ధన్‌బాద్, జనవరి 28 : జార్ఖండ్ ఓ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో డాక్టర్ దంపతులతో కలిసి ఆరుగురు మరణించారు. ఈ దుర్ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్ నగరంలో శుక్రవారం రాత్రి జరిగింది. ధన్‌బాద్ నగరం పురానాబజార్ లోని హాజ్రా ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. అగ్నికీలలతో పొగ కమ్ముకోవడంతో ఇద్దరు డాక్టర్లతో కలిసి మొత్తం ఆరుగురు మరణించారు. అగ్నిప్రమాదం జరిగినపుడు ఆసుపత్రిలో ఉన్న మరో 9 మందిని స్థానికులు కాపాడారు. ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో డాక్టర్ వికాస్ హాజ్రా, అతని భార్య ప్రేమ హాజ్రా, ఇతర ఆసుపత్రి ఉద్యోగులు నలుగురు మరణించారు. ఆసుపత్రి రెండో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదం మొదటి అంతస్తుకు వ్యాపించింది.
నిద్రలో ఉన్న వారు ఈ అగ్నిప్రమాదం నుంచి బయటపడ లేదు. ఆసుపత్రిలో ఉన్న మరో 9 మందిని పాటలీపుత్ర నర్సింగ్ హోంకు తరలించారు. ఆసుపత్రి లో అగ్నిమాపక సాధనాలు లేవని, సెక్యూరిటీ సిబ్బంది కూడా లేరని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. రెండు అగ్నిమాపక వాహనాలు వచ్చి ఆసుపత్రిలో రాజుకున్న మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో ఓ డాక్టర్ దంపతులతో పాటు వారి బంధువు, మరో ఇద్దరు సిబ్బంది ఉన్నారని ధన్ బాద్ డీఎస్పీ అరవింద్ కుమార్ చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుల్లో వారి మేనల్లుడు కూడా ఉన్నారని చెప్పారు. హాస్పిటల్ కాంప్లెక్స్‌లోనే వారి ఇళ్లు కూడా ఉందని వెల్లడించారు. ఆస్పత్రిలోని రోగులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ధన్‌బాద్ డీఎస్పీ అర్వింద్ కుమార్ బిన్హా తెలిపారు.