“విద్యా సంస్థలు మూతబడ్డాయి 118 రోజులవుతోంది. విద్యార్థులు ఇంట్లో ఉండలేక మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా టీవీలకు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయి అనారోగ్యం పాలవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల వారు చెరువుల దగ్గరికి చేపల వేటకు,ఈతలకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొందరు బాలకార్మికులుగా మారిపోయారు మరి కొందరు పశువుల గొర్రెల కాపరులు గా పనిచేస్తున్నారు. మొత్తంగా కరోనా వైరస్ విద్యార్థుల జీవితాన్ని అగమ్యగోచరంగా అస్తవ్యస్తంగా తయారుచేసింది. వారు ఇంకా ప్రమాదకర పరిస్థితులోకి పూర్తిగా నెట్టివేయబడకముందే విద్యాసంస్థలు తెరిచ్ఱె అవకాశాలను పరిశీలించాలి.”
సవాళ్ళు విసిరిన అనేక సంక్షోభాలను మనం సమర్థవంతంగా ఎదుర్కొన్నాం,కానీ ఈ శతాబ్దపు అతిపెద్ద సంక్షోభం కరోనా ప్రజల జీవిత గమనాన్ని సమ్మూలంగా కుప్పకూల్చింది.జీవితాలను ప్రశ్నార్ధకం చేసి,ఆశలను,జీవన అస్థిత్వాలను కూడా నిర్మూలించపూనుకున్నది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రజల ఆర్థిక స్థోమత చిన్నాభిన్నం అయ్యాయి. ఉపాధి పరంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో ఎంతో మంది ప్రజలు ఉపాధి అవకాశాలు కోల్పోయారు.
విప్పుకున్న లాక్‌డౌన్ తాళాల విచ్చలవిడితనం దారుల్లో కొరోనా విశ్వరూపం జూలై నెలంతా తన మృత్యుదాహాన్ని తీర్చుకుంటున్నది. కానీ లాక్డౌన్ విధింపు పరిణామాలు ప్రజలను చిత్రమైన ప్రపంచంలోకి నెట్టింది. లాక్ డౌన్ ప్రకటనకు వారం రోజులముందు నుండి విద్యాసంస్థలు మూతపడ్డాయి. అన్ని రకాల పరీక్షలు రద్దు అయ్యాయి. 1 నుండి 9 తరగతుల వారందరూ పై తరగతులకు ప్రమోట్ అయ్యారు.10 వతరగతి వారు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలో మార్కులు ఆధారంగా గ్రేడింగ్ పాయింట్లు ఇచ్చి అందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించారు.ఇంటర్ పరీక్షలు పూర్తి అవ్వగా,లాక్‌డౌన్ కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకొని ఇంటర్ వాల్యుయేషన్ పూర్తి కావడం మూలంగా ఫలితాలు ప్రకటించబడ్డాయి. తదుపరి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించడం పై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. అవి పూర్తిగా రద్దు అయ్యాయి. డిగ్రీ పీజీ పరీక్షలు ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి.
ఇంజనీరింగ్,మెడిసిన్ తదితర ఉన్నత ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులు తరగతులు లేకపోవడం, ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలియని పరిస్థితి. దీంతో అన్ని రకాల కోర్సులు చదివే విద్యార్థులు,ఉపాధ్యాయులు,అధ్యాపకులు, ప్రొఫెసర్లు, రీడర్లు వాటిని నిర్వహించే ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యాలు వాటిపై ఆధారపడి జీవించే అసంఘటిత రంగ కార్మికులు వ్యాపారవర్గాలు తదితరులు అందరూ దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ప్రభుత్వాలు లాక్‌డౌన్ ఎత్తి వేసిన తర్వాత ఇతర రంగాలు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి.అన్ని వ్యవస్థలు తెరుచుకుంటున్నాయి కొరోనా వ్యాప్తి నిరోధక చర్యలు పాటిస్తూ ప్రజలందరూ తమ పనుల్లో నిమగ్నమవుతున్నా రు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే లాక్‌డౌన్ పీరియడ్లో కూడా ఉపాధి పనులు వంటివి కొన్ని పనులు కూడా జరిగాయి. చివరకు దేవాలయాలు కూడా తెరుచుకున్నాయి.రేపో మాపో పర్యాటక రంగం కూడా మొదలు అవుతుంది. కానీ ‘‘దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుంది’’అని కొఠారి గారు అన్నట్లు భవిష్యత్ తరాలకు సంబంధించి, నూతన సమాజాన్ని తీర్చిదిద్దే శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి తోడ్పడే విద్యారంగం దానికి సంబంధించిన తరగతిగది ఇంకా నిద్రాణావస్థలోనే ఉండటం విచారకరం. విద్యారంగం గాడినపడే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ప్రభుత్వాలకు, సమాజానికి ఉన్నది. అంతేగాని జీరో ఇయర్ గా ప్రకటించినట్లయితే ఎంతో విలువైన కాలం, ఎందరో విద్యార్థుల భవిష్యత్తు, ఎంతో మంది ఉపాధి నిర్వీర్యమవుతుంది.కొరోనా పెరిగితే విద్యార్థుల ప్రాణాలకే ముప్పు కదా! ప్రాణం ముఖ్యమా!చదువు ముఖ్యమా! అనే వాదన కూడా ఈ మధ్యకాలంలో జరుగుతుంది. అవును నిజమే ప్రాణమే ముఖ్యం… ప్రాణం కన్నా విలువైనది ఏదీ కాదు… కానీ ప్రాణం పోతుందని పని చేయకుండా ఉంటామా! రోడ్డుమీద వాహనంలో వెళితే ప్రమాదానికి గురవుతామని ప్రాణాలు పోతాయనీ వెళ్లకుండా ఉండగలమా! అలా ఉంటే అభివృద్ధి జరుగుతుందా? అలాకాకుండా వ్యవస్థ సక్రమంగా నడవటానికి కరోనా వ్యాప్తి నిరోధానికి పకడ్బందీ చర్యలు తీసుకొని విద్యాసంస్థలు ప్రారంభించే విధంగా చూడాలి.దీనికి ప్రభుత్వమే కాదు ప్రజలందరూ సహకరించాలి. విద్యా సంస్థలు ప్రారంభించక పోతే కలిగే దుష్ప్రభావాలు:-
విద్యా సంస్థలు మూతబడ్డాయి 118 రోజులవుతోంది. విద్యార్థులు ఇంట్లో ఉండలేక మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా టీవీలకు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయి అనారోగ్యం పాలవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల వారు చెరువుల దగ్గరికి చేపల వేటకు,ఈతలకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొందరు బాలకార్మికులుగా మారిపోయారు మరి కొందరు పశువుల గొర్రెల కాపరులు గా పనిచేస్తున్నారు. మొత్తంగా కొరోనా వైరస్ విద్యార్థుల జీవితాన్ని అగమ్యగోచరంగా అస్తవ్యస్తంగా తయారుచేసింది. వారు ఇంకా ప్రమాదకర పరిస్థితులోకి పూర్తిగా నెట్టివేయబడకముందే విద్యాసంస్థలు తెరిచ్ఱె అవకాశాలను పరిశీలించాలి. విద్యార్థుల భవిష్యత్తు ఏమికానున్నదో అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలను పాఠశాలల వద్ద,అంగన్ వాడి సెంటర్ల వద్ద దింపివారి పనులను చక్కబెట్టుకునేవారు.ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. పిల్లలు విద్య పట్ల ఆసక్తి కోల్పోతారని క్రమశిక్షణ లోపిస్తుందనీ ఆందోళనతో ఉండటం జరుగుతుంది.ఉపాధ్యాయులు ఆర్థికంగా మానసికంగా బాధ పడుతున్నారు. ప్రభుత్వ రంగ ఉపాధ్యాయులు లాక్డౌన్ పీరియడ్ లో సగం వేతనాలతో సతమతమై ఆర్ధిక ఇబ్బందులలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడటం జరిగింది. ఇక ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అధ్యాపకులు చాలావరకు ఉద్యోగాలు కోల్పోయి ఉపాధి కరువై భవన నిర్మాణ రంగంలో కూలీలుగా,కూరగాయలు మరియు పండ్లమ్మడం,టిఫిన్ సెంటర్లు నిర్వహించే పనిలో పని చేయడం ప్రారంభించారు. వారు ఎంతో కష్టపడి డిగ్రీలు, పీజీలు, ట్రైనింగ్ లు మరియు పి. హెచ్. డి ,లు కూడా పూర్తి చేసి ప్రభుత్వ రంగంలో ఆయా పోస్టు లను భర్తీ చేయకపోవడం మూలంగా చదివిన చదువుకు సార్థకత లభించే విధంగా ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల్లో చేరితే ప్రస్తుత పరిస్థితుల్లో వారిజీవితం దుర్భరంగాఉంది. కానీ ప్రభుత్వాలు పేద ప్రజలకు అందిస్తున్న సహాయ సహాకారాల వలె ప్రైవేట్ టీచర్లకు కూడా ఆర్థిక సాయం రేషన్ ఇవ్వడం మూలంగా వారిని ఆదుకుంటే బాగుండేది.కానీ వారి గోడు వినే నాధుడు లేడు. కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒకరోజు వేతనాన్ని త్యాగం చేసి ప్రైవేట్ ఉపాధ్యాయులకు అందజేసి తమ వంతు కర్తవ్యంగా తోటి ఉపాధ్యాయులను ఆదుకోవడానికి చేసిన ప్రయత్నం అభినందనీయం.అలాగే మన రాష్ట్రంలో కూడా చేస్తే బాగుంటుంది కదా! ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించడానికి పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులు కూడా గత నాలుగైదు నెలలుగా ఉపాధిని కోల్పోయారు.గతంలో అందించిన వాటికి బిల్లులు రాక, అప్పులు తెచ్చి పెట్టిన వాటిని చెల్లించలేక నానాయాతనలకు గురి అవుతున్నారు. తక్షణమే వారికి మధ్యాహ్న భోజన బిల్లులు అందించి, పాఠశాలలకు తెరిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా పాఠశాలల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ సిబ్బంది అయినా స్కావెంజర్లు, నైట్ వాచ్మెన్లు స్వీపర్లు తదితరులు అందరూ ఉపాధిని కోల్పోయి పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారనీ చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పాఠశాలలు ప్రారంభించక పోవడం మూలంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ,మధ్యాహ్న భోజన కార్మికులు, పాఠశాల అవుట్సోర్సింగ్ సిబ్బందే కాకుండా. పాఠశాల చుట్టూ ప్రక్కల వుండే చిరువ్యాపారులు,బుక్ స్టాల్స్, పిల్లలను తీసుకవచ్చే ఆటోలవంటి వాహనాలను నడిపేవారు,సైకిల్ షాప్ వాళ్ళు, క్లాత్ మార్చంట్స్,దర్జీలు చెప్పుల వ్యాపారులు, ఇతరులు చిల్లర వ్యాపారస్తులు ఎందరికో ఉపాధి అవకాశాలు కొరవడి వారి యొక్క ఆర్థిక ఎదుగుదల దిగజారి వారి అభివృద్ధి కుంటుపడింది. ఇదంతయూ కరోనా వైరస్ ఉదృతి నేపథ్యంలో జరిగిన దుష్ప పరిణామం. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆన్లైన్ ప్రత్యామ్నాయం అవుతుందా?కాదనే చెప్పాల్సిన అవసరం ఉంది. అంతరాల దొంతరలలు కలిగిన ఈ సమాజంలో ఆన్ లైన్ తరగతులు నిర్వహించడం కష్ట సాధ్యం.వాటి నిర్వహణకు సరిపడా మొబైల్ ఫోన్లు ఇంటర్నెట్ లాంటి సౌకర్యాలు అందుబాటులో లేవు. మొత్తంగా భారతదేశంలోని ఒక సర్వే ప్రకారం ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న వారి సంఖ్య 8 శాతం కాగా, తెలంగాణ లో 20 శాతంమందికి మాత్రమే కలదు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ లైన్ తరగతుల నిర్వహణ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ తరగతులు వినడం కోసం సెల్ ఫోన్స్ కొనివ్వలేదని ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేదని విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం విషాదకరం. కొంతమంది విద్యార్థులు వాటికి సిగ్నల్ అందక పోవడం మూలంగా ఇంటి పై కూర్చొని ప్రమాదకర పరిస్థితిని చవి చూశం.సైకాలజిస్టులు, విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం ఆన్ లైన్ తరగతుల వలన విద్యార్థుల విద్యాభివృద్ధి అటుంచితే ,వారిలో ఒత్తిడి, అసహనం ,అనాసక్తి ఏర్పడతాయని శారిరకంగా కళ్ళు మెదడు లాంటి అవయవాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున ప్రత్యక్షంగా తరగతి బోధనను మించిన బోధన లేదని, ప్రత్యక్ష బోధన ద్వారానే సృజనాత్మకత మానసిక వికాసం విషయపరిజ్ఞానం మరియు మానసిక ఆరోగ్యాలు పెంపొందుతాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల అన్ లైన్ తరగతులు నిర్వహించాలా?వద్దా ?అనే అంశంపై పలు ఉపాధ్యాయసంఘాలు సర్వే చేపట్టి అందులో 85 శాతం మేరకు విద్యార్థులు వారి తల్లిదండ్రులు,మేధావులు, విద్యాభిమానులు తదితరులు ఆన్ లైన్ తరగతులు నిర్వహించకూడదని,ఇటీవల హైకోర్టు కూడా ఆన్ లైన్ తరగతులను ఆపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆన్ లైన్ తరగతుల నిర్వహణ ప్రత్యామ్నాయ పద్ధతిగా తీసుకోవడం శ్రేయస్కరం కాదు అనిపిస్తుంది. ఈ ఆన్ లైన్ తరగతులు పట్టణ ప్రాంతాలకు చెందిన ఉన్నత వర్గాల వారికి మాత్రమే ఉపయోగకరంగా ఉంటాయి.కానీ గ్రామీణ ప్రాంతాల వారికి ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఇబ్బంది కరంగా ఉంటాయి. మరి తక్షణ కర్తవ్యం ఏమిటీ•? ప్రస్తుత పరిస్థితుల్లో కొరోనా వైరస్ ను పూర్తిగా నిర్మూలించేందుకు వ్యాక్సిన్ కనుగొనబడలేదు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటేఇంకాను కనీసం ఐదారు నెలలు పడుతుంది.వచ్చిన అంత త్వరగా సామాన్యులకు అందుబాటులోకి వస్తుంది అనేది సందేహమే… వచ్చినా దాని పని విధానం ఎలా ఉంటుందో దానివల్ల కలిగే ఇతర ఇబ్బందులు ఎలా ఉంటాయో ?తెలిసే వరకు మరికొంత సమయం పడుతుంది. ఇలాంటి సందర్భంలో ఇంకాను పాఠశాలలను తెరవకుండా బడిగంట కొట్టకుండా ఉంటే ఎలా? విలువైన సమయాన్ని కోల్పోయి అభివృద్ధి పదంలో వెనుక పడటం ఖాయం.. కనుక దీని ప్రభావానికి లోను కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుని జాగ్రత్తగా పాఠశాల ప్రారంభించినట్లయితే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది… మరి ఏమి చేయాలి ?? (1)పాఠశాలలను దాని పరిసరాలన్నింటినీ సానిటైజ్ చేయాలి. ఉదయం సాయంత్రం ఎప్పటికప్పుడు పాఠశాల అవుట్సోర్సింగ్ సిబ్బందితో ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణలో ఈ పని చేయాల్సిన అవసరం ఉంది.ఇందుకు కావలసిన పరికరాలు హైపోద్రావణంలను ప్రభుత్వమే స్థానిక గ్రామ పంచాయతీల ద్వారా అందించాలి.(2) ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మాస్కులు మరియు శానిటైజర్ లు అందివ్వాలి. మాస్క్ లేకుండా ఎవరినీ పాఠశాల ప్రాంగణంలో కి అనుమతించకూడదు.(3) సరి-బేసి విధానాన్ని అమలు చేయాలి అనగా ప్రాథమిక పాఠశాలలో 1,3,5 తరగతిలో ఒక రోజుబీ2,4 తరగతులు మరొకరోజు బీఉన్నత పాఠశాల అయితే 6 ,8, 10 తరగతి ఒకరోజు బీ7 ,9 తరగతుల మరొక రోజుబీ ఆయా పాఠశాలల విద్యార్థుల సంఖ్యను బట్టి విభజించుకుని తరగతులను పాఠశాలకు అనుమతించ వలెను.(4) పాఠశాలల్లో విద్యార్థులను భౌతికదూరాన్ని పాటించేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలి. ఇద్దరు లేక ముగ్గురు ఉపాధ్యాయులు పర్యవేక్షణలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి.(5) టాయిలెట్స్ అత్యంత పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలి. ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలి. (6)విద్యార్థులందరినీ ఒకేసారి బయటకు, మధ్యాహ్న భోజనానికి వదలకుండా భౌతిక అనుసరించి విధిగా పాటించే విధంగా చూడాలి. (7)పాఠశాలలో ఉన్న భౌతిక వసతులను, విద్యార్థుల సంఖ్యను అనుసరించి అవసరమైతే సెక్షన్లుగా విభజించి షిప్టు ల వారీగా అంటే ఉదయం పూట ఒక సెక్షన్ మధ్యాహ్నం పూట మరో సెక్షన్ ను అనుమతించి విద్యాబోధన చేయాలి.(8)పరిస్థితులు మెరుగయ్యేంతవరకు ప్రార్థన, ఆటలు మరియు ఇతర కార్యక్రమాల నిర్వహణ ఏమి చేయకూడదు.(9)ప్రతిరోజు విద్యార్థుల, ఉపాధ్యాయుల మరియు ఇతర సిబ్బందిని పాఠశాల గేటు వద్దనే థర్మల్ స్క్రీనింగ్ చేసి శానిటైజర్ అందించాలి.దానిని ఎప్పటికప్పుడు ఒక రిజిస్టర్లో నమోదు చేయాలి. (10)పాఠశాలకు వచ్చిన తర్వాత విద్యార్థులు ఎవరైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడితే అలాంటి వారికి ప్రాథమికంగా చికిత్స చేయుటకు స్థానిక ఏఎన్‌ఎమ్ లేదా ఆశా వర్కర్ లను అందుబాటులో ఉంచాలి మరియు సిక్ రూమ్స్ లాంటివి ఏర్పాటు చేయాలి.ఈ విధంగా కొరోనా వైరస్ వ్యాప్తిని అరికడుతూ పాఠశాలలను తక్షణమే తెరవాలి. లేని చో గత మార్చి 15 నుండి నేటి వరకు విద్యార్థులు ఇళ్లల్లో ఉండడం వలన మానసిక వ్యాకులతను స్ట్రైస్ ను, సైకలాజికల్గగా దుష్ప్రభావానికి గురవుతున్నారనీ క్రమశిక్షణ లోపించడం, మొబైల్ ఫోన్లకు టీవీలకు అతుక్కు పోవడం, మొబైల్ గేమ్స్ కు బానిసలు అవడం లాంటి చెడు ప్రభావానికి లోనై ఎంతో విలువైన భవిష్యత్తు తరాల వారు అనేక రుగ్మతలకు గురై బాధలు పడాల్సి వస్తుందనీ,కావున తక్షణమే కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ బడిగంట మోగాల్సిందేనని పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతుండటం గమనార్హం.
ఉపాధ్యక్షుడు, టి.పి.టి.ఎఫ్. మహబఃబాద్ జిల్లా. 9989584665,