు నాలుగు వందలమంది ముఖ్యనేతలతో రాష్ట్రంలోని వివిధ గ్రామాలు పర్యటించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేసుకున్న కాంగ్రెస్‌ ‌శనివారం శ్రీకారం చుట్టింది. ఒక్కో నాయకుడు కనీసం ముప్పై నుండి నలభై గ్రామాలు పర్యటించే విధంగా ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నారు.

తాము డిక్లరేషన్‌లో చెప్పినట్లు ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని ఈ సందర్భంగా రైతులకు భరోసా కలిపించే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో కొంతకాలంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర విషయంలో, పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కొనసాగుతున్న వివాదంపైన కూడా కాంగ్రెస్‌ ‌పార్టీ రైతులకు హామీ ఇస్తున్నది. గిట్టుబాటు ధరను కల్పించడంతోపాటు తాము అధికారంలోకి వొస్తే ప్రభుత్వపరంగానే కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నది. అనేక అవకతవకలకు కారణమవుతున్న ధరణి పోర్టల్‌ను రద్దు చేసి సులభతరమైన విధానాన్ని ప్రవేశపెడుతామని చెబుతున్నది. ఈ హామీలతో ఆ పార్టీ ముఖ్యనేతలంతా వివిధ ప్రాంతాల్లో రైతు రచ్చబండ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా వరంగల్‌ ‌డిక్లరేషన్‌ ‌ప్రకటించిన వరంగల్‌ ‌జిల్లాలో ఆత్మకూరు మండలం అక్కంపేటలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొని రైతులు ఎదుర్కుంటున్న అనేక సమస్యలపైన అవగాహన చేసుకోవడంతోపాటు, వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.

అలాగే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నెదునూరులో సీఎల్సీ నేత భట్టి విక్రమార్క, జగిత్యాల జిల్లా పోలాసలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, నల్లగొండ ఎంపి ఉత్తమకుమార్‌రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్‌ ‌నగర్‌ ‌నియోజకవర్గం పరిధిలోని వజినపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమానికి మంచి స్పందన వొచ్చినట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందన్న చందంగా, ప్రధానంగా రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించే తీరికలేని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌పంజాబ్‌ ‌రాష్ట్రంలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వడాన్ని కాంగ్రెస్‌ ‌పార్టీ తీవ్రంగా విమర్శిస్తూ,్న దే విషయాన్ని రైతాంగం దృష్టికి తీసుకువెళ్ళేందుకు ప్రయత్నిస్తుంది.

Comments (0)
Add Comment