ఎం‌దుకువదులుతాం?

పొలిమేర తాకంగానే

నిలవనివ్వని గాలి తెమ్మెరలు!

అమ్మోరి రావిచెట్టు గలగలలు !

మర్రిచెట్టు ఊడల ఉయ్యాలలు!

గోధూళి నేలల్లో మట్టివాసనలు !

స్వాగతం పలుకుతాయి!

చెరువుల్లో మహిషాలు

జలకాలు ఆడుతుంటే!

గట్టుపైన పాలేగాళ్ళు

దమ్ములు పీలుస్తుంటే!

బర్రెలు కాసేవోళ్లు

బచ్చాలు ఆడుతుంటే!

పిచ్చి పుల్లమ్మ పది

పైసలు బిచ్చమడుగుతుంటే!

గుడిసెలో బైరాగి తత్వాల

కూనిరాగాలన్నీ

తాడిచెట్టు కింద

కల్లు ప్రియులు సరదాల్లో

కలిసి బాణీలు కడుతుంటే!

ఎగుడు దిగుడు మట్టి దారులు

ఇరువైపుల మలమూత్రాలు!

పిచ్చికుక్కల అరుపులు

పొగరు ఆబోతుల రంకెలు!

ఏవీ అసహ్యం అనిపించలేదు!

ఎక్కడా భయం వేయలేదు!

రచ్చబండ పై ముసలమ్మ

ఏరా ఎలా ఉన్నావ్‌?

అన్న పలకరింపులో

ఆప్యాయతకు కళ్ళు

చెమ్మగిల్లాయి!

బదులు రాక గొంతు

మూగబోయింది!

అదేంటో

కాస్తంత కడుపు నిండి

కూసంత కలిమి కలిగితే

కన్నఊరు ఎందుకు వదులుతాం?

కన్నీరు ఎందుకు కారుస్తాం?

– ఉషారం, 9553875577

Comments (0)
Add Comment