మళ్ళీ హైదరాబాదుకు..3

“ష్ట్రంలో అప్పటి పీపుల్స్ ‌వార్‌ ‌పార్టీని, ఆరు ప్రజా సంఘాలను నేదురుమల్లి జనార్దన రెడ్డి ప్రభుత్వం నిషేధించింది ఆ క్రిమినల్‌ ‌లా అమెండ్‌మెంట్‌ ఆక్ట్ ‌కిందనే. ఆ చట్టం అసలు ఉనికిలో లేనేలేదని, 1952 లోనే సుప్రీం కోర్టు దాన్ని కొట్టివేసిందని, కనుక ఈ నిషేధం చెల్లదని మేం వాదించిన తర్వాత హడావుడిగా 1992 జూన్‌లో ఆంధ్ర ప్రదేశ్‌ ‌పబ్లిక్‌ ‌సెక్యూరిటీ ఆర్డినెన్స్ అనేదాన్ని తీసుకొచ్చి దాని కింద నిషేధం విధించారు. అదే ఆ తర్వాత చట్టంగా మారింది.”

యూనియన్‌ కార్యకలాపాలు నిర్వహించడం కోసం రాంజీ ప్రతిసారీ ప్రమోషన్‌ ‌నిరాకరించాడు. పదవీ విరమణదాకా గుమస్తాగానే కొనసాగాడు. బహుశా మా రక్తం లోనే ఈ తత్వం ఉందనుకుంటాను. రాంజీ గానీ, శేషాద్రి గానీ, నేను గానీ మాకు వీలయినంత నిరాడంబరంగానూ, మా ఆదర్శాలకు తగ్గట్టుగా జీవించాం. ఒక సమయం లో నాకు విపరీతంగా సంపాదించడానికి అవకాశం వచ్చింది గాని ‘అవసరాలకు మించి డబ్బు పోగేసుకో కూడదు, అవసరాలు మితిమీరి పెంచుకోకూడదు’ అని నియమం పెట్టుకున్నాను.

రాంజీ వల్లనే నాకు వి.జి.రావు కూడా పరిచయమయ్యారు. ఆయన ‘వి.జి.రావు వర్సస్‌ స్టేట్‌’ అనే కేసు ద్వారా సుప్రసిద్ధుడు. 1952లో మద్రాసు ప్రభుత్వం పీపుల్స్ ఎడ్యుకేషనల్‌ ‌సొసైటీ అనే సంస్థ మీద నిషేధం విధించినప్పుడు ఆయన ఆ నిషేధాన్ని సవాలు చేసి గెలిచారు. ఆ సంస్థ కమ్యూనిస్టు అనుబంధ సంస్థ అనే పేరుతో ప్రకాశం పంతులు ప్రభుత్వం ఆ సంస్థను 1908 క్రిమినల్‌ ‌లా అమెండ్‌మెంట్‌ ఆక్ట్ ‌కింద నిషేధించింది. నిజానికి స్వాతంత్య్రోద్యమ కాలంలో చిత్తరంజన్‌ ‌దాస్‌ ‌వంటి నాయకులు ప్రత్యేకంగానూ, మొత్తంగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఈ క్రిమినల్‌ ‌లా అమెండ్‌మెంట్‌ను తీవ్రంగా ఖండించారు. అధికారంలోకి రాగానే వాళ్ళు  దాన్ని వినియోగించడం మొదలుపెట్టారు. వి.జి.రావు వాదన వల్ల సుప్రీం కోర్టు ఆ చట్టాన్నే కొట్టివేసింది.

విచిత్రమైన విషయమేమిటంటే 1992 మే లో రాష్ట్రంలో అప్పటి పీపుల్స్ ‌వార్‌ పార్టీని, ఆరు ప్రజా సంఘాలను నేదురుమల్లి జనార్దన రెడ్డి ప్రభుత్వం నిషేధించింది ఆ క్రిమినల్‌ ‌లా అమెండ్‌మెంట్‌ ఆక్ట్ ‌కిందనే. ఆ చట్టం అసలు ఉనికిలో లేనేలేదని, 1952 లోనే సుప్రీం కోర్టు దాన్ని కొట్టివేసిందని, కనుక ఈ నిషేధం చెల్లదని మేం వాదించిన తర్వాత హడావుడిగా 1992 జూన్‌లో ఆంధ్ర ప్రదేశ్‌ ‌పబ్లిక్‌ ‌సెక్యూరిటీ ఆర్డినెన్స్ అనేదాన్ని తీసుకొచ్చి దాని కింద నిషేధం విధించారు. అదే ఆ తర్వాత చట్టంగా మారింది.

సరే, విజి రావు అప్పుడు రావు అండ్‌ రెడ్డి అనే న్యాయవాదుల ఆఫీసును మద్రాసులో నడుపుతుండేవారు. ఆ తర్వాతి కాలంలో హైకోర్టు న్యాయమూర్తి అయిన ఎవి రెడ్డి కూడా ఆయనతో ఉండేవారు. వామపక్ష కార్యకర్తల కేసులు, పెద్దగా ఫీజులు ఇచ్చుకోలేని పేదల కేసులు చేపట్టే లక్ష్యంతో విజి రావు ఆ ఆఫీసు నెలకొల్పారు. న్యాయవాదులలో వామపక్ష సంస్కృతిని, పేద ప్రజల పట్ల ఆదరాభిమానాలను పెంపొందించడానికి ఆ ఆఫీసు ఎంతో కృషి చేసింది. నేను ఆ ఆఫీసులో చేరకపోయినా వారి కృషి నామీద ప్రభావం వేసింది.

సీనియర్‌ ‌న్యాయవాది బాలకృష్ణన్‌ నన్ను ఆర్‌ఎం ‌శేషాద్రి అనే మరో సీనియర్‌ ‌న్యాయవాది దగ్గర చేరమని సలహా ఇచ్చారు. నేను బాలకృష్ణన్‌ ఆఫీసులో నా నల్లకోటు, గౌను పెట్టుకుంటుండే వాణ్ణని, ఆయన లైబ్రరీ ఉపయోగించుకునే వాణ్ణని ఇదివరకే చెప్పాను.

ఆర్‌ఎం ‌శేషాద్రి చాలా ప్రతిభావంతుడైన న్యాయవాది. ఆయన ఐసిఎస్‌ అధికారిగా  పదవీ విరమణ చేసి న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. నేనాయన దగ్గర చేరాను గాని ఎనిమిది నెలలలోపలే ఆ ఆఫీసు నుంచి బయటకు వచ్చేశాను.

ఆ తర్వాత టివిఎస్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. కొన్నాళ్ళు మద్రాసులో పర్సనల్‌ ఆఫీసులో పనిచేసి ఆ తర్వాత బ్రాంచి మేనేజరుగా విజయవాడ వచ్చాను. ఆ రోజుల్లో టివిఎస్‌ ‌వ్యాపారం అంత పెద్దగా ఉండేది కాదు. నేను విజయవాడ వచ్చే టప్పటికి అక్కడ రెండు ట్రక్కులు మాత్రమే ఉండేవి. నేనక్కడ తొమ్మిది నెలలు పని చేశాను గాని వ్యాపారం బాగా పుంజుకుంది. నేను ఉద్యోగం వదిలేసేటప్పటికి దాదాపు అరవై ట్రక్కుల రవాణా జరుగుతుండేది. నేను విజయవాడలో ఉన్న రోజుల్లోనే లుముంబానగర్‌ ‌మహాసభ జరిగింది. మోహనకుమార మంగళం వక్తగా వస్తే నేను మా ఆఫీసు కారులోనే ఆయనను స్టేషన్‌ ‌నుంచి మా ఇంటికి తీసుకుపోయాను. కుమార మంగళం నన్ను తన ఆఫీసులోకి తీసుకోలేదని నాకు అప్పుడు కోపం వచ్చింది గాని ఇప్పుడు నా దగ్గర జూనియర్లుగా చేరుతామని వచ్చే యువ న్యాయవాదు లతో నేనూ అట్లాగే అంటున్నాను.

కుమార మంగళం మెల్లమెల్లగా కాంగ్రెస్‌ ‌వైపు, ఇందిరాగాంధీ వైపు జరగడం నేను చూశాను. ఆయన అడ్వకేట్‌ ‌జనరల్‌ పదవిలో చేరడానికి ఒప్పుకున్న సందర్భంలో వచ్చి రిట్జ్ ‌హోటల్‌లో ఉన్నాడు. నేనాయనను కలిసి ‘అదేంపని’ అని గట్టిగా అరిచాను. ఇక ఇందిరా గాంధీని సమర్థిస్తూ ఆమె మంత్రివర్గంలో చేరినప్పుడు నిరసన తెలుపుతూ ఉత్తరం రాశాను.

అట్లా రాంజీ, విజి రావు, కుమార మంగళం వంటి వారి ప్రభావాల వల్ల కావచ్చు నేను హైదరాబాద్‌ రాగానే సింగరేణి కార్మికుల ఉద్యమంతో సంబంధం ఏర్పడింది. అప్పుడు సింగరేణి కాలరీస్‌లో శ్రీనివాసన్‌ అని ఐఎన్‌టియుసి నాయకుడు ఉండేవారు.

సింగరేణి కార్మికుల వేతనాలకు సంబంధించి ఏదో వివాదం వచ్చింది. ఇంక్రిమెంట్లు ఇచ్చే పద్దతి గురించి యాజమాన్యానికీ, కార్మికులకూ విభేదం వచ్చింది. శ్రీనివాసన్‌ ‌నా దగ్గరికి వచ్చి ఈ కేసు చేపట్టాలని, వాదనలకోసం ఎవరైనా సీనియర్‌ న్యాయవాదిని పిలవాలని అడిగారు. నేను మోహన కుమార మంగళాన్ని అడుగుతానని, ఆయనకు వీలు కాకపోతే నేనే వాదిస్తానని అన్నాను.

ఆ రోజుల్లోబొగ్గుగని కార్మికుల కేసులు వాదించడానికి ధన్‌బాద్‌లో నర్సింగ్‌ అని ఒక ప్లీడర్‌ ఉండేవారు. బొగ్గుగనుల గురించి, కార్మికుల పని పరిస్థితుల గురించి వాదించడంలో ఆయన దిట్ట.

నా వరకు నాకు అది మొట్టమొదటి పెద్ద కేసు. చాల కష్టపడి నా వాదనలన్నీ సమకూర్చుకున్నాను. ఆ కేసు గోపాలరావు ఎక్బోటె ముందు విచారణకు వచ్చింది. నా వాదనలతో ఆయన ఏకీభవించారు. నేనంటే ఆయనకు చాలా ఇష్టం ఏర్పడింది. ఆ కేసులో నేను గెలవడం మాత్రమే కాదు, గోపాలరావు ఎక్బోటె వంటి న్యాయమూర్తికి ప్రీతి పాత్రుణ్ణయ్యాను.

ఆ తర్వాత కొద్దికాలానికే సింగరేణి కార్మికుల వేజ్‌ ‌బోర్డు వివాదం వచ్చింది. కార్మికుల హోదాలు, జీత భత్యాలు జాతీయ స్థాయిలో ఒకేరకంగా నిర్ధారించాలని, వేతన స్కేళ్ళను నిర్థారించాలని ప్రయత్నం మొదలయింది.

ఈ వివాదం పారిశ్రామిక వివాదాల ట్రిబ్యునల్‌ ‌ముందుకు వచ్చింది. మళ్ళీ శ్రీనివాసన్‌ నా దగ్గరికి వచ్చి ఈ కేసు చేపట్టాలన్నారు. నేని విజి రావును సంప్రదించాను. ఆయన అప్పటికి రిటైరయి బెంగుళూరులో ఉంటున్నారు. పారిశ్రామిక వివాదాల చట్టం కేసులలో ఆయన నిష్ణాతుడు. ఆయనతో ఈ కేసు గురించి చర్చించడం కొరకు నేను బెంగుళూరు వెళ్ళాను. టైప్‌ ‌రైటర్‌ను, గుమస్తాను పెట్టుకుని రైలు ప్రయాణంలోనే క్లెయిమ్‌ ‌పత్రాలు టైపు చేయించుకు వెళ్ళాను.

విజి రావు నేను రాసిన వాదనలు చదివి అన్నీ బాగున్నాయన్నారు. రెండు రోజుల పాటు చర్చించి హైదరాబాదుకు తిరిగి వచ్చాను. కాని పారిశ్రామిక వివాదాల చట్టం కేసుల్లో, ట్రిబ్యునల్‌లో చాలా కాలయాపన జరుగుతుంది.

ఈలోగా ఐఎన్‌టియుసి పెద్దలు నా దగ్గరికి వచ్చినందుకు అభ్యంతరం చెప్పి నట్టున్నారు. శ్రీనివాసన్‌ ‌నా దగ్గరికి రావడం మానేశారు. ఎఐటియుసి నాయకుడు కొమరయ్య వచ్చారు. ఆయన అట్టడుగు కార్మికవర్గం నుంచి వచ్చారు. తర్వాతి కాలంలో ఏమయిపోయినా అప్పుడు మాత్రం చాలా చిత్తశుద్ధితో ఉండేవారు.

కాని కేసు పదేపదే వాయిదా పడుతుండేది. సాక్ష్యాల నమోదు చాలా ఆలస్యమవు తుండేది. కొమరయ్య ‘ఏమి సార్‌ ఇట్లా, ఎన్నాళ్ళకు తెగుతుంది’ అనేవాడు. మొత్తం వివాదాన్ని చిన్న చిన్న ముక్కల కింద చేసి, ఆ చిన్న అంశాల మీద సమ్మె చేసి పరిష్కారం సాధించుకోవడం ఉత్తమమని నేను సలహా ఇచ్చాను. నిజంగానే అది సాధ్యమైంది.ఆ ట్రిబ్యునల్‌ టి. చంద్రశేఖర రెడ్డి నేతృత్వంలో కొత్తగూడెంలో విచారణ జరుపు తుండేది. యాజమాన్యం తరఫున కోకా శ్రీనివాస మూర్తి వాదించేవారు.

మొత్తం మీద ఒక వైపు ట్రిబ్యునల్‌ జరుగుతుండగానే ఆ వివాదంలోని అనేక అంశాలు యాజమాన్యానికీ, కార్మిక యూనియన్లకూ మధ్య ఒప్పందాల ద్వారా పరిష్కారమయిపోయాయి.చివరికి మిగిలిపోయిన వివాదాల కోసం కొత్తగూడెంలో విచారణ మొదలయింది. నేనక్కడ ఒక చిన్న హోటల్‌లో ఉండి నా వాదనలు సాగించాను. మొత్తం 109 మందిని విచారించడం జరిగింది.

అప్పుడే చంద్రశేఖర రెడ్డి నన్ను భద్రాచలం రమ్మన్నారు. నాకు నమ్మకాలు లేవని, రానని అన్నాను గాని మర్యాద కోసం వెళ్ళవలసి వచ్చింది. చంద్రశేఖర రెడ్డి, శ్రీనివాస మూర్తి, నేను భద్రాచలం రామాలయంలోకి వెళ్ళాం.

అక్కడ నా పేరు చెప్పగానే, ఆ ఆలయంలోని శ్రీవైష్ణవ పూజారి నా పేరును సరిగా, కచ్చితంగా ఉచ్చరించారు. నాపేరు మీదనే కౌశిక గోత్రస్య, కన్నబిరాన్‌ నామధేయస్య అని మొదటి అర్చన చేయించారు. నా తర్వాతే చంద్రశేఖర రెడ్డి, శ్రీనివాస మూర్తిల అర్చన జరిగింది.

కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్ 

Comments (0)
Add Comment