- ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు తొలి ప్రాధాన్యం
- ఆయా రాష్ట్రాల్లో ప్రారంభించిన సిఎంలు, మంత్రులు
- 5.75 కోట్ల మంది మూడో డోస్ టీకాకు అర్హులని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి
న్యూ దిల్లీ, జనవరి 10 : కొరోనా కేసులు మరోసారి భారీగా పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా సోమవారం నుంచి ప్రికాషన్ డోసు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏండ్లపైబడిన వారికి బూస్టర్ డోసు వేస్తున్నారు. అందులో భాగంగా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై బెంగళూరులోని అటల్ బిహరీ వాజ్‌పేయ్ మెడికల్ కాలేజీలో ప్రికాషన్ డోస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా తమిళనాడు సీఎం స్టాలిన్ చెన్నైలో బూస్టర్ డోస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు పోలీసులకు, సీనియర్ సిటిజన్లకు ప్రికాషన్ డోస్ ఇచ్చారు. తెలంగాణలో కూడా మంత్రి హరీష్ రావు బూస్టర్ డోస్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న సిబ్బందిని ఫ్రంట్ లైన్ వర్కర్లుగానే పరిగణించనున్నారు. వీరిలో బూస్టర్ డోసుకు అర్హులైనవారికి ఇప్పటికే ఎస్‌ఎంఎస్‌లు పంపినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్ సుఖ్ మాండవీయ తెలిపారు.
రెండో డోసు తీసుకున్న వారు 9 నుంచి 12 నెలల గ్యాప్‌లో బూస్టర్ డోసు తీసుకోవాలని ఆయన సూచించారు. దేశంలో కోటి ఐదు లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు, ఒక కోటి 9 లక్షల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు, 2 కోట్ల 75 లక్షల మంది 60 ఏండ్ల పైబడినవారు ప్రికాషన్ డోసు వేసుకోనున్నారు. గతంలో తీసుకున్న టీకానే బూస్టర్ డోసు కింద ఇవ్వనున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. కోవాగ్జిన్ తీసుకున్న వారికి కోవాగ్జిన్.. కోవిషీల్డ్ తీసుకున్న వారికి కోవిషీల్డ్ ఇవ్వనున్నారు. కోవిడ్-19 ప్రికాషన్ డోసు పొందాలనుకుంటున్న లబ్దిదారులు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న, అర్హులైన వారు నేరుగా అపాయింట్‌మెంట్ తీసుకోవటం లేదా నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి టీకా తీసుకోవచ్చని తెలిపింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా సోమవారం నుంచి బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా మొత్తం 5.75 కోట్ల మంది మూడో డోస్ టీకాకు అర్హులని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. 18 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోసులు ఇచ్చే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోగ్యశాఖ తెలిపింది. తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు వైద్యుల సలహా మేరకు మూడో డోసు తీసుకోవాలని కేంద్రం తెలియజేసింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ బూస్టర్ డోసులు ఇవ్వాలనే డిమాండ్ పెరగడంతో డిసెంబర్ 25వ తేదీన ప్రధాని మోడీ బూస్టర్ డోసుపై నిర్ణయం తీసుకున్నారు.