దుమారం లేపిన బండి ‘ముద్దు’..

రాష్ట్ర గవర్నర్‌ ‌డా. తమిళి సై పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కౌశిక్‌ ‌రెడ్డి జాతీయ మహిళా కమిషన్‌ ‌ముందు హాజరు అయి క్షమాపణలు చెప్పిన ఘటన ప్రజలు మరవక ముందే భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌దిల్లీ మద్యం కుంభకోణం లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల అరెస్ట్ ‌ను ఉద్దేశించి చేసిన ‘ముద్దు’ వ్యాఖ్య దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే లేపింది. ఆంధ్ర ప్రదేశ్‌ ‌రాజకీయాల్లో కొనసాగుతున్న అసభ్య పదజాల వాతావరణం  తెలంగాణ కు వ్యాపించింది. బండి సంజయ్‌.. ఆయన ఈ వ్యాఖ్యను వాడుకలో ఉన్న సామెతగా అన్నారో లేక ఆనాలోచితంగా అన్నారోగాని అదిప్పుడు పెద్ద వివాదస్పదమైన అంశంగా మారింది. దీనిపై అటు మహిళా సంఘాలు, ఇటు బిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు తీవ్రంగా ధ్వజమెత్తడంతో ఇప్పుడిది రాజకీయ రంగు పులముకుంది. ఎట్టి పరిస్థితిలో బండి సంజయ్‌ ‌తన వ్యాఖ్యలను వెనక్కుతీసుకుని, వెంటనే బీఆర్‌ఎస్‌ ఎంఎల్సీ కల్వకుంట్ల కవితకు క్షమాపణ చెప్పాలంటూ ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ ‌పార్టీ మహిళలు, మహిళా మంత్రులు, జాతీయ జాగృతి మహిళా నాయకురాళ్ళు డిమాండ్‌ ‌చేయడంతోపాటు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు తెలంగాణ జిల్లాల్లో, దేశ రాజధాని దిల్లీలో సంజయ్‌కుమార్‌ ‌దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. దీనిపై జాతీయ, తెలంగాణ మహిళా కమిషన్‌లకు ఫిర్యాదు చేసేందుకు సిద్దపడుతుండగానే, తెలంగాణ మహిళా  కమిషన్‌ ‌చైర్‌పర్సన్‌ ‌సునీతా లక్ష్మారెడ్డి దీన్ని సుమోటోగా తీసుకోవడం కూడా మరో వివాదానికి దారితీసింది. రాష్ట్రంలోని మహిళలను అవమానిస్తున్న అనేక సంఘటనలు జరుగుతున్నప్పుడు స్పందించని మహిళా చైర్‌పర్సన్‌ ‌కవిత విషయంలో సుమోటాగా కేసును స్వీకరించడమేంటని బిజెపితో పాటు పలు రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయంలో తన సంజాయిషీని చెప్పుకునేందుకు బండి సంజయ్‌ని వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా చైర్‌పర్సన్‌ ‌సునీతా లక్ష్మారెడ్డి నోటీసులు జారీచేయడంతో పాటు, కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై చట్టప్రకారం చర్చలు తీసుకునే అవకాశాలను పరిశీలించాల్సిందిగా తెలంగాణ డీజీపీని ఆదేశించినట్లు తెలుస్తున్నది.

ఒకపక్క లిక్కర్‌ ‌స్కాంపైన దిల్లీలో కవితను ఈడి విచారిస్తున్న క్రమంలోనే హైదరాబాద్‌, ‌దిల్లీల్లో బిజెపిపై ఆందోళన కార్యక్రమం మొదలైంది. అయితే రెండు రోజుల క్రితంనాటి సంఘటనను ఈడి విచారణ రోజున్నే కావాలని బిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు వెలుగులోకి తీసుకొచ్చి ఆందోళన చేస్తున్నాయన్నది బిజెపి ఆరోపణ. లిక్కర్‌ ‌స్కాంలో కవిత దోషిగా నిరూపణ జరిగితే వెంటనే అరెస్టు చేసే అవకాశాలుండడంతోనే కావాలని అల్లర్లు సృష్టించేందుకు బిఆర్‌ఎస్‌ ‌ముందస్తు ప్రణాళికగా ఈ అంశాన్ని ఎత్తుకుందన్నది ఆ పార్టీ చేస్తున్న విమర్శ. ఏది యేమైనా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కవిత పైన చేసిన కామెంట్‌ ‌రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపు కుదుపుతున్నాయి. బీజెపి రాష్ట్ర కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలకు హాజరైన సంజయ్‌ ‌కవితపైన అనేక ఆరోపణలు చేశారు. బతుకమ్మకు తానే బ్రాండ్‌ అం‌బాసిడర్‌గా భావించే కవిత కృత్రిమ పూలతో బతుకమ్మలను పేర్చి, డీజే పాటలతో తెలంగాణ సంస్కృతిని దెబ్బతీసిందని సంజయ్‌ ‌ఘాటుగా విమర్శించారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ ‌కావాలన్న డిమాండ్‌తో దిల్లీ జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద గురువారం పెద్ద ఎత్తున దీక్షా కార్యక్రమాన్ని చేపట్టిన కవిత ముందుగా బిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర కమిటీలో మహిళల సంఖ్య గురించి, రాష్ట్ర క్యాబినెట్‌లో మహిళా మంత్రుల గురించి ముందుగా తేల్చుకోవాలన్న సూచన చేస్తూనే, ఈడీ విచారణలో కవిత అరెస్టుపై వొస్తున్న వార్తలపై స్పందిస్తూ ‘అరెస్టు చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా’ అంటూ వ్యాఖ్యానించడం పెద్ద దుమారమైంది.

రాజకీయ రంగు పులుముకుంది. పలు పార్టీల నాయకులు సంజయ్‌ ‌వ్యాఖ్యలను ఖండించారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని వెంటాడి వేటాడం బిజెపికి అలవాటని సిపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. మోదీకి జిందాబాద్‌ అం‌టే కవితను వెంటనే వొదిలేస్తారంటారాయన. తనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుండడం వల్లే కెసిఆర్‌ ‌కుటుంబాన్ని నరేంద్రమోదీ లక్ష్యంగా చేసుకున్నారని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ వ్యాఖ్యానించారు. కాగా కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాత్రం కవితను పార్టీ నుండి సస్పెండ్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌చేస్తుండగా, బీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు మాత్రం విరుచుకు పడుతున్నారు.  దిల్లీలోని తెలంగాణ భవన్‌ ‌వద్ద బిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు సంజయ్‌ ‌దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అయితే కవితను ఈడీ విచారిస్తున్న క్రమంలో 144వ సెక్షన్‌ అమలులో ఉండడంవల్ల పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాగా  బండి మానసిక స్థితి సరిగా లేదని వెంటనే హాస్పిటల్‌ ‌లో చేర్పించాలని బిఆర్‌ఎస్‌ ఎం‌పీ మలోతు కవిత ఆవేశపడ్డారు. తమ ప్రవర్తన మార్చుకోకపోతే చుక్కలు చూపిస్తామన్నారు. అలాగే మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి , సత్యవతి రాథోడ్‌లు సంజయ్‌ని తీవ్రంగా హెచ్చరించారు. ఇదిలా ఉంటే బండి సంజయ్‌ ‌రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌ముందు వ్యక్తిగతంగా హాజరవుతారా లేదా అన్న విషయంకూడా ఇప్పుడు మరో చర్చనీయాంశంగా మారింది.

Comments (0)
Add Comment