రైతుల కష్టాలు తీరెదెన్నడో..?

  • కొనుగోలు కేంద్రాల్లో నిరసిస్తున్న అన్నదాతలు 
  • రోజుల తరబడి పడిగాపులు అకాల వర్షం వస్తే పరిస్థితేంటి..?

మిషన్‌ ‌కాకతీయ నీటితో ప్రతి కాలువ పులకరించింది. కాలువ లు చెరువులు నిండుకుండలా పొంగి పోర్లయి. ప్రతి చెరువు, కుంట నీటితో తడిసి ముద్దయింది. దీంతో రైతన్నల ఆశాలకు రెక్కలు వచ్చాయి. అన్నదాత కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. ఇంకేముంది హలం పట్టి పొలం దున్నాడు. వాన కాలానికి దీటుగా యాసంగిలో చెమట చుక్కలు చిందించి తన భూతల్లిలో పంటలు పండించాడు. ప్రతి ఎకరం సస్యశ్యామలం అయింది. యాసంగిలో బీడుగా ఉండాల్సిన భూమికి పచ్చని రంగేసినట్లు అయింది. సరిసమానంగా పంట దిగుబడి వచ్చింది. ఇన్నాళ్ల కష్టం తీరింది అనుకున్నాడు ఆ హలం పట్టిన సగటు జీవి. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. పంట పండించడానికి పడ్డ కష్టం కోతతో తీరింది. పండించిన ధాన్యాన్ని రైతు అమ్ముకోవడంలో వైకుంఠపాళీ ఆట ఆడుతున్నాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడం ఇప్పుడు కొత్త సవాలుగా మారింది. అనుకోని విధంగా పంట దిగుబడి రావడం కొత్త సమస్యకు ఆజ్యం పోసింది. ప్రభుత్వం పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. కొనుగోలు కేంద్రా ల్లో రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలు కేంద్రానికి తరలించిన ధాన్యం ప్రభుత్వం కొని గోదాములోకి తరలించే వరకు రైతులు ఇబ్బం దులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

నాగారంలో రైతుల ఆందోళన…..
మద్దతు ధర లభిస్తుందనే ఆశతో కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువస్తే నిర్వాహకుల నిర్లక్ష్యంతో ప్రభుత్వం రోజులు గడిచినా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం తో రైతులు ఆందోళన దిగారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధాన్యాన్ని తగలబెట్టి నిరసన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సమస్యలను పరిష్కరించాలని అన్నారు. పైరవీలకు తావు లేకుండా సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేసి లారీల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్‌ ‌చేశారు.

నిరసిస్తున్న అన్నదాతలు……
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కాంటాలు వేయడంలో జాప్యం జరుగుతుంది. నెలల తరబడి రైతులు ధాన్యం వద్ద కాపలాగా ఉండి నిరసించాడు. పండించడం కంటే అమ్మడం పెద్ద కష్టమైంది రైతన్నకు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాల లేమి వెక్కిరిస్తుంది. ధాన్యం బస్తాలు చెదలు పడుతున్నాయి. రాత్రి వేల పందులు, కుక్కల నుండి ధాన్యాన్ని కాపాడుకోవడానికి జాగారం చేయక తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే సహకరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. లారీలు లేక గోదాములు అందుబాటులో లేక ధాన్యాన్ని తరలించడానికి అధికారులు ఆపసోపాలు పడుతున్నారు.

Comments (0)
Add Comment