విషాదాంతం

కనీసం ఒక దుఃఖాన్నైనా వెనకేసుకోవల్సింది
బతుకు మడతల్లో ఎక్కడో ఉండిపోయాయో
సంధ్యవేలో పొద్దుగాలో దులిపేప్పుడు పడిపోయాయో
నిఖార్సైన విషాదం ఎట్టాంటిదో ఇంకా చూడలే
ఎదపై హతాశపు దరువు ఇంకా మోగలే
లోతులను కదిలించాలె పెకలించాలె
ఇంత కర్కశమా జీవితం అన్నది అడ్డురాలే ఇంకా
లోపల మొలకెత్తని బుద్ధుడున్నాడు
కాలం శవమై రోగిష్టై ముసలిదై కానరాలే
మహాభినిష్క్రమణలు ఇక ఉండవేమో
మనకు మనమే సర్దిచెప్పుకునే మనుషులమైపోయాము
చరిత్ర మరకలు ఏం పెట్టి తుడిచినా పోవే
సంచుల్లో పెట్టెల్లో బతికున్న నాగరికత దేహాన్ని కట్టి
నదుల్లో పారేసినా ముక్కలు చేసి
వ్యథల కూడలిలో విసిరేసినా
భవిష్యత్తు పట్టాలపై పడుకోబెట్టినా
ఇంకో చెంప చూపెట్టడానికి
మొహాలు లేవే మొండాలు తప్పా
ఎన్ని దారులు చూపినా ఎంత మంది చెప్పినా
కడుపులు తప్పా తలలు లేవు
వాసనలు తప్పా ఆవిష్కరణలు రావు
ఎక్కడో ఓ చోట ఒక చినుకు పడ్తే
అది వర్షమెప్పుడవుతుంది
ఆ సమయాలు ఇక లేవు
అతివృష్టిని వెతుక్కుంటూ
అనావృష్టి కత్తిదూసింది
కరువు కాటకాలు కృత్రిమ ఎరువులో
ఏపుగా పెంచబడి రూపం మార్చుకున్నాయి
దరిద్రం ఇప్పుడు ఒక సాఫ్ట్ ‌వేర్‌
‌వచ్చినవాడు తొక్కిడిస్తూనే ఏలేస్తాడు
అందరికీ అన్నీ తెలుసు
అందుకున్నంత ఆకాశం
అవకాశం దిండుకింద నిద్రపోతది
ఎవడికి ఏం కావాలో ఎటుపోతాడో
పొద్దెక్కితేగాని చెప్పలేం
ఈ క్షణం తరువాతి క్షణంతో
అక్రమ సంబంధం పెట్టుకుని
కృత్రిమ గర్భం దాలుస్తది
నీతి నియమం కల్తీ నవ్వుల్తో కలిసి
అమ్ముడుపోతాయ్‌
‌చివరికి తాకట్టు తలనరుక్కుని
ఏ దేశం గుమ్మం ముందో వేలాడుతుంటుంది
అక్కడ ఆశ్చర్యంతో కొన్ని కాకులు అరుస్తూ
తలా ఓ ముక్క ముక్కున కరుచుకుని
అభివృద్ధి కొమ్మలపై కూర్చుంటాయ్‌..
ఈ ‌నాటకం అదే కొమ్మలకు విషాదంగా
ఉరేసుకుంటుంది!!
  – రఘు వగ్గు.

Comments (0)
Add Comment