“మయన్మార్‌లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల పై అమెరికా, బ్రిటన్, ఐక్యరాజ్య సమితి సైన్యం తీరును తప్పుబట్టాయి. అయితే మన దేశం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎందుకంటే భారత దేశం మయన్మార్‌తో 1,640 కి.మీ.ల పొడవైన సరిహద్దు పంచుకుంటోంది. ఆ దేశంలో జరిగే పరిణామాల ప్రభావం ఈశాన్య భారతం పై పడతాయి. ఈ సరిహద్దు ప్రాంతంలో వేర్పాటువాద సంస్థలు చాలానే ఉన్నాయి. ఈ వేర్పాటువాద సంస్థలు భారత ప్రభుత్వానికి, మియన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకం. ఇటువంటి పరిస్థితులను డ్రాగన్ దేశం అవకాశంగా మలుచుకుంటుంది. అరాకన్ సైన్యం, కాచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ వంటి కొన్ని వేర్పాటు వాద సంస్థలకు చైనా ప్రోత్సాహం లభిస్తుందన్న ప్రచారం ఉంది. సరిహద్దు దేశంగా మయన్మార్‌లో ఎవరు అధికారంలో ఉన్నా…వారితో సత్సంబంధాలు నెరపటం వరకే మన విదేశాంగ విధానం ఉండటం అవసరం.”
ఐదారేళ్ళ క్రితం నుంచి మయన్మార్‌లో పరిస్థితి నెమ్మదిగా మారుతూ వచ్చింది. ప్రజాస్వామ్యం మొగ్గ తొడిగి …నెమ్మదిగా చిగురిస్తోంది అనుకున్నంతలో మళ్లీ ఆర్మీ అలవాటైన పంజా విసిరింది. సైనిక కుట్రతో మిలిటరీ అధికారాన్ని కైవసం చేసుకుంది. దేశ కౌన్సిలర్ హోదాలో ఉన్న అంగ్ సాన్ సూకీని, ఆమె పార్టీ ఎమ్పీలను సైన్యం నిర్బంధించింది. ఆర్మీ కమాండర్ ఇప్పుడు దేశ పగ్గాలు చేపట్టారు. ఆ వెంటనే ఏడాది పాటు దేశంలో ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు. మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. ఎమర్జెన్సీ అమల్లోకి వస్తే ఇంకా ఇలాంటి అనేక పరిణామాలను, నిర్బంధాలను ఆ దేశ వాసులు చూడక, అనుభవించక తప్పదు.
ప్రజాస్వామ్యానికి ప్రమాదం
మయన్మార్‌లో ప్రజాస్వామ్యా బీజాలు పడటానికి చారిత్రక నేపథ్యం, సుదీర్ఘ పోరాటం ఉంది. 1989-2010 మధ్య సుమారు 15 ఏళ్లపాటు ఆంగ్ సాన్ జైలుశిక్ష అనుభవించారు. 1991 లో ఈమెకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.2011 వరకు మయన్మార్‌లో సైనిక పాలన కొనసాగింది. అంగ్ సాన్ సూకి రాజ్యాంగ నిబంధనలకు కారణంగా ప్రవాసంలో ఉండాల్సి వచ్చింది. తర్వాత వచ్చిన రాజ్యాంగ సంస్కరణలు, ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా పుట్టిన గడ్డ పై కాలు పెట్టే అవకాశం సూకికి దొరికింది. ఎన్నికల బరిలో నిలబడిన సూకీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (NLD) భారీ మెజార్జీతో గెలిచింది. అప్పటి నుంచి సూకీ పరోక్ష పాలనలో మయన్మార్ కొనసాగుతోంది. ఐదేళ్ల తర్వాత మళ్లీ గత నవంబర్‌లో ఎన్నికలు జరిగాయి. వీటిలో కూడా ఎన్ఎల్డీ 476 స్థానాలకు గాను 396 చోట్ల ఘన విజయం సాధించింది. సైనిక జుంటా మద్దతు ఉన్న యూనియన్ సాలిడారిటీ,
డెవలెప్మెంట్ పార్టీ -యూఎస్డీపీ 33 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. దీనితో ఈ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగం వేసింది ఆర్మీ. జనరల్ మిన్ అంగ్ నేతృత్వంలో సైన్యం ఆ దేశ సూకీ సర్కార్‌ను పక్కకు తోసి అధికారాన్ని చేజిక్కించుకుంది.
సూకీ హయాం పై మరకలు…
ప్రజా నాయకురాలిగా, ప్రజాస్వామ్య పోరాట యోధురాలిగా అంతార్జాతీయంగా పేరు సంపాదించుకున్నారు సూకి. ఆమెకు నోబెల్ శాంతి బహుమతి కూడా వరించింది. దశాబ్దాల పాటు వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సైనిక పాలన పై పోరాటం సాగించిన సూకి…స్టేట్ కౌన్సిలర్‌గా తన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం రొహింగ్యాల విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. వర్తమాన ప్రపంచ పరిణామాల్లో అత్యంత కిరాతకంగా వేలాది మంది మారణహోమానికి బలైన ఉదంతాలు మయన్మార్‌లో చోటుచేసుకున్నాయి. మహిళల పై కిరాత లైంగిక దాడులు జరిగాయి. ప్రాణాలు అర చేతిలో పట్టుకుని లక్షలాది మంది రొహింగ్యాలు పుట్టిన గడ్డ మయన్మార్‌ను వదిలి అక్రమంగా ఇతర దేశాలకు ప్రవేశించాల్సి వచ్చింది. ఇప్పటికీ వేలాది మంది అక్రమ వలసదారులు అనే ముద్ర వేసుకుని ఈ ప్రపంచంలో ఏ దేశానికీ చెందని వారుగా అత్యంత దయనీయ స్థితిని బతుకు వెళ్లదీస్తున్నారు.
మొన్నటి హైదరాబాద్ జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో బీజేపీ ఈ రొహింగ్యాలనే ఎన్నికల ఎజెండాగా పెట్టుకుని కొద్ది రోజుల పాటు ఎమ్ఐఎమ్ పై, టీఆర్ఎస్కు ఆరోపణలు గుప్పించింది. మారణహోమం జరిగిందనే అభియోగం పై మియన్మార్ ప్రస్తుతం అంతర్జాతీయ న్యాయస్థానం-ఐసీజేలో కేసును ఎదుర్కొంటోంది. మానవత్వానికి వ్యతిరేకంగా దేశం నేరాలకు పాల్పడిందన్నఆరోపణలపై ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు విచారణ చేస్తోంది. శక్తివంతమైన సైన్యం చేస్తున్న చర్యలను ఖండించకపోవడాన్ని, జరుగుతున్న దారుణాన్ని ఆమె గుర్తించకపోవడాన్ని అంతర్జాతీయ సమాజం సూకిని తప్పుబట్టింది. హేగ్ లో జరిగిన విచారణలో
సైన్యం చర్యలను సూకి సమర్ధించడం కూడా దీనికి ఒక కారణం. ఆయితే మయన్మార్ పార్లమెంటులో పావు వంతు స్థానాల్లో ఆ దేశ రాజ్యాంగం ప్రకారం సైన్యం చేతుల్లోనే ఉంటాయి. రక్షణ, హోం, సరిహద్దు వ్యవహారాలు వంటి కొన్ని కీలక మంత్రిత్వ శాఖలు కూడా సైన్యం చేతుల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సూకి కూడా రొహింగ్యాల విషయంలో తన రాజకీయ ప్రయోజనాలకు భంగం కలుగకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండొచ్చు.
తటస్థ విధానం
మయన్మార్‌లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల పై అమెరికా, బ్రిటన్, ఐక్యరాజ్య సమితి సైన్యం తీరును తప్పుబట్టాయి. అయితే మన దేశం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎందుకంటే భారత దేశం మయన్మార్‌తో 1,640 కి.మీ.ల పొడవైన సరిహద్దు పంచుకుంటోంది. ఆ దేశంలో జరిగే పరిణామాల ప్రభావం ఈశాన్య భారతం పై పడతాయి. ఈ సరిహద్దు ప్రాంతంలో వేర్పాటువాద సంస్థలు చాలానే ఉన్నాయి. ఈ వేర్పాటువాద సంస్థలు భారత ప్రభుత్వానికి, మియన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకం. ఇటువంటి పరిస్థితులను డ్రాగన్ దేశం అవకాశంగా మలుచుకుంటుంది. అరాకన్ సైన్యం, కాచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ వంటి కొన్ని వేర్పాటు వాద సంస్థలకు చైనా ప్రోత్సాహం లభిస్తుందన్న ప్రచారం ఉంది. సరిహద్దు దేశంగా మయన్మార్‌లో ఎవరు అధికారంలో ఉన్నా… వారితో సత్సంబంధాలు నెరపటం వరకే మన విదేశాంగ విధానం ఉండటం అవసరం.
మన పొరుగు దేశాల్లో ప్రజాస్వామ్య వాతావరణం ఉండాలని ఆకాంక్షించటం వరకే మన దేశం పరిమితం అయ్యింది. భారత విదేశాంగ విధానం ప్రకారం ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. ఎందుకంటే దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి అడుగులు ముందుకు వేయలేం. భారత దేశం ఆర్మీకి వ్యతిరేక వైఖరి తీసుకుంటే మయన్మార్ సైన్యం చైనా వైపు చూసే ప్రమాదం ఉంటుంది. ఇటువంటి వ్యూహాత్మక సమీకరణాలు అన్నీ అంచనా వేసుకోవాల్సిన అవసరం దేశానికి ఉంటుంది. పైగా భారత దేశం ఇప్పటికే మియన్మార్‌తో కలిసి కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులను చేస్తోంది. వీటిలో కీలకమైనవి భారత్, మియన్మార్, థాయిలాండ్ దేశాల మధ్య త్రైపాక్షిక హైవే, కాలాదన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్, సిట్వే డీప్ వాటర్ పోర్టులో స్పెషల్ ఎకానమిక్ జోన్ ఏర్పాటు. ఏది ఏమైనా… ఏ దేశంలో అయినా నిజమైన అర్థంలో ప్రజాస్వామ్య వాతావరణం నెలకొన్నప్పుడే ప్రపంచ గతి సరైన దిశలో వెళటానికి అవకాశం ఉంటుంది.