సిట్టింగ్‌ ‌స్థానంకోసం కాంగ్రెస్‌.. అధికారంకోసం బిజెపి.. ప్రతిష్టగా టీఆర్‌ఎస్‌

మునుగోడు ఉప ఎన్నికల అన్ని రాజకీయ పార్టీల్లో టెన్షెన్‌ ‌పెంచింది. రానున్న శాసనసభ ఎన్నికలకు ఈ ఎన్నిక సెమీఫైనల్‌ అని పార్టీలన్ని భావిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ ‌తన సిట్టింగ్‌ ‌స్థానాన్ని ఏ విధంగానైనా పదిలపర్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో సాధించుకున్న స్థానాల్లో అధికశాతం స్థానాలు ఆ  పార్టీ చేజారిపోయాయి. ఇప్పుడు మిగిలింది అయిదుగురు ఎంఎల్‌ఏలు మాత్రమే. ఈ ఎన్నికలో విజయం సాధించడంద్వారా పోయిన తన ప్రతిష్టను కొంతలోకొంత అయినా నిలబెట్టుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది.  దాంతో మునుగోడుపై రాష్ట్ర, కేంద్ర నాయకత్వాలు ఫోకస్‌పెట్టాయి. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల తొమ్మిది నుండి 15వరకు ‘ఆజాద్‌ ‌గౌరవ యాత్ర’ను నిర్వహిస్తున్నది. ఆ మరుసటి రోజునుండి పూర్తిగా మునుగోడు నియోజకవర్గాన్ని చుట్టుముట్టే ప్రణాళిక రచిస్తోంది.  పార్టీలోని కీలక నేతలందరినీ బృందాలుగా ఏర్పాటు చేసి, నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయడంతోపాటు, తాజా మాజీ ఎంఎల్‌ఏ ‌కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈ నెల 21న బిజెపి తీర్థం పుచ్చుకుంటున్న తరుణంలో ఆయనతో ఇతర నాయకులెవరూ పార్టీని విడిచి వెళ్ళకుండా ఈ బృందాలు బాధ్యతగా వ్యవహరించాలని పార్టీ సూచించింది.

ఒకవైపు ఎట్టిపరిస్తితిలో సిట్టింగ్‌ ‌స్థానాన్ని నిలుపుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తుంటే, పార్టీ టికట్‌ ‌విషయంలో అంతర్ఘత కలహాలు మొదలైనాయి. ఈ  ఉప ఎన్నికలో పోటీ పడేందుకు పలువురు నేతలు సిద్దమవుతున్నారు. ముఖ్యంగా టికట్‌ ఆశిస్తున్న వారిలో పాల్వాయి స్రవంతి, పల్లె రవికుమార్‌గౌడ్‌, ‌పున్నా శైలేష్‌నేత, చల్లమల్ల కృష్ణారెడ్డి లాంటివారున్నారు. టికట్‌ను దక్కించుకునే విషయంలో వీరితోపాటు మరికొందరుకూడా తీవ్రస్తాయిలో ప్రయత్నాలు చేస్తుండగా ముందు పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి, తర్వాతే టికట్‌గురించి అంటోంది అధిష్టానం. కాగా శనివారం స్థానిక నేత, యాదాద్రి జిల్లా పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గంలో పాదయాత్రను తలపెట్టారు. ఆ యాత్రలో పిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డికూడా పాల్గొనే అవకాశం ఉంది.

అసలు ఈ ఎన్నికలు రావడానికి బిజెపియే కారణమన్న టాక్‌ ‌నడుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌కేంద్ర రాజకీయాల్లో ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఆయన్ను నివారించే క్రమంలోనే ఈ ఎన్నికకు బిజెపి ప్లాన్‌ ‌వేసిందన్నది టిఆర్‌ఎస్‌ ఆరోపణ. శాసనసభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా ఈ ఎన్నిక తమ మైలేజీని పెంచుతుందన్నది బిజెపి భావనగా కనపిస్తున్నది. ఈ ఉప ఎన్నికలో గెలువడంద్వారా అధికారానికి మార్గం సులభతరం అవుతుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే అనేక సార్లు కేంద్ర నాయ••త్వం హైదరాబాద్‌ ‌రావడం, సమావేశాలు నిర్వహించడం జరుగుతున్నది. తాజాగా మునుగోడు ఎంఎల్‌ఏ ‌రాజీనామా చేయడం, ఆయన ఈ నెల 21న ఇక్కడికి రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమక్షంలో కాషాయ కండువ కప్పుకోబోవడం లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మునుగోడు ఎంఎల్‌ఏ ‌రాజగోపాల్‌రెడ్డి ఒక్కడే కాదు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆ పార్టీ ఏర్పాటుచేసిన చేరికల కమిటీ అందించిన జాబితాలోని నేతలందరికీ కాషాయ కండువను కప్పనున్నారు. వీరిలో టిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌లోని అసంతృప్తి నాయకులు,  రిటైర్డ్ ఐపిఎస్‌, ఐఏఎస్‌ ‌లుకూడా ఉండడం విశేషం. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన పన్నెండు మంది ఎంఎల్‌ఏలు రావడానికి సిద్దంగా ఉన్నారని బిజెపి చెబుతుండడం సంచలనం సృష్టిస్తోంది. ఈ సందర్భంగా మునుగోడులో భారీ ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ ఇప్పటికే ప్రకటంచింది. ఇందుకోసం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు తరుణ్‌ ‌చుగ్‌ ‌శుక్రవారమే హైదరాబాద్‌ ‌చేరుకుని జాబితాను పరిశీలించే కార్యక్రమం చేపడుతున్నారు. ఆలాగే ప్రజాసమస్యల అధ్యయన కమిటి తోకూడా సమావేశం కానున్నారు.

రాష్ట్రంలో ఇంతకుముందు జరిగిన రెండు ఉప ఎన్నికల్లో ఆ స్థానాలను జారవిడుచుకున్న టిఆర్‌ఎస్‌ ఈ ‌స్థానాన్ని ఎట్టిపరిస్థితిలో  ఒదులుకోవద్దన్న ఉద్దేశ్యంగా పార్టీ శ్రేణులను సమాయత్తపరుస్తున్నది. దూకుడుగా ముందుకు వస్తున్న బిజెపికన్నా ముందే నియోజకవర్గంలో భారీస్థాయిలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 20న సుమారు లక్షమందితో ‘ప్రజా దీవన’ పేరుతో ఏర్పాటు చేసే ఈ సభ ద్వారా బిజెపికి చెక్‌ ‌పెట్టాలనుకుంటున్నది.. కాగా టిఆర్‌ఎస్‌ ఉప ఎన్నికలో పోటీచేసే అషావహుల జాబితాకూడా బాగానే ఉంది. ఇప్పటికైతే  మాజీ ఎంఎల్‌ఏ ‌కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నల్లగొండ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల పార్టీ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో పలువురు కార్యకర్తలు ప్రభాకర్‌రెడ్డి పట్ల తమ అసంతృప్తిని వ్యక్తపర్చారు.

ఆయనకు టికట్‌ ఇస్తే తాము సహాయనిరాకరణ చేస్తామని అధినేత కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాయడం  ఆ పార్టీలో అనైక్యతను  తెలుపుతున్నది. ఈ విషయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్‌రెడ్డికి కెసిఆర్‌ ‌బాధ్యతలను  అప్పగించడంతో ఆయన పలు దఫాలుగా స్థానిక నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇదిలాఉంటే  ఈసారి మునుగోడు ఉప ఎన్నికలో పోటీపడాలని తెలుగుదేశం పార్టీకూడా ఉత్సాహం చూపుతోంది. ఇక వైఎస్‌ఆర్‌టిపి, బిఎస్పీ, పార్టీలు ఉండనే ఉన్నాయి. మునుగోడులో మొదటినుండి సిపిఐకి ఎక్కువ బలం ఉంది. గతంలో ఆరు సార్లు ఈ స్థానాన్ని గెలుచుకున్న చరిత్ర ఆ పార్టీకి ఉంది. దీంతో ఆ పార్టీకూడా ఈసారి రంగంలోకి దిగే అవకాశాలున్నాయన్న టాక్‌ ‌వినిపిస్తున్నది. మొత్తంమీద మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

– మండువ రవీందర్‌రావు
bjp govtCongress for sitting positionpolitical parties in telanganaTelugu News Headlines Breaking News NowTRS for prestigeతెలుగు వార్తలు
Comments (0)
Add Comment