పార్లమెంట్‌లో కొనసాగుతున్న ప్రతిష్ఠంభన

  • వరుసగా మూడోరోజూ ఆదానీ వ్యవహారంపై విపక్షాల ఆందోళన
  • జెపిసి ఏర్పాటుకు డిమాండ్‌
  • ‌పార్లమెంట్‌ ఉభయ సభలు నేటికి వాయిదా

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 6 : అదానీ గ్రూప్‌ ఆఫ్‌ ‌కంపెనీల అవినీతి, అక్రమాలపై చర్చ జరుపాలంటూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలతో పార్లమెంట్‌ ఉభయసభలు దద్దరిల్లాయి. అదానీ గ్రూప్‌లో అవకతవకలను వెలికితీయడానికి జాయింట్‌ ‌పార్లమెంటరీ కమిటీ జేపీసీని ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. కానీ, లోక్‌సభలో స్పీకర్‌గానీ, రాజ్యసభలో చైర్మన్‌గానీ వారి డిమాండ్లను అంగీకరించలేదు. దాంతో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. లోక్‌సభలో స్పీకర్‌ ‌పోడియంలోకి, రాజ్యసభలో వెల్‌లోకి దూసుకెళ్లి ఎంపీలు ఆందోళనకు దిగారు.

ఇలా పోడియంలోకి దూసుకొచ్చి ఆందోళన చేయడం భారతీయ సాంప్రదాయం కాదని స్పీకర్‌ ఓం‌బిర్లా వారించినా సభ్యులు వినిపించుకోలేదు. అటు రాజ్యసభ కూడా విపక్ష సభ్యుల నినాదాలదో మార్మోగింది. ఈ క్రమంలో పార్లమెంటు ఉభయసభలు మధ్యాహ్నం 2.00 గంటల వరకు వాయిదాపడ్డాయి. వాయిదా అనంతరం సభలు ప్రారంభమైనప్పటికీ అదే పరిస్థితి కొనసాగింది. లోక్‌సభలో, రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీల నినాదాల జోరు కొనసాగింది. రాజ్యసభలో ఎవరి స్థానాల్లోకి వాళ్లు వెళ్లాలంటూ చైర్మన్‌ ‌ధన్‌కడ్‌ ‌చేసిన విజ్ఞప్తిని ఎవరూ లెక్కచేయలేదు. దాంతో ఉభయసభలు రేపటికి వాయిదాపడ్డాయి. వరుసగా మూడ్రోజులు పార్లమెంట్‌ ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే ఆదానీ వ్యవహారంపై అట్టుడికింది.

 

Comments (0)
Add Comment