బాణం గురి ఎటువైపు..?

“అసలు షర్మిల చెబుతున్న రాజన్న రాజ్యం సాధ్యమేనా అన్న ప్రశ్న వస్తుంది. రాయలసీమ గడ్డ పై పుట్టి… రాజన్న రాజ్యం పేరుతో ఆ సీమ ప్రయోజనాలకు స్వయంగా షర్మిలే భంగం కలిగించే ప్రమాదం లేదా? అన్నది మరో వాదన. ఉదాహరణకు రాయలసీమ ఎత్తిపోతల పథకమే ఉంది. సీమ గొంతు తడపటానికి, పొలాల బీడు బారకుండా చూడటానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం కట్టితీరతాం అని జగన్ సర్కార్ చెబుతోంది. ఈ ప్రాజెక్టును తెలంగాణా తప్పుబడుతోంది. తెలంగాణా రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని వాదిస్తోంది. మరి తెలంగాణాకు కమిటెడ్ గా ఉంటాను అన్న షర్మిల …రేపటి రోజు సీమకు అన్యాయం చేయటమే తమ పార్టీ విధానంగా తీసుకుంటారా…రాజశేఖర రెడ్డి బతికి ఉంటే ఆయన వైఖరి కచ్చితంగా ఇలా అయితే ఉండదుగా. చర్చకు కూర్చుంటే ఇటువంటి అనేక కీలక అంశాలు తెర మీదకు వస్తాయి.”

వైఎస్ షర్మిల కొత్త పార్టీ ప్రకటన పై గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ చర్చలకు బ్రేక్ వేస్తు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. మొదటి అడుగుగా ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో ఆమె సమావేశమయ్యారు. ఎక్కువ సస్పెన్స్ లేకుండా పార్టీ ప్రకటన పై కొన్ని ప్రాధమిక ప్రశ్నలకు అయితే ఆమె సమాధానం ఇచ్చారు. తెలంగాణా గడ్డ పై ఆమె పార్టీ ప్రారంభించనున్నారు.

తెలంగాణా ప్రజల ప్రయోజనాల కోసం షర్మిల కమిటెడ్ గా పని చేయనున్నారు. అదే విధంగా వెంటనే ఇటు అన్న, ఏపీ సీఎమ్ వైఎస్ జగన్మోహన రెడ్డి అధ్యక్షతన ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఎక్కువ స్పెక్యులేషన్స్ కు తావు లేకుండా తమ వైపు నుంచి క్లారిటీ ఇచ్చేసింది. తెలంగాణా రాష్ట్రంలో పార్టీ విస్తరణ వైఖరికి తాము విరుద్ధం అని, కొత్త పార్టీ పెట్టడం అంత తేలిక కాదు వద్దు అని వారించినా షర్మిల తన అడుగులు ముందుకు వేశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్టా రెడ్డి సవివరంగా చెప్పిన మీడియా సమావేశంలో వెల్లడించారు. తమ ఆశిస్సులు మాత్రమే ఉంటాయని, రాజకీయంగా సహకారం ఉండదని కూడా తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యం నుంచి షర్మిల వేస్తున్న కొత్త పార్టీ అడుగుల ఉద్ధేశాన్ని, వ్యూహాల్ని చూడాల్సి వస్తుంది.

వ్యూహమా? ఆగ్రహమా?

అన్న వదిలిన బాణాన్ని అని జగన్ జైల్లో ఉన్నప్పుడు అన్న తరపున మూడు వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసిన షర్మిల…ఇవాళ అదే అన్న పై ఆగ్రహంతో పార్టీ పెడుతున్నారు అన్న ప్రచారం ఓ వైపు జరుగుతోంది. అన్న అధికారంలోకి రావటానికి తన వంతుగా ఎండనక, వాననక కష్టపడిన…నాకు దక్కింది ఏమిటనే ప్రశ్నే ఇవాళ కొత్త పార్టీ దిశగా అడుగులు వేయించిందని సన్నిహిత వర్గాల్లో నానుతున్న చర్చ. నిజమే కదా ఓ రాజ్య సభ సీటు అన్న ఇస్తే ఏం పోతుంది అని కౌంటర్ వాదన కూడా అదే స్థాయిలో జరుగుతోంది. ఇంకా కొంచెం లోతైన వర్గాల నుంచి వచ్చిన సమాచారంలోకి వెళితే బ్రదర్ అనీల్ ఆర్ధిక ప్రయోజనాలు ఏదో ఆశించారు.

తాను ముఖ్యమంత్రి అయినంత మాత్రాన తన వారికి అందలం ఎక్కించాలనే విధానానికి సీఎమ్ విరుద్ధం కనుక…మోహమాటం లేకుండా మొండి చేయి చూపించారు అనేది మరో చర్చ. ఈగో హర్ట్ అయి అన్న వదిలిన బాణాన్ని అన్న మీదకే వదిలే విధంగా పావులు కదిపారనీ ఈ చర్చకు కొనసాగింపు జరుగుతోంది. దీనికి కౌంటర్ వాదనలూ జోరుగానే సాగుతున్నాయి. ఇదే నిజమైతే ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టి అన్నతో అమీ తుమీకి దిగి ఉండే వారు కదా. యుద్ధం చేయాల్సిన వ్యకి ఇక్కడ ఉంటే…గ్రౌండ్ పక్క రాష్ట్రాంలో ఎందుకు పెట్టుకుంటారు అనే ప్రశ్నలు లేకపోలేదు. అయితే వైసీపీ మాత్రం అన్నా చెల్లిల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాని విబేధాలు లేవు అని స్పష్టం చేశారు.

అన్న చెల్లెళ్లు లేదా వదినా మరదళ్ళ మధ్య పోరుగా తేలిగ్గా చెప్పటానికి లేదు…తెలంగాణాలో రాజన్న రాజ్యం తీసుకువస్తామని చెప్పటం వెనుక అసలు పెద్ద వ్యూహమే ఉందన్న వాదన మరోవైపు రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈ వ్యూహాలు కూడా రెండు, మూడు రకాలు సమీకరణాల్లో ఉన్నాయి. ఒకటి, కేసీఆర్ తెర వెనుక ఉండి షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారని. సంప్రదాయంగా కాంగ్రెస్ తో కలిసి ఉండే రెడ్డి సామాజిక వర్గం బీజేపీ వైపు మళ్ళకుండా ఇదో ఎత్తుగడ అన్నది ఒక ఈక్వేషన్. ఇదే నిజమైతే ఇంత పెద్ద వ్యూహానికి జగన్ అంగీకరిస్తారా… కేంద్రంలో ఉన్న బీజేపీ అగ్రనేతలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న జగన్ …కేసీఆర్ కోసం ఇలా రెండు నాల్కల వైఖరి తీసుకునే అవకాశాలు తక్కువే. జగన్ స్వభావ రీత్య కూడా ముక్కసూటి వైఖరే కాని ద్వంద్వ ప్రమాణాలు అనుసరించరు.

ఇక మరో వాదన కూడా ఉంది. బీజేపీనే షర్మిలను రంగంలోకి దించింది అన్నది ఈ ఈక్వేషన్. కారణం ఇక్కడ కూడా అదే. రెడ్డి, క్రైస్తవ ఓట్ బ్యాంకును షర్మిల పార్టీ ద్వారా కన్సాలిడేటెడ్ చేయించాలన్నది కాషాయదళం వ్యూహం. షర్మిల భర్త బ్రదర్ అనీల్ క్రైస్తవ మత ప్రచారకుడిగా గుర్తింపు ఉంది. ఆయన సభలకు భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఆ రకంగా తమ రాజకీయ ప్రయోజనాల కోసం షర్మిల ద్వారా ఈ వ్యూహాన్ని అమలు చేస్తోందని మరో చర్చ జరుగుతోంది. ఏది వాస్తవం అన్న విషయాలు తేలాలంటే మరి కొంత కాలం షర్మిల పార్టీ వైఖరిని గమనించాల్సిందే.షర్మిల పార్టీ అధికారికంగా ప్రారంభించాలి, ఆమె ఏ సమస్యలను ఎత్తుకుని ప్రజల్లోకి వెళుతున్నారో గమనించాలి, రాష్ట్రీయ, జాతీయ అంశాల్లో ఆ పార్టీ ఎటువంటి విధానపర వైఖరిని అవలంబిస్తుందో తెలియాలి.

రాజన్న రాజ్యం సాధ్యమేనా?
వీటన్నింటి కంటే అసలు షర్మిల చెబుతున్న రాజన్న రాజ్యం సాధ్యమేనా అన్న ప్రశ్న వస్తుంది. రాయలసీమ గడ్డ పై పుట్టి…రాజన్న రాజ్యం పేరుతో ఆ సీమ ప్రయోజనాలకు స్వయంగా షర్మిలే భంగం కలిగించే ప్రమాదం లేదా? అన్నది మరో వాదన. ఉదాహరణకు రాయలసీమ ఎత్తిపోతల పథకమే ఉంది. సీమ గొంతు తడపటానికి, పొలాల బీడు బారకుండా చూడటానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం కట్టితీరతాం అని జగన్ సర్కార్ చెబుతోంది. ఈ ప్రాజెక్టును తెలంగాణా తప్పుబడుతోంది. తెలంగాణా రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని వాదిస్తోంది. మరి తెలంగాణాకు కమిటెడ్ గా ఉంటాను అన్న షర్మిల … రేపటి రోజు సీమకు అన్యాయం చేయటమే తమ పార్టీ విధానంగా తీసుకుంటారా… రాజశేఖర రెడ్డి బతికి ఉంటే ఆయన వైఖరి కచ్చితంగా ఇలా అయితే ఉండదుగా. చర్చకు కూర్చుంటే ఇటువంటి అనేక కీలక అంశాలు తెర మీదకు వస్తాయి. రాజన్న రాజ్యం అన్న స్లోగన్ బాగుంటుంది కాని వాస్తవ రూపంలో … క్షేత్ర స్థాయిలో వైఎస్ విధానాలకు విరుద్ధంగానే షర్మిలా తన బాటను ఎంచుకున్నారన్న విమర్శలు ఎదుర్కొనటానికి ఆమె సిద్ధంగా ఉండాల్సి వస్తుంది.

new party statementrajanna rajyaS Rajasekhara Reddysharmila new partytelugu statesys sharmila latest press meeting
Comments (0)
Add Comment