చెదపట్టిన చేతి వృత్తి! !’

ఆరడుగుల చీరెను

అగ్గిపెట్టెలో అమర్చిన

నేతన్న ప్రతిభా కౌశలానికి

నేడు..అడుగడుగునా

అగచాట్ల అంకుశ పోట్లే!

అనిలో పోగు అల్లకంతో

ఆరితేరిన అతని చేతుల్లో

అగ్ని గుండాలు సుడిగుండాలై

సుళ్ళు తిరుగుతున్నాయి!

మిల్లు వస్త్రాల దుందుకుడుతో

ఉవ్వెత్తున ఎగసిపడే

పోటీ అలల విజృంభణకు

తల్లడిల్లి ఈసురోమంటున్న

నేతన్నల బతుకు చిత్రం

ఛిన్నాభిన్నమై కొట్టుకుపోతుంది!

జలగలైన మాస్టర్ వీవర్స్

శ్రమ దోపిడీ దందాకు

వొంట్లోని ప్రతి రక్తపు బొట్టు

ఆవిరై అదృశ్యమవుతుంది!

నాణ్యతా ప్రమాణాల కంటే

ఆకర్షణ వశీకరణ మంత్రానికి

లొంగిపోతున్న మనం

చేనేత వస్త్ర రంగాన్ని

గొంతు నులిమి

ప్రాణాలు తీస్తున్నాం!

నాగరికత మోజుతో

స్వదేశీ చేతి వృత్తిని

సమూలంగా నాశనం చేస్తున్నాం!

ఆ వృత్తినే జీవనోపాధి చేసుకుని

ప్రాణాలను ధారపోస్తున్న

నేతన్న కుటుంబాన్ని

ఉరికంబం ఎక్కిస్తున్నాం!

ఎన్నెన్ని ప్రభుత్వాలు మారినా

మరెన్నో సంబరాల చేసుకున్నా

నేతన్నల బ్రతుకులు మాత్రం

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే!

ఓట్లు దండుకునే

రాజకీయ సాములోరికి

నేతన్నల బ్రతుకు చిత్రం

తిలకించే తీరుబడి దొరకడం లేదు!

ప్రభుత్వం ఉదార భావంతో

తక్కువ ధరకు నూలు,

రసాయనాల రంగులు ఇచ్చి

నేసిన బట్టకు మార్కెట్ కల్పిస్తే

నేతన్నల బ్రతుకులు గాడినపడి

కాస్త..ఊపిరి తీసుకుంటాయి!

దివారాత్రులు ఇంటిల్లిపాదీ

పిల్లా-జెల్లా సాయంతో శ్రమించినా

చారెడు గంజి కూడా దక్కని

దుర్భర దారిద్య్ర దయనీయ స్థితి!

మగ్గం గుంటలో దిగబడి

ఏక బిగువున కాళ్లు, చేతులు

కదిలిస్తూ అల్లే చీరపై

కారే అతని చెమట చుక్కలు

అందాన్ని ఒలకబోసే

ఆకు పచ్చని రామ చిలుకలై

కొలువు తీరుతాయి!

రమణీయ శ్రీ రామాయణ

కథామృత భావ చిత్రాలై

జీవంతో తొణికిసలాడతాయి!

పడుగు-పేకల దారాల అల్లికలో

జీవితాన్ని ధారబోసే నేతన్న

ప్రపంచానికి బట్టలిచ్చే వస్త్రదాత!

తెగుతున్న దారాలను అతకడం కోసం

తన నరనరాన్ని జోడిస్తూ

శ్రమపడే బాధల భాగ్యదాత!

కష్టం తప్ప సౌఖ్యం ఎరగని

నిత్య శ్రామిక రారాజు నేతన్న!

సమస్యల వలయంలో చిక్కుపడిన

నేతన్న గొంతు పై ఎప్పుడూ

సవాళ్ల కత్తే!

కత్తుల బోనులో చిక్కుకున్న

నేతన్న బ్రతుకు చిత్రం

నిత్యం కష్టాల కొలిమిలో

ఆకలి మంటల జ్వాలల్లో

మాడి మసై ఆహుతి అవుతోంది!

వంగర. పరమేశ్వరరావు

హైదరాబాద్-38

9491400534

chenetha karmikulu
Comments (0)
Add Comment