మాటిమాటికీ కేంద్రం నిధులు ఇచ్చిందనడం కాదు

  • రుజువు చేయకుంటే రాజీనామా చేస్తావా..?
  • రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తా..బండి సంజయ్‌కి కెటిఆర్‌ ‌సవాల్‌
  • ‌పక్కనున్న కర్నాటకలోనే తెలంగాణ పథకాలు లేవు
  • కెసిఆర్‌ ఆశిస్సులతో గద్వాల సర్వతోముఖాభివృద్ది
  • ఏడేండ్లలో 1,32,000 ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడి

మాటిమాటికీ బిజెపి కేంద్రం నిధులు ఇచ్చిందని అంటున్నారని..నిరూపించకుంటే బండి సంజయ్‌ ‌రాజీనామా చేస్తారా అని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కెటిఆర్‌ ‌సవాల్‌ ‌చేశారు. రుజువు చేస్తే తాను రాజీనామా చేస్తానని అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఊరూరు తిరుగుతూ మొత్తం నిధులు కేంద్రానివే అని అబద్దాలు చెప్పుతున్నారని ధ్వజమెత్తారు. ‘బండి సంజయ్‌ ‌చెప్పేది నిజమైతే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తాను.. అబద్ధం అయితే బండి సంజయ్‌ ఎం‌పీ పదవికి రాజీనామా చేయాలి’ అంటూ సవాల్‌ ‌విసిరారు. దమ్ముంటే రుజువు చేయాలని.. లేకుంటే రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేశారు. సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో గద్వాల జిల్లాలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని కేటీఆర్‌ అన్నారు. జిల్లాలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్‌ ‌కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన గద్వాల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని, ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. గద్వాల జిల్లా అభివృద్ధి పనుల కోసం ఐదుగురు మంత్రులు పర్యటన కోసం వొచ్చామన్నారు. మున్సిపాలిటీ, పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికలు లేకున్నా మూడోవంతు క్యాబినెట్‌ ‌జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించిందన్నారు. రూ.104కోట్ల అభివృద్ధి పనులకు ఒకే రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసుకున్నామన్నారు. జోగులాంబ గద్వారా జిల్లా ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు.

మాట్లాడితే రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్ల పథకాలపై సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. పక్కనే బీజేపీ ప్రభుత్వం ఉన్న కర్ణాటక రాయచూర్‌లో మన పథకాలు లేవని, ఇక్కడ బీజేపీ నాయకురాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నదని.. కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ ‌కిట్‌ ‌పథకాలతో ఆడబిడ్డలకు భరోసా కల్పించినట్లు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల పన్నుల ఆదాయాన్ని ఉత్తర ప్రదేశ్‌కు తరలిస్తున్నారని.. మన రక్తం, మన చెమటతో దేశంలోని వెనుకబడ్డ ఇతర రాష్టాల్రకు నిధులు తీసుకొని వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో 13 మెడికల్‌ ‌కాలేజీలు స్థాపించినట్లు మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.

తప్పకుండా గద్వాలకు మెడికల్‌ ‌కాలేజీ వస్తుందని భరోసా ఇచ్చారు. ఐఐఎంలు, నవోదయ విద్యాలయాల కేటాయింపులో తెలంగాణ రాష్టాన్రికి మొండి చేయి చూపారంటూ ఆరోపించారు. ఏడేండ్లలో 1,32,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, పని చేసే ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారన్నారు. చరిత్ర తప్ప.. భవిష్యత్‌ ‌లేని పార్టీ కాంగ్రెస్‌ అని కేటీఆర్‌ ‌విమర్శించారు. ‘డబ్బు సంచులతో దొరికినోడు పీసీసీ చీఫ్‌ అం‌ట.. వాడు కూడా మాట్లాడుతున్నడు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు కూడా ఇవ్వదని దద్దమ్మలున్నది కాంగ్రెస్‌ ‌పార్టీ అని.. పాలమూరు వలసల జిల్లాగా మార్చిన ఘనత పార్టీదేనన్నారు.

ప్రస్తుతం వలసలు వెళ్లిన వారంతా తిరిగి వొస్తున్నారని, పాలమూరు పచ్చబడుతున్నదన్నారు. పాలమూరు పచ్చబడుతుంటే కాంగ్రెస్‌ ‌నేతల కండ్లు మండుతున్నాయని, కేసీఆర్‌ను తిడితే పెద్ద నాయకులు కాలేరన్నారు. రాష్టాన్ని్ర సాధించి ముఖ్యమంత్రి అయిన నేత సీఎం కేసీఆర్‌ ‌మాత్రమేనన్నారు. డీకే అరుణమ్మకు గద్వాల్‌ ‌ప్రజల మిద ప్రేమ ఉంటే వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలోకి చేర్చేందుకు కృషి చేయాలని కేటీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నిర్వహించి.. తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని.. ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని తెలిపారు. వాల్మీకి బోయల హక్కుల గురించి మొదటిసారిగా మాట్లాడిందని సీఎం కేసీఆరేనని చెప్పారు. ‘పరిపాలన, అభివృద్ధి..సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి..ఇవాళ కాన్వాయ్‌కి అడ్డుపడిన బీజేపీ యువకులకు చెప్తున్న ఒక బస్‌ ‌పెడతాను.. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో పరిస్థితి చూసి రండి.. ఇక్కడి సంక్షేమ పథకాలు అక్కడ ఉన్నాయో చూసి రండి.. మికే తేడా తెలుస్తుంది’ అన్నారు. ఎఫ్‌సీఐ వడ్లు కొనను అంటున్నదని.. కేంద్రంపై పలు వేదికలపై నిరసన తెలుపుతూ.. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్‌ ‌పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాసగౌడ్‌, ‌నిరంజన్‌ ‌రెడ్డిలతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.

All-round developmentblessings of KCRbreaking newscorridorscrime todayMinister Sabita Indrareddyniranjan reddyprajatantra epaperread news onlineSrinivasa Gowdatelugu articlestelugu vaarthalu
Comments (0)
Add Comment