- ఏపీ చట్టవిరుద్ధ నీటి వినియోగంపై తాత్సారం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఎత్తిపోతల సామర్ధ్యం పెంపునకు కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కృష్ణా నదిలో తెలంగాణ వాటా 299 టీఎంసీల నీటిని సైతం పూర్తిగా వినియోగించుకోవడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్ద్యం పెంపుపై టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష వైఖరికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు నిరసన దీక్షలు నిర్వహించారు. ఈ మేరకు సంజయ్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేఆర్‌ఎంబీ చైర్మన్ బ్రిజేష్ కుమార్ ఆదేశాలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం జీవో 203ని జారీ చేసిందని పేర్కొన్నారు.
తాజా జీవోతో పాత రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలపై దుష్ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి విషయంలో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను విస్మరించారని విమర్శించారు. టెలీమెట్రీల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతుంటే కేసీఆర్ సకాలంలో స్పందించలేదని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం చట్ట విరుద్ధ నీటి వినియోగంపై టీఆర్‌ఎస్ సర్కార్‌కు పట్టింపు లేని కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ధ్వజమెత్తారు. వాస్తవానికి పోతిరెడ్డిపాడు నుంచి 11000 క్యూసెక్కుల శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను ఎత్తిపోయాలనీ, అయితే అందుకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం 44000 క్యూసెక్కులకు దాని సామర్ధ్యాన్ని పెంంచారని పేర్కొన్నారు. దీనిని కూడా మరింత పెంచి తాజాగా80,000 క్యూసెక్కుల మేరకు సామర్ధ్యం పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనీ, దీనినైనా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డుకోవాలని ఈ సందర్భంగా సంజయ్ డిమాండ్ చేశారు.