శాశ్వత ప్రాతిపదికన వెళ్లాలనుకుంటే దరఖాస్తుల స్వీకరణ

  • ఎపి వెళ్లే ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్‌
  • ఉత్తర్వులు జారీచేసిన సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌
  • 3 ‌వేల నుంచి 3500 మంది ఉద్యోగులు ఉంటారని అంచనా

‌రాష్ట్ర విభజన అనంతరం బదిలీ అవకాశాలు లేక తెలంగాణలో నిలిచిపోయిన ఉద్యోగులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఎపి నుండి అనుమతి తీసుకుంటే..శాశ్వతంగా అంతర్రాష్ట్ర బదిలీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, హెచ్‌ఒడిలను అప్రమత్తం చేశారు. ఎపికి వెళ్లాలనుకునే ఉద్యోగులు/అధికారుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఆస్తులు, అప్పులతోపాటు వివిధ శాఖల్లోని ఉద్యోగుల విభజన కూడా జరిగిన సంగతి తెలిసిందే. స్టేట్‌ ‌కేడర్‌ ‌పోస్టులను 58:42 ప్రాతిపదికన విభజించగా, ఇతర ఉద్యోగులను ఏ జిల్లాలో పని చేస్తున్నవారిని ఆ జిల్లాకే కేటాయించారు. ఉద్యోగ నియామకం సందర్భంగా రిజిస్టర్‌లో నమోదైన సొంత జిల్లాను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఇలా రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన పక్రియను షిలా భిడే కమిటీ పూర్తి చేసింది.

రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన చాలా మంది తెలంగాణ ప్రాంతంలో ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఇతర ఉద్యోగాలు పొందినవారూ ఉన్నారు. అయితే వీరిలో పలువురు..రెండు రాష్ట్రాలకు వొచ్చిన ఖాళీల సంఖ్య నేపథ్యంలో సొంత రాష్ట్రాల్లో లభించక ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగులను తీసుకునేందుకు ఏపీ నుంచి అనుమతి రాగానే..వారిని రిలీవ్‌ ‌చేయాలని తెలిపింది. ఈ మేరకు అంతర్రాష్ట్ర బదిలీ సందర్భంలో అనుసరించాల్సిన నియమాలను సూచించింది. ఎపీకి శాశ్వతంగా బదిలీ కావాలనుకునే ఉద్యోగి అక్టోబరు 15 లోపు సంబంధిత హెచ్‌ఒడికి దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి క్రమశిక్షణ, విజిలెన్స్ ‌కేసులు లేని ఉద్యోగుల దరఖాస్తులను సంబంధిత ముఖ్యకార్యదర్శులకు హెచ్‌ఒడిలు సూచించాలి. హెచ్‌ఒడిల నుండి వొచ్చిన దరఖాస్తుల ఆధారంగా ముఖ్యకార్యదర్శులు నిరభ్యంతర పత్రాల(ఎన్‌ఒసి)లను జారీ చేయాలి.

సదరు ఉద్యోగులను జాయిన్‌ ‌చేసుకుంటామంటూ ఏపి నుంచి అనుమతి రాగానే హెచ్‌ఒడిలు వారిని విధుల నుంచి రిలీవ్‌ ‌చేయాలి. ఒకసారి బదిలీపై రిలీవ్‌ అయిన తర్వాత..వారిని తిరిగి మళ్లీ తెలంగాణలోకి రప్పించే అవకాశం ఉండదు. దీనిని శాశ్వత బదిలీ కింద పరిగణిస్తారు. బదిలీ నేపథ్యంలో ఎలాంటి టిఎ, డిఎలు వర్తించవు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆఫర్‌తో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాలనుకునే ఉద్యోగులు దాదాపు 3000-3500 మంది వరకు ఉండొచ్చని తెలుస్తుంది. ఇందులో ఎక్కువగా ఉపాధ్యాయులే ఉన్నారు. గెజిటెడ్‌, ‌నాన్‌-‌గెజిటెడ్‌ అధికారులతో పాటు నాలుగో తరగతి ఉద్యోగులందరికీ ఈ అవకాశం ఉంటుంది. వీరు దరఖాస్తు చేసుకున్న వెంటనే ప్రభుత్వం శాశ్వత బదిలీ పక్రియను ప్రారంభిస్తుంది. పదవీ విరమరణ వయసు పెంపు నిర్ణయం వెలువడక ముందు చాలా మంది ఏపీకి వెళ్లాలనుకునేవారు.

కానీ, తెలంగాణలో కూడా వయసు పెంపు నిర్ణయం తీసుకున్నందున ఇప్పుడు వారంతా వెళతారా..అన్న సందేహాలున్నాయి. ఏపీలో పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60కి పెంచగా, తెలంగాణలోనూ ఇటీవలే 61 ఏళ్లకు పెంచారు. పైగా…ఏపీలో 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్‌) ‌మాత్రమే అమల్లో ఉంది. తెలంగాణలో 30 శాతం ఫిట్‌మెంట్‌ అమల్లోకి వొచ్చింది. తెలంగాణలో ప్రతి నెలా 10 లోపు వేతనాలు అందుతున్నాయి. ఏపీలో 20వ తేదీ వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. ఇలాంటి కారణాలు ఉద్యోగులను పునరాలోచనలో పడేసినట్లు ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా.. ఏపీ నుంచి తెలంగాణకు రావాలనుకునే ఉద్యోగులు కూడా దాదాపు 1500 మంది వరకు ఉండొచ్చని అంటున్నారు.

Acceptance of applicationsbreaking newscrime todaypermanent basisprajatantra epaperread news onlinetelugu articlestelugu vaarthalu
Comments (0)
Add Comment