ముంబై, ఫిబ్రవరి 7 : మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీఎల్పీ నేత బాలాసాహెబ్ థొరట్ తన పదవికి రాజీనామా చేశారు. సీఎల్పీ నేతగా వైదొలగుతున్నట్టు థొరట్ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు మంగళవారం లేఖ రాశారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలెతో తాను కలిసిపనిచేయలేనని పార్టీ కేంద్ర నాయకత్వానికి థొరట్ స్పష్టం చేశారని ఆయన సన్నిహితుడు సోమవారం వెల్లడించారు.
నానా పటోలె వ్యవహార శైలికి నిరసనగా సీఎల్పీ నేతగా థొరట్ తప్పుకోవడం మహారాష్ట్ర కాంగ్రెస్‌లో కలకలం రేపింది. పార్టీలో సీనియర్ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కడంతో పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీని గాడినపెట్టేందుకు నేతల మధ్య ఐక్యత నెలకొనేలా హైకమాండ్ చొరవ చూపాలని ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.