ఫుట్‌బాల్‌ ‌స్టేడియం ఘటనపై ఉన్నతస్థాయి విచారణ

తొక్కిసలాట ఘటనలో 174కు చేరిన మృతుల సంఖ్య..
ఐసియూలో పలువురికి చికిత్స

ఇం‌డోనేషియాలో ఫుట్‌బాల్‌ ‌స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 174 మంది ప్రాణాలు కోల్పోగా పలుఉవరు గాయపడ్డారు. తొక్కిసలాట ఘటన అనంతరం 127 మంది చనిపోయారని అధికారులు ప్రకటించగా.. మధ్యాహ్నానికి ఆ సంఖ్య 174కు పెరిగింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వైద్య బృందాలు తెలిపాయి. గాయపడిన వారిలో వంద మందికిపైగా ఐసియులో చికిత్స పొందుతున్నారు. వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.దారుణ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఇండోనేషియా అధ్యక్షులు జోకో విడోడో పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకూ దేశంలో ఫుట్‌బాల్‌ ‌మ్యాచ్‌లు నిర్వహించవద్దని ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ను ఆదేశించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఫిఫా, పిఎస్‌ఎస్‌ఐ, ఎఎఫ్‌సి తదితర అసోసియేషన్లు డిమాండ్‌ ‌చేశాయి. అభిమానుల మధ్య ఘర్షణను నివారించడానికి పోలీసులు టియర్‌ ‌గ్యాస్‌ ఉపయోగించడం, లాఠీఛార్జి చేయడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఈస్ట్ ‌జావా ప్రావిన్స్‌లోని మలాంగ్‌ ‌పట్టణంలోని కంజురుహన్‌ ‌స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పెర్సెబాయ సురబాయ జట్టు చేతిలో అరెమా జట్టు ఓడిపోయింది. దీంతో ఇరు జట్ల అభిమానుల మధ్య ఘర్షణ ప్రారంభమయింది. దీంతో అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు టియర్‌ ‌గ్యాస్‌ ‌ప్రయోగించ డంతోపాటు, లాఠీఛార్జ్ ‌చేశారు. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా తొక్కిసలాట జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. స్టేడియంలో ఎటువంటి అల్లర్లు జరగలేదని, పోలీసులు టియర్‌ ‌గ్యాస్‌ ఎం‌దుకు ప్రయోగించారో తెలియదని కొందరు ప్రేక్షకులు చెబుతున్నారు. చిన్నారులు, మహిళలు ఉన్నారని కూడా చూడకుండా భద్రతా సిబ్బంది దారుణంగా వ్యవహరించారని చెప్పారు.

స్టేడియం లోపల తొక్కిసలాట అనంతరం స్టేడియం వెలుపల ఆందోళనకారులు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. సుమారు 15 వాహనాలకు నిప్పు పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన సమయంలో దాదాపు మూడు వేలమంది మైదానంలో పిచ్‌పైకి దూసుకొచ్చారని, వారిని అదుపు చేసేందుకే టియర్‌ ‌గ్యాస్‌ ‌ప్రయోగించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ స్టేడియం పూర్తి సామర్థ్యం 38 వేలు అని, అయితే 42 వేల టికెట్లు విక్రయించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలోనే క్రీడా కార్యక్రమాల్లో ఇప్పటివరకు చోటుచేసుకున్న ప్రమాదాల్లో ఇదే అత్యంత విషాద ఘటనగా భావిస్తున్నారు.

prajatantra newsTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment