కాళేశ్వరంపై విచారణకు కెసిఆర్‌ను పిలిస్తే తప్పేముంది…

  • వివరాలు తెలుసుకోవాలనుకోవడంలో తప్పు లేదు
  • కొన్ని విషయాల్లో మోదీని నమ్మి మోసపోయాం
  • అనవసరంగా నోట్ల రద్దుకు మద్దతు ఇచ్చాం
  • బిఆర్‌ఎస్‌ 8 నుంచి 9 సీట్లు సాధిస్తుంది
  • మీడియాతో చిట్‌చాట్‌లో కెటిఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : కాళేశ్వరంపై విచారణకు మాజీ సీఎం కేసీఆర్‌ ను పిలిస్తే తప్పులేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే మాజీ ముఖ్యమంత్రి నుంచి తెలుసుకోవాలనుకోవడం తప్పులేదంటూ చమత్కరించారు. తాము కేంద్రంలోని బీజేపీ సర్కారుకు అంశాల వారీగానే మద్దతు ఇచ్చామని అన్నారు. ప్రధాని మోదీ మాట నమ్మి నోట్ల రద్దుకు సహకరించామని చెప్పారు. తర్వాత చెంపలేసుకున్నామని అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో వ్నిడియాతో కేటీఆర్‌ చిట్‌ చాట్‌లో ఆయన మాట్లాడతూ…కడియం శ్రీహరి పార్టీకి ద్రోహం చేశారని పేర్కొన్నారు.

ఆయన వరంగల్‌ ప్రజలను వంచించారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీవి ఉద్దెర పథకాలని, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని అన్నారు. ఈ లోక్‌ సభ ఎన్నికల్లో తమ పార్టీ 8 నుంచి 9 సీట్లలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొంచం గట్టిగా ప్రయత్నిస్తే 12 సీట్లు గెలుస్తామని కేటీఆర్‌ చెప్పారు. వోట్లు వేయకుంటే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఎత్తేస్తానని సీఎం బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి చాలా తెలివైనోడని, కావాలనే ఈటలను మునగ చెట్టు ఎక్కించారని అన్నారు. ఈటల రాజేందర్‌ను ఇప్పటి వరకు రెండు సార్లు ఓడిరచామని, మూడో సారి కూడా ఓడిస్తామని చెప్పారు. సీఎం రేవంత్‌ రెడ్డికి, భట్టి విక్రమార్కకు ఓడిపోతున్నామని అర్థమైందని అన్నారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ లీడర్ల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు. వాళ్లు మళ్లీ వస్తామన్నా తమ పార్టీలోకి రానివ్వబోమని చెప్పారు. ఏపీలో తమకున్న సమాచారం మేరకు వైఎస్సార్‌ సీపీ విజయం సాధించబోతున్నదని అన్నారు.

హరీష్‌ రావు రాజీనామా సవాల్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించాలని అన్నారు. ఒట్లు ప్రమాణాలు కాదని సవాల్‌ను స్వీకరించాలని అన్నారు.  దమ్ముంటే హరీష్‌ రావు సవాల్‌పై రేవంత్‌ రెడ్డి స్పందించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు. రేవంత్‌ రెడ్డి తన సొంత జిల్లాలో గెలవడం కూడా కష్టమే అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. రేవంత్‌ రెడ్డిది మాట నిలుపుకున్న చరిత్ర కాదని, కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నాడని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుస్తామని చెప్పి ఓడిపోయిన తర్వాత మాట తప్పాడని కెటిఆర్‌ విమర్శించారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోసం పార్ట్‌-1 జరిగిందని, పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు మోసం పార్ట్‌ -2 కొనసాగుతుందని, ఎట్టి పరిస్థితుల్లో రేవంత్‌ రెడ్డి రుణమాఫీ చేయడని, నేతి బీరకాయలో నెయ్యి ఉండని తీరుగానే రేవంత్‌ రెడ్డి మాటల్లో నిజాయితీ ఉండదని, ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన పార్టీకే రేవంత్‌ రెడ్డి కట్టుబడి లేడని, ఆయన ఏ సవాల్‌కు కట్టుబడి ఉన్నాడో చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ రెండు పార్టీలు తమకు రాజకీయ ప్రత్యర్థులేనని, ఈ రెండు పార్టీలు చేసిన ద్రోహానికి దేశానికి ఎంతో నష్టం జరిగిందని, అందుకే కాంగ్రెస్‌, బీజేపీలను తిరస్కరించి ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నామన్నారు.

కాంగ్రెస్‌కు బీజేపీని ఎదుర్కునే శక్తి లేదని, బీజేపీని ఎదుర్కునే శక్తి ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉందని, శక్తి లేకనే రాహుల్‌ గాంధీ ఉత్తర భారతదేశం నుంచి కేరళకు పారిపోయిండని విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఒత్తిడి చేసిన ఎదుర్కుని బీజేపీని తట్టుకుంటున్నది ప్రాంతీయ శక్తులేనని అన్నారు. ఒకనాడు ఎన్టీ రామారావు భారతదేశం అనే పార్టీ పెట్టాలనుకున్నాడని, కానీ ఆయన శిష్యుడు కేసీఆర్‌ జాతీయ పార్టీ పెట్టాడని, ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో అయినా విస్తరించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని, ప్రస్తుతానికి తెలంగాణలో పూర్వ వైభవం సంతరించుకోవటానికి కష్టపడుతున్నామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Comments (0)
Add Comment