నేషనల్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెమెంట్ పాలసీ తీసుకురండి

  • ధాన్యం సేకరణలో కేంద్రం, రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది
  • టీఆర్ఎస్ ఎంపీల ధర్నా
  • పార్లమెంట్, తెలంగాణ భవన్ లలో ఎంపీల ఆందోళన

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ ,నవంబర్ 29:ధాన్యం కొనుగోలు విషయంలో నేషనల్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ తీసుకురావాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. కొనుగోళ్ల విషయంలో రాష్ట్రాల మధ్య వివక్ష ఉండకూడదనీ , దేశం మొత్తంగా ఒకే పద్దతి అనుసరించాలి అని, ఏడాదికి ఒకే సారి రాష్ట్రాల వారిగా వార్షిక లక్ష్యాలు పెట్టాలని, దీన్ని బట్టి తెలంగాణతో పాటు, మిగతా రాష్ట్రాలు సాగుపై ప్లాన్ చేసుకుంటుందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లోపల, బయట ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డ అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. తెలంగాణ లో వరి ప్రొక్యూర్మెంట్ విషయంలో దుర్భరమైన పరిస్థితి ఉందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవ రావు అన్నారు. అయితే, ఈ టార్గెట్స్ ను కేంద్రం ఇవ్వడం లేదన్నారు. గతంలో కేంద్రం ఇచ్చిన టార్గెట్స్ ను, ఇప్పుడు ఎంఓయూ అంటోందని ఆరోపించారు. వానాకాలం రైస్ ను కేంద్రం పూర్తిగా లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కు ధాన్యంలో సాగులో వానాకాలం, యాసంగి వంటి రెండు పంటలు లు ఉన్నాయన్నారు. అయితే, యాసంగిలో వేసే వరి పంటలో హీట్ క్లైమట్ కారణంగా రైస్ విగిరిపోతుందని, అందువల్ల బాయిల్డ్ రైస్ రూపంలో పంట తీస్తామని చెప్పారు.

ఈ వాతావరణం పై ఎవరికైనా ఫిర్యాదు చేయాలంటే దేవుడికి చేయాలని, కానీ, ఆ దేవుడి అడ్రస్ తెలియదని, తెలిస్తే తానే వెళ్లి చేసే వాడిననన్నారు. ఫుడ్ సెక్యూరిటీ లా ప్రకారం… రాష్ట్ర అవసరాలు, సంక్షేమ పథకాలకు పోను మిగిలిన పంటను ఎఫ్ సిఐ ఎక్సెస్ కొనుగోలు చేస్తుందన్నారు. గత మూడేళ్లలో రాష్ట్రంలో రైతు బంధు, నీళ్లు, ఉచిత విద్యుత్, ఫార్మ్ ఇన్ పుట్స్, రైతు వేదికల ద్వారా రైతుల్లో అవగాహన కల్పిస్తూ ఈల్డ్ పెంచామన్నారు. ఈ వానాకాలంలో 1.2 కోట్ల టన్నుల రైస్ పండిందన్నారు. 62 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, ఈ పంట కొనాలని కోరితే, పంట సాగుపెరుగడంపై కేంద్రం ప్రశ్నించడాన్ని ఆయన తప్పు బట్టారు. రాష్ట్రంలో మూడేళ్ల నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఈల్డ్ ఎలా పెరిగిందని కేంద్రం అడగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాంటీ ఫార్మర్స్ విధానంతో బిజేపి ముందుకుపోతుందన్నారు. అకాల వర్షంతో ధాన్యం కాస్తా మొలకెత్తుతోంది, కష్టాల్లో ఉన్న రైతును ఆదుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ప్రతి ఏకరానికి నీళ్లు ఇవ్వడమా? ప్రపంచలోనే అత్యధికంగా ఈల్డ్ పెంచడమా? ప్రొడక్షన్ ఒకటిన్నర రెట్లు పెంచడమా? కేసీఆర్ చేసిన తప్పా అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి తీసుకోవడం లేదని, పంజాబ్ నుంచి కొనుగోలు చేస్తుందని… ఈ వివక్ష ఉండకూదని డిమాండ్ చేశారు.

వీటన్నింటిని చెక్ పెట్టేలా నేషనల్ ఫుడ్ గ్రేయిన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ, రాష్ట్రాల మధ్య ధాన్యం కొనుగోళ్లలో వివక్ష లేకుండా కొనుగోళ్లు, ప్రస్తుతం ఉన్న బాయిల్డ్ రైస్ ప్రొక్యూర్మెంట్, ఈ వానాకాలంలో ఎంత ధాన్యం కొంటారో చెప్పాలన్నారు. పార్లమెంట్‌ లో పంట కొనుగోళ్లపై వాయిదా తీర్మానాలు ఇస్తే, స్పీకర్‌ తిరస్కరించారని నామా నాగేశ్వర్ రావు అన్నారు. కనీసం, 3 అగ్రి చట్టాల రద్దు బిల్లుపై చర్చకు అవకాశం వస్తే, తమ సమస్యను లేవనెత్తుదామని భావించినట్లు చెప్పారు. పంటల కొనుగోళ్లపై చర్చకు నిరాకరించడంతో ఆందోళన చేశామని, వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు కూడా ఏకపక్షంగా చర్చ లేకుండా ఆమోదించారన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రెండు నెలలుగా కేంద్రంతో చర్చలు జరుపుతుంటే.. కేంద్రం చేతులెత్తివేసిందని ఆరోపించారు.

దేశ రైతాంగం రోడ్లపై ఉంటే.. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వకుండ ఇప్పుడు తెలంగాణ రైతుల్ని కేంద్రం రోడ్డున పడేలా చేస్తుందన్నారు. దిల్లీ పర్యటనలో కేసీఆర్‌ కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారని చెప్పారు. సాగు విషయంలో తెలంగాణను, రైతులను, తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం అవమానిస్తుందన్నారు. ఏడేళ్ల కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టి రైతాంగాన్ని బలోపేతం చేశామని తెలిపారు. పంటల సాగు, ఉత్పత్తి పెంచేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత తీసుకురావాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతాంగానికి సంబంధించిన అంశం కాబట్టి మిగతా పార్టీల ఎంపీలు కుడా తమతో కలిసి రావాలని కోరారు. తెలంగాణ ఎంపీలంతా ఉభయ సభల్లో కలిసి పోరాడాలన్నారు. లేదంటే రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని, రానున్న కాలంలో ప్రజా ప్రతినిధులను నమ్మే పరిస్థితి ఉండదంటూ హితవు పలికారు.

National Food GrainsparliamentProcurement PolicyTRS MP's
Comments (0)
Add Comment