తెలంగాణపై పట్టుకోసం బిజెపి వ్యూహాత్మక అడుగులు

రానున్న శాసనసభ ఎన్నికల్లో తెలంగాణపైన కాషాయ జండాను ఎగురవేయాలన్న లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందుకు ఆపార్టీ జాతీయ స్థాయి నాయకత్వం డైరెక్షన్‌ ‌చేస్తుండగా, రాష్ట్ర నాయకత్వం యాక్షన్‌లోకి దిగుతున్నది. వొచ్చే నెల రెండు, మూడు తేదీల్లో రాష్ట్ర రాజధానిలో జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించేందుకు బిజెపి నిర్ణయించింది. వాస్తవంగా ప్రధాని నరేంద్రమోదీ సొంత• రాష్ట్రం గుజరాత్‌తో పాటు హిమాచల్‌ ‌ప్రదేశ్‌ల్లో ఈ సంవత్సరం చివర్లో శాసనసభ ఎన్నికలు జరుగాల్సి ఉన్నాయి. అలాంటప్పుడు అక్కడ కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే నిర్వహించడం వెనుక రాజకీయ ఎత్తుగడ లేకపోలేదు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వొచ్చే అవకాశాలున్నాయి. అధికారపార్టీ దీనిపైన పెద్దగా స్పందించకపోయినా, చేస్తున్న కార్యక్రమాలు, వేస్తున్న ఎత్తుగడలు అదే విషయాన్ని చెప్పేవిగా ఉన్నాయి. 2018లో కూడా అధికార టిఆర్‌ఎస్‌ ‌ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సిద్దం కావడానికి సమయం పట్టింది. కాని, కెసిఆర్‌ ఎత్తుగడలను అర్థం చేసుకుంటున్న ప్రతిపక్షాలు ఎన్నికలు ఎప్పుడు వొచ్చినా ఎదుర్కునేందుకు ఇప్పుడు సిద్దపడుతున్నాయి. బిజెపి అందుకు ముందునుండే రంగం సిద్దంచేసుకుంటోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇప్పటికే రెండు విడుతల పాదయాత్రలు నిర్వహించడంద్వారా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోని పలు గ్రామాలను చుట్టబెట్టారు.

ఈ సందర్భంగా ఆయన దృష్టికి వొచ్చిన అనేక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ దుయ్యబడుతూనే ఉన్నారు. ఈ పాదయాత్రల ముగింపు సందర్భంగా జాతీయ నాయకులను తీసుకురావడం, వారితో కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా, హార్థికంగా రాష్ట్రాన్ని ఏమేరకు అదుకుంటున్నదన్న విషయాలను చెప్పించడంద్వారా ఆ పార్టీ ప్రచారంలో దూసుకుపోయిందనే చెప్పవొచ్చు. ఇక పోతే రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల ఎంపిక ప్రక్రియను కూడా దాదాపు ఆ పార్టీ పూర్తిచేసింది. కాకపోతే అధికారికంగా ఇప్పటివరకు అరవై మందిని ఎంపిక చేయడంతోపాటు వారిని ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జీలుగా నియమించింది. కాగా ఏదో కారణంగా జాతీయ స్ధాయి నాయకులను రాష్ట్రానికి రప్పించి అధికార టిఆర్‌ఎస్‌పైన మాటల యుద్దాన్ని ఆ పార్టీ కొనసాగిస్తోంది. ఈ విషయంలో ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా ఆ పార్టీ వొదులుకోవడంలేదు. తెలంగాణ ప్రాంతానికి నిజాం నుండి నిష్కృతి లభించిన సెప్టెంబర్‌ 17‌న విమోచన దినోత్సవంగా అధికారికంగా చేయాలని తెలంగాణ అభిమానులతోపాటు బిజెపి కూడా చాలా కాలంగా పట్టుపడుతోంది.అయితే ఈసారి కేవలం డిమాండ్‌తోనే ముగించకుండా ఆ పార్టీ స్వయంగా కార్యక్రమాన్ని చేపట్టి దానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

ఎన్నడూ లేని విధంగా తాజాగా తెలంగాణ అవతరణ ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం దిల్ల్లీలో జరిపింది. ఈ కార్యక్రామానికి కూడా అమిత్‌షాతోపాటు రాష్ట్రానికి చెందిన మరో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణపై పట్టు సాధించడంలో భాగంగానే ఆ పార్టీ కొత్తగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నదన్న విషయం స్పష్టమవుతున్నది.

ఈ సందర్భంగా తెలంగాణలో రానున్న ఎన్నికల్లో విజయం తమదేనని చెప్పడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపినట్లు అయింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వొచ్చినప్పుడు నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలుపుకోలేక పోయిందంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్‌ ‌తన ఇంట్లో దీక్ష చేపట్టినా, పోలీసులు అరెస్టుచేసి ఆయన్ను జైల్‌ ‌పెట్టినప్పుడు ఆ సంఘటనను నిరసిస్తూ బిజెపి పార్టీకి చెందిన ఛత్తీస్‌ఘడ్‌ ‌ముఖ్యమంత్రి రమణసింగ్‌, ‌మధ్యప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌లు వొచ్చి నిరసన తెలపడం, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్న వివాదాల నేపథ్యంలో రాష్ట్ర పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లో బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొనడం చూస్తుంటే ఎట్టి పరిస్తితిలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీని గద్దె దించేవరకు విశ్రమించేదిలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్న దానికి నిదర్శంగా నిలుస్తున్నది. ఖమ్మంలో బిజెపి కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న సంఘనటపైనకూడా జాతీయ స్థాయి నాయకులు స్పందించడం, రాష్ట్రంలో పర్యటించడాన్ని చూస్తుంటే కేంద్ర నాయకత్వం ప్రతీ చిన్న విషయంలో స్పందించాలన్న లక్ష్యంగానే ఉన్నట్లు స్పష్టమవుతున్నది.

ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో పర్యటించిన అమిత్‌షా ఎస్సీలు, గిరిజనులతో సహపంక్తి భోజనం చేయడం, వారితో సాంస్క్రృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం అ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగమేనన్నది స్పష్టమవుతున్నది.అంతేకాకుండా తెలంగాణలో బిసి వర్గాల సంఖ్య ఎక్కువే. జనాభాలో సుమారు 56 శాతం ఉన్న బిసి వర్గాలను వోటు బ్యాంకుగా మార్చుకునే విషయంలో ఆ పార్టీ శక్తిమేర కృషిచేస్తున్నది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎం‌పి ధర్మపురి అరవింద్‌, ‌తాజాగా రాజ్యసభకు ఎన్నికైన డాక్టర్‌ ‌లక్ష్మణ్‌, ‌హుజురాబాద్‌ ‌నుండి శాసనసభకు ఎన్నికైన ఈటల రాజేందర్‌ ‌వీరంతా బిసిలు కావడంతో తమ పార్టీ వారికి ఎంత ప్రాధాన్యత నిస్తున్నదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జూలై రెండు, మూడు తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు మరోసారి ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా రాబోతున్నారు. ఇటీవలనే రాష్ట్రంలోని బిజెపి సర్పంచ్‌లతో దిల్లీ లో సమావేశమైన ప్రధాని ఇప్పుడు రాష్ట్రంలో రెండు రోజుల పాటు బస చేస్తున్న నేపథ్యంలో ఎవరెవరిని కలువనున్నారన్న విషయమై చర్చ జరుగుతోంది. ఆయన సమక్షంలో ఎవరు పార్టీలో చేరబోతున్నారన్నదిప్పుడు ఆసక్తిగా మారింది. కాగా ఈ సమావేశాల్లో పాల్గోనేందుకు దేశంలోని పద్దెనిమిది బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వొస్తుండడం విశేషం. వీరితో పాటు మరికొందరు పార్టీ జాతీయ స్థాయి నాయకులు వేంచేయనున్నారు.

ఇందుకుగాను రాష్ట్ర రాజధాని అంతా కాషాయమయం కానుంది. ఈ సందర్భంగా ఎందరు కాషాయ కండువలను కప్పుకుంటారోగాని, బిజెపి తన లక్ష్యం దిశగా దూసుకుపోతున్నదన్నది మాత్రం స్పష్టం.

Comments (0)
Add Comment