‘ ‌సిట్‌ ’ ‌బంధంలో బిఆర్‌ఎస్‌…

అధికార బిఆర్‌ఎస్‌ ‌చక్రబంధంలో చిక్కుకుపోయింది. రానున్న ఎన్నికల్లో తమకు ఏ పార్టీ పోటీ కాదన్న ధీమాతో ఉన్న ఆ పార్టీకి ఊహించని షాక్‌ ‌తగిలింది. ఒకవైపు లిక్కర్‌ ‌కుంభకోణం మరో వైపు పేపర్‌ ‌లీకేజీ ఇప్పుడు ఆ పార్టీని ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాయి. దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చెందుకు బిఆర్‌ఎస్‌ ‌పేరున జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ పార్టీ గతంలోకన్నా మరింత ఎక్కువ చిక్కులను ఎదుర్కోవాల్సి   వొస్తుంది.. ప్రధానంగా రెండు జాతీయ పార్టీలు – కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, అధికారం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్‌ ‌పార్టీలు ఏ చిన్న అవకాశం దొరికినా బిఆర్‌ఎస్‌ను కడిగిపారేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయంలోనైతేనేమీ, ఇతర పథకాల అమలు, పాలనా తీరుపై ఈ రెండు పార్టీలు బిఆర్‌ఎస్‌ ‌పైన విరుచుకుపడుతున్నాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న పై రెండు సంఘటనలపై వొస్తున్న విమర్శలు ఆ పార్టీని గుక్కతిప్పుకోనివ్వకుండా ఉన్నాయి. ఒకటి జాతీయ స్థాయిలో విచారణ జరుగుతుండగా, రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే సిట్‌ ‌విచారణపైన తమకు నమ్మకం లేదని విపక్షాలు వాదిస్తుండడంతో టిఎస్‌పిఎస్సీ పేపర్‌ ‌లీక్‌ ‌వ్యవహారం రాజకీయ రంగుపులుముకుంది. విచిత్రమేమంటే అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ తప్పును ఎదుటి పార్టీలపై తోస్తూ, దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

అందుకు కారకులు మీరంటే మీరని బహాటంగానే విమర్శించుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార బిఆర్‌ఎస్‌- ‌కాంగ్రెస్‌, ‌బిజెపి మధ్య ఈ విషయంలో మాటల యుద్ధం కొనసాగుతోంది. లక్షలాది మంది నిరుద్యోగులను అయోమయంలో పడేసిన పేపర్‌ ‌లీక్‌ ‌వ్యవహారంలో  బిజెపి ప్రమేయం ఉందని బిఆర్‌ఎస్‌ ‌విమర్శిస్తుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌కుటుంబ ప్రయేయాన్ని ఆ పక్షాలు ఎత్తి చూపుతుండడంతో రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడిగా మారాయి.  ముఖ్యంగా రాష్ట్ర మున్సిపల్‌, ‌పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు కార్యాలయం నుండే పేపర్‌ ‌లీక్‌ అయిందని బిజెపి, కాంగ్రెస్‌లు ఆరోపిస్తున్నాయి. అందుకు కెటిఆర్‌ను బాధ్యుడిగాచేసి ఆయన ను విచారించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ‌కాంగ్రెస్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేపర్‌ ‌లీక్‌ ‌వ్యవహారం బయటికి వొచ్చినప్పటినుండీ ఆరోపిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో సిట్‌తో కాకుండా సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ ‌చేస్తున్న సంజయ్‌, ఈ ‌వ్యవహారం అంతు చూసేవరకు వొదిలిపెట్టేదేలేదంటున్నారు.

ముఖ్యంగా ఒకే ఊరిలో (అంటే కెటిఆర్‌ ‌నియోజకవర్గం సిరిసిల్లలో) ఎక్కువ మంది క్వాలిఫై అవడం అందులో బిఆర్‌ఎస్‌ ‌నేతల పిల్లలకే ఎక్కువ మార్కులు రావడమే ఇందుకు నిదర్శనంగా ఆయన ఆరోపిస్తున్నారు. రేవంత్‌ ‌రెడ్డి కూడా అదే వాదన చేస్తున్నారు. సిరిసిల్లలోనే ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారంటే దీని వెనుక ఖచ్చితంగా మంత్రి కెటిఆర్‌ ‌ప్రమేయం ఉందని, అందుకు సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ చేపడితేనే వాస్తవాలు బయటికి వొస్తాయని  ఆయన డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఈ విషయమై ఆయన తమ పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అయితే సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన వీరిద్దరినుండి సిట్‌ ‌వివరణ కోరింది. తమ ముందు హాజరు కావాల్సిందిగా వీరిద్దరికి సిట్‌ ‌నోటీసులు జారీ చేసింది. దీంతో గురువారం సిట్‌ ‌బృందం ముందు రేవంత్‌రెడ్డి హాజరైనారు. లీకేజీకి సంబంధించి తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను సిట్‌ అధికారులకు ఇచ్చినట్లు విచారణనుండి బయటికి వొచ్చి  మీడియా ముందు చెప్పినప్పటికీ,  వాస్తవంగా ఆయన తమకెలాంటి ఆధారాలను సమర్పించలేదని సిట్‌ అధికారులు వెల్లడించినట్లు వార్తలు వొచ్చాయి..  ఆరోపణలు చేసిన వారందరికీ నోటీసులు ఇచ్చి నోరు నొక్కాలని ప్రభుత్వం చూస్తున్నదని ఈ సందర్భంగా మీడియా ముందు ఆరోపించిన రేవంత్‌రెడ్డి,  లీకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు మంత్రి కెటి రామారావు దగ్గరే ఉన్నాయని, ఆయన ను  ఎందుకు విచారించడంలేదంటూ తాను సిడీ అధికారులను ప్రశ్నించినట్లు రేవంత్‌రెడ్డి పేర్కొనడం గమనార్హం.

ఇదిలా ఉంటే రేవంత్‌రెడ్డి లాగానే ఆరోపణలు చేసిన బండి సంజయ్‌ ‌కూడా ఈ నెల 24న సిడీ ముందు హాజరు కావాలసి ఉంది. తాను ఆరోపణ చేసినట్లు ఆయన లీకేజీకి సంబంధించి   ఆధారాలను సిట్‌కు సమర్పిస్తారా… వాటిని సిట్‌ ‌పరిగణలోకి తీసుకుంటుంది లేదా అన్నది రేపు తేలనుంది. ఏదియేమైనా ఎంతో కాలంగా ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు మాత్రం తీవ్ర వ్యధ చెందుతున్నారు. ఉద్యోగం వొస్తుంది అని అనుకున్నంతలోనే మరికొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా కాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నుండి ఒక్కో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలో 80 నుండి 90 వేల ఉద్యోగాల వరకు ఖాలీలున్నట్లు పలు సందర్భాల్లో అధికార పార్టీ వెల్లడించింది. రాష్ట్రంలో దాదాపు 30 లక్షలమంది నిరుద్యోగులు అవకాశాలకోసం ఎదురు చూస్తున్నారు. కాగా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌తో రాత్రి పగలు అనక లక్షలాది మంది నిరుద్యోగులు పరీక్షలకు సిద్ధమయినారు.ఆర్థిక స్థోమత లేకున్నా  ఉద్యోగం వొస్తుందన్న ఆశతో ఒక్కొక్కరు పలు పరీక్షలకోసం కోచింగ్‌ ‌తీసుకున్నారు. ఎలాగో ఒకలాగా కొన్నిపరీక్షలు జరిగాయనుకుంటే పిడుగులాంటి వార్త వారి భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చింది. అయిన పరీక్షలు, కాబోయే పరీక్షలన్నిటినీ ప్రభుత్వం రద్దు చేసింది. మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తానని చెబుతోంది. ఎవరో చేసిన తప్పుకు తమను బలిచేశారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్న నిరుద్యోగులు ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.  నిరుద్యోగుల సమస్యపై త్వరలో బిజెపి  మిలియన్‌ ‌మార్చ్ ‌తరహాలో ఉద్యమించడానికి  సిద్దపడుతోంది.  దేశరాజకీయాలపై దృష్టి సారిస్తున్న బిఆర్‌ఎస్‌కు పై రెండు సంఘటనలు సుడిగుండాలా చుట్టుముట్టాయి.  మరో ఎనిమిది నెలల్లో శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో అనుకోని ఈ హఠాత్‌పరిణామాలు ఆ పార్టీ వర్గాలను కలవరపెడుతున్నాయి.

BRS under Sitprajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment