చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ (16) ముఖ్యమంత్రి అభినందనలు…

శిక్షణ, ఇతర ఖర్చుల కోసం రూ. 2.5 కోట్లు మంజూరు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15:  అత్యంత పిన్న వయస్సులోనే చెస్ క్రీడలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణ చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ (16) ‘వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్’  హోదాకు అర్హత సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫెడరేషన్ వారు గ్రాండ్ మాస్టర్ హోదాను ప్రకటించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్  ప్రణీత్ ను, వారి తల్లిదండ్రులను సోమవారం సెక్రటేరియట్ కు పిలిపించుకుని, ప్రణీత్ ను దీవించారు. కష్టపడి ప్రణీత్ కు శిక్షణ ఇప్పించి, గొప్పగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను ఈ సందర్భంగా సీఎం అభినందించారు.
చెస్ క్రీడ పట్ల ప్రణీత్ కున్న అభిరుచి, కఠోర సాధనే తనను గ్రాండ్ మాస్టర్ గా తీర్చిదిద్దాయని సీఎం అన్నారు. భవిష్యత్ లో ప్రణీత్ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, తెలంగాణకు, భారతదేశానికి గొప్ప పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ….. భవిష్యత్ లో ప్రణీత్ చెస్ క్రీడలో సూపర్ గ్రాండ్ మాస్టర్ గా ఎదిగేందుకు కావాల్సిన శిక్షణ, ఇతర ఖర్చుల కోసం రూ. 2.5 కోట్లను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రణీత్ తల్లిదండ్రులు సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తూ, క్రీడారంగాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయనడానికి ప్రణీత్ గ్రాండ్ మాస్టర్ గా ఎదిగిన తీరే నిదర్శనమని సీఎం అన్నారు.
వుమన్ క్యాండిడేట్ మాస్టర్’వీర్లపల్లి నందిత కు రు.50లక్షలు..
అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడలో రాణిస్తూ వరల్డ్  చెస్ ఫెడరేషన్ ద్వారా ‘వుమన్ క్యాండిడేట్ మాస్టర్’ గా గుర్తింపు పొందిన వీర్లపల్లి నందిత (19) ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. నందిత అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో కీర్తిశిఖరాలను అధిరోహించేందుకు అవసరమైన శిక్షణ, ఇతర ఖర్చుల కోసం రూ. 50 లక్షలను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ దిశగా తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా సీఎం కేసీఆర్ తన కార్యదర్శి భూపాల్ రెడ్డిని ఆదేశించారు.
prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment