రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా ?

  • దళారీ వ్యవస్థను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

‌రాష్ట్రంలో కరోనా వైరస్‌ ‌నియంత్రణకు లాక్‌డౌన్‌ ‌విధించిన నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విమర్శించారు. పంటల కొనుగోలులో దళారీ వ్యవస్థను ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నదనీ, అధికారులే దళారీలుగా మారి రైతుల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. రైతులు పండించిన ప్రతీ పంటనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న డిమాండ్‌తో ఆయన శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఆవరణలో ఒకరోజు ఉపవాస దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఐకేపీ, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కనీస సౌకర్యాలు లేవని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో మంత్రులు పర్యటిస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయనీ, అయితే, మంత్రులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కేవలం ప్రకటనలతోనే సరిపెడుతున్నారని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ ‌సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో రైతులు తమ ధాన్యానికి గిట్టుబాటు ధర లభించక తగులబెట్టుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

లాక్‌డౌన్‌ ‌నిబంధనలు పాటిస్తూ నిరసనలు తెలిపినప్పటికీ రైతులపై కేసులు పెడుతున్నారనీ, ఓవైపు రైతులను ఆదుకుంటామని ప్రకటిస్తూనే మరోవైపు వారిపై కేసులు పెడుతూ ప్రభుత్వం ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నదని ధ్వజమెత్తారు.మంత్రుల మాటలు రైతులను కించపరిచే విధంగా ఉన్నాయనీ, పంటను కేంద్రమే కొనుగోలు చేస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ‌పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ అన్యాయం జరుగుతోందనీ, ఆరేళ్లుగా సీఎం కేసీఆర్‌ ‌హోం క్వారంటైన్‌లో ఉన్నారనీ, ఆ అనుభవాలను తెలుసుకోవడానికే ప్రధాని కేసీఆర్‌కు ఫోన్‌ ‌చేశారేమో అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కొరోనా నియంత్రణకు ప్రధాని సీఎంకు ఫోన్‌ ‌చేస్తే దానిని కూడా ఆయన తన ప్రచారానికి వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రైతుల ఇబ్బందులను గమనించినా ఆదుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. వడగండ్ల వానతో రాష్ట్రంలోని రైతులకుతీవ్ర నష్టం ఏర్పడింది…కొనుగోళ్లలో రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి..ప్రతిపక్షం చేసిన సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, తేమ, తాలు పేరుతో ధాన్యాన్ని దోపిడీ చేస్తున్నారు, పంటల కొనుగోళ్లకు రూ. 30 వేలు పెడితే మద్దతు ధర ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని రైతులకు బీజేపీ సంఘీభావంగా ఉంటుందనీ, వారు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రైతులకు • సంఘీభావంగా బీజేపీ పదాధికారులు, జిల్లా, మండల అధ్యక్షులు లాక్‌డౌన్‌ ‌నిబంధనలు పాటిస్తూనే తమ ఇళ్లలోనే నిరసన దీక్షను కొనసాగించారని ఈ సందర్భంగా బండి సంజయ్‌ ‌తెలిపారు.

Bandy SanjayBJP state presidentfire on govt
Comments (0)
Add Comment