ఉపాధ్యాయ సంఘాల చలో అసెంబ్లీ ఉద్రిక్తం

  • ఎక్కడికక్కడే అరెస్టు చేసిన పోలీసులు
  • అసెంబ్లీ పరిసరాల్లో మూడంచెల భద్రత
  • ఉపాధ్యాయుల సమస్యలు పట్టవా: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి 

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ ‌విధానాన్ని అమలు చేయాలని తక్షణమే పీఆర్సీని ప్రకటించాలనీ, ఏకీకృత సర్వీసు విధానం, పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ ‌చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. అంతకుముందే ఇందిరాపార్క్ ‌ధర్నా చౌక్‌ ‌నుంచి అసెంబ్లీకి ఉపాధ్యాయులు ర్యాలీగా వెళ్లనున్న నేపథ్యంలో పోలీసులు ఆ మార్గమంతా భారీగా మోహరించారు. అసెంబ్లీ ముట్టడి పిలుపు మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇందిరాపార్కు ధర్నా చౌక్‌కు ఉద్యోగ ఉపాధ్యాయులు భారీ సంఖ్ల్యలో చేరుకున్నారు.

కొద్దిసేపు నినాదాల అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీ ముట్టడికి బయల్దేరారు. ఈ సమయంలో కొందరు ఉద్యోగ, ఉపాధ్యాయులు పోలీసు వాహనాల నుంచి కిందకి దిగి అసెంబ్లీ వైపు పరెగెత్తే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసే ప్రయత్నం చేయడంతో అందుకు నిరసనగా ఉపాధ్యాయులు రోడ్డుపై బైఠాయించారు. రోడ్డుపై బైఠాయించిన ఉపాధ్యాయులను ఉపాధ్యాయులను పోలీసులు కాలర్‌ ‌పట్టుకుని బలవంతంగా ఈడ్చుకెళ్లారు. ఈక్రమంలో పోలీసులు, ఉద్యోగుల మద్య వాగ్వాదం…తోపులాట జరిగింది.పోలీసుల ప్రవర్తనపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు భద్రతను ఛేదించుకుని ముందుకు రావడంతో పోలీసులు వారిని అరెస్ట్ ‌చేశారు.

అరెస్ట్ ‌చేసినవారిని వివిధ పోలీస్‌ ‌స్టేషన్‌లకు తరలించారు. దీంతో పోలీసులు బలవంతగా ఉపాధ్యాయులను తిరిగి వాహనాలలో ఎక్కించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులను సైతం పురుష పోలీసులు తమ వాహనాలలోకి ఎక్కించడం వివాదాస్పదంగా మారింది. పురుష పోలీసులు తమను ఎలా అరెస్టు చేస్తారంటే మహిళా ఉపాధ్యాయులు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, శుక్రవారం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తమ సమస్యల పరిష్కారం కోసం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగింది. ఆయా జిల్లాలలో పోలీసులు ఉపాధ్యాయ సంఘాల నేతలను, ఉపాధ్యాయులను ఇళ్లలోకి వచ్చి అరెస్టు చేయడంపై ఉపాధ్యాయు సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగుల సమస్యలు పట్టవా : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి:
విద్యారంగాన్ని టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన ఉద్యోగ, ఉపాధ్యాయులపై పోలీసుల అనుచిత ప్రవర్తనను ఖండిస్తున్నట్లు చెప్పారు. పాత పెన్షన్‌ ‌విధానం రద్దుతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు తక్షణమే పీఆర్సీని ప్రకటించాలనీ, వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక విధంగా ఆ తరువాత మరొక రకంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల దీర్ఘకాల సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ, లేనిపక్షంలో భారీ ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా నర్సిరెడ్డి హెచ్చరించారు.

Chalo AssemblyTeachers Unions
Comments (0)
Add Comment