ప్రముఖ సామాజిక హక్కుల కార్యకర్త, ఆర్య సమాజ్ నేత స్వామి అగ్నివేశ్ (80) మృతి చెందారు. గత కొంత కాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన దిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచినట్లు శుక్రవారం హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన ఉద్యమానికి స్వామి అగ్నివేష్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రజలు చేస్తున్న ఉద్యమం న్యాయసమ్మతమైనదనీ, ఇక్కడ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు తెలిపిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి కావడం గమనార్హం.
1939 సెప్టెంబర్ 21న ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో స్వామి అగ్నివేష్ జన్నించారు. నాలుగేళ్లకే తండ్రి మరణించడంతో చండీగఢ్‌లోని తాత వద్ద పెరిగారు. కోల్‌కతాలోని సెయింట్ గ్జేవియర్ కళాశాల నుంచి న్యాయశాస్త్రం, కామర్స్‌లో పట్టా పొందారు. అయినప్పటికీ సామాజిక సమస్యలపై పోరాడేందుకే తన జీవితాన్ని అంకితం చేశౄరు. ఆ తరువాత ఆర్య సమాజ్ సూత్రాలతో ఆకర్శితుడై 1970లో ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. భిన్న మతాల మధ్య పలు సామాజిక అంశాలపై స్వామి అగ్నివేశ్ ఎప్పటికప్పుడు స్పందించే వారు. 1977లో తొలిసారిగా హరియాణాలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత విద్యా శాఖ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. బాలల వెట్టి చాకిరీని నిర్మూలించేందుకు బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్‌ను నిర్మించి ఆ దిశగా అనేక ఉద్యమాలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులతో ప్రభుత్వం జరిపిన చర్చలకు ఆయన మధ్యవర్తిగానూ వ్యవహరించారు.