పార్టీలు .. పాదయాత్రలు

పార్టీలు .. పాదయాత్రలు
రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్నకొద్ది పాదయాత్రల సీజన్‌కూడా పెరుగూ వొస్తున్నది. వాస్తవంగా గతంలోలాగా ఈ సారికూడా బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందన్న ఊహతో పలు రాజకీయ పార్టీలు గత సంవత్సరమే ప్రజలతో మమేకం అయ్యేందుకు పాదయాత్రలను ప్రారంభించాయి. ఇప్పటికే రెండుమూడు పార్టీలు రాష్ట్రాన్ని చుట్టబెట్టాయికూడా. కెసిఆర్‌ను గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంగా చేపట్టిన, చేపడుతున్న ఈ పాదయాత్రలు ఆ పార్టీలకు ఎంతవరకు ఉపయోగపడుతాయన్నది తేలేందుకు మరో ఎనిమిది నెలలకాలం ఆగాల్సిందే. అయితే ఈ పార్టీలన్నీ తమ పాదయాత్ర సందర్భంగా బిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయం తామేనని ఢంకా బజాయించుకుంటున్నాయి. ఈ పార్టీలన్నీ  అధికార బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ అవినీతి, అక్రమాలను విమర్శించే విషయంలో తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఇందుకోసం వోటర్లను  ముఖాముఖి కలుసుకుని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. తెలంగాణలో ఈసారి అధికారంలోకి వొచ్చేది తామేనని చెబుతున్న బిజెపి పార్టీ ఇప్పటికే అయిదు విడుతలుగా జరిపిన పాదయాత్ర ద్వారా దాదాపుగా రాష్ట్రాన్ని చుట్టబెట్టింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అయిదు విడుతలుగా వేలాది కిలోమీటర్ల మేర పాదయాత్ర ద్వారా తమ లక్ష్యాన్ని చేరువ అయినట్లుగా భావిస్తున్నారు. ఈ పాదయాత్ర సందర్భంగా అధికార పార్టీ పెట్టిన అనేక ఇబ్బందులను అధిగమించి యాత్ర కొనసాగించారు. ఆ తర్వాత పాదయాత్రలో చెప్పుకోదగిన మైలురాయి దాటిన వారిలో వైఎస్‌ఆర్‌టిపి పార్టీ అధినేత వైఎస్‌ ‌షర్మిల. ఇప్పుడు కాంగ్రెస్‌ ఆ ‌మేరకు పాదయాత్రలను కొనసాగిస్తున్నది. కాంగ్రెస్‌ అనగానే  ఆ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువన్నది తెలియందికాదు. ఎప్పటిలాగేనే ఆ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో పైకి లేవలేకపోతోంది. పాదయాత్ర విషయంలోకూడా అంతర్గత భేదాభిప్రాయాలు కొట్టొచ్చినట్లు  కనిపిస్తున్నాయి. ఏ పార్టీలోనైనా ఆ పార్టీ రథసారధి ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఆ పార్టీకి చెందిన నాయకులంతా ఉమ్మడిగా కార్యక్రమంలో పాల్గొనడమన్నది ఆనవాయితీ. కాని, కాంగ్రెస్‌లో ఇప్పుడా పరిస్థితిలేదు. సీనియర్‌లు అంటే మొదటినుండి పార్టీని పట్టుకుని ఉన్న వాళ్ళకు, కొత్తగా వివిధ పార్టీలనుండి వొచ్చినవారి మధ్య సఖ్యతలేకపోవడం బహిరంగ రహస్యమే. దేశ వ్యాప్తంగా ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్‌గాంధీ  హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో పాదయాత్ర కొనసాగింపుగా రాష్ట్ర కాంగ్రెస్‌ ‌చేపట్టాలనుకున్న యాత్రకు అనేక అవరోధాలు ఆ పార్టీనుండే ఏర్పడ్డాయి. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒక్కడికే ఆ క్రెడిట్‌ ‌దక్కుతుందేమోనన్న అభిప్రాయంగా సీనియర్‌ల నుండి అనేక అడ్డంకులు ఎదురైనాయి.
చివరకు రాష్ట్ర అధ్యక్షుడి పాదయాత్రకూడా కుదించబడడం ఆ పార్టీ నాయకుల ఐక్యతెలాంటిదో చెప్పకనే చెబుతోంది. గతంలోనే మహబూబ్‌నగర్‌నుండి హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టిన రేవంత్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆ తర్వాత అధిష్ఠానం సూచనతో ఫిబ్రవరి ఆరవ తేదీన మేడారం నుండి కొనసాగిస్తున్న రేవంత్‌రెడ్డి పాదయాత్రలో పెద్దగా సీనియర్‌ ‌నాయకులు పాల్గొనకపోవడం గమనార్హం. పాదయాత్రలో పాల్గొనాల్సిందిగా తమను ఆహ్వానించలేదని కొందరు, ఇష్టంలేక కొందరు యాత్రకు దూరంగా ఉన్నారు. వీరంతా తమ తమ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేసుకోవడానికి అధిష్ఠానాన్ని ఒప్పించుకున్నారు. అయితే రేవంత్‌రెడ్డితో సమానంగా మరో యాత్ర చేపడుతున్నారు శాసనసభలో విపక్ష కాంగ్రెస్‌ ‌నాయకుడు భట్టి విక్రమార్క. మార్చ్ 16‌న ఉమ్యడి ఆదిలాబాద్‌ ‌జిల్లానుండి ప్రారంభించారు. ఆయన యాత్ర తన సొంత  నియోజకవర్గమైన ఉమ్మడి ఖమ్మం వరకు కొనసాగనుంది. అధికారమే  లక్ష్యంగా ఈ రాజకీయపార్టీలు పాదయాత్రలనే ఎందుకు ఎంచుకుంటున్నాయన్న ప్రశ్న ఉత్పన్నం కాకపోదు. అందుకు పాదయాత్రల గత చరిత్రే సాక్ష్యం. ఈ పాదయాత్రల ద్వారా తెలుగురాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్నవారిలో ప్రథమ స్థానంలో నిలిచిన వ్యక్తి దివంగత  డా. వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2003లో వేల కిలోమీటర్లు పాదయాత్రచేసి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయే కాలంలో 2013లో సుదీర్ఘ పాదయాత్రచేసిన చంద్రబాబునాయుడు మరుసటి సంవత్సరంలోనే అధికారంలోకి వొచ్చాడు. ఉమ్మడి రాష్ట్రం  రెండుగా విడిపోయిన తర్వాత డా. వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి కుమారుడు వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కూతురు వైఎస్‌ ‌షర్మిల జరిపిన సంకల్పయాత్ర, ఓదార్పు యాత్రలు జగన్‌ను ఏపి ముఖ్యమంత్రిని చేశాయి. విచిత్రమేమంటే కెఎస్‌ఆర్‌ ఎలాంటి పాదయాత్రలు చేయకుండానే అధికారంలోకి రాగలిగారు. ఆయన దాదాపు పన్నెండు ఏళ్ళపాటు చేసిన సుదీర్ఘపోరటం, వివిధ పార్టీలతో చేసుకున్న పొత్తులు ఆయనకు కలిసి వొచ్చాయి. ఈ మధ్యకాలంలో నాటి టిఆర్‌ఎస్‌ ‌నేటి బిఆర్‌ఎస్‌నుండి బహిస్కృతుడైన ఈటల  రాజేందర్‌ ‌జరిపిన ప్రజాదీవన యాత్రకూడా ఆయనను  గెలిపించింది. అంటే పాదయాత్రలు పార్టీలకు అధికారాన్ని తెచ్చిపెడుతాయన్న నమ్మకం బలంగా ఏర్పడింది. దీంత• దాదాపు అన్ని పార్టీలు పాదయాత్రలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. అయితే రాష్ట్ర బిజెపి నాయకలమధ్య కొంత అభిప్రాయభేదాలున్నప్పటికీ ఆ పార్టీ అధిష్ఠానం తెలంగాణపైన ప్రత్యేక దృష్టిని సారించింది. ఆ పార్టీతో సమానంగా అధికారంకోసం పోటీపడుతున్న కాంగ్రెస్‌లో మాత్రం ఐక్యతాలోపం  కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో   ఎవరి పాదయాత్రల పట్ల ప్రజా స్పందంన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
Telangana general elections political parties poll strategy congress bjp brs ysrcp
Comments (0)
Add Comment