నేటి నుండి శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు

అక్టోబర్‌ 5‌న ధ్వజావరోహణంతో పరిసమాప్తి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అనగానే భక్త జన ప్రవాహం, తన్మయత్వంతో మిన్నంటేలా వారు చేసే గోవింద నామ స్మరణ, మాడ వీధుల్లో దేవేరులతో స్వామి ఊరేగింపులూ, సాటిలేని వైభవంతో సాగే వాహన సేవలు కళ్ళ ముందు కదులుతాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని వివిధ రూపాల్లో, అవతారాల్లో దర్శనం చేసుకున్న వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు.. పుణ్యఫలాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. తిరుమల చరిత్రలో, వందల ఏళ్ళ నుంచీ వివిధ ఉత్సవాల నిర్వహణ జరుగుతున్నది. ఎందరో రాజులు, ఆర్కాటు నవాబులు, ఈస్టిండియా కంపెనీ ప్రతినిధులు, బ్రిటిష్‌ అధికారులు, తర్వాత హథీరాం మహంతుల హయాంలో ఉత్సవాలు కొనసాగాయి. ఒకప్పుడు నెలకు ఒకసారి బ్రహ్మోత్సవాలు జరిగేవట. కొన్ని ఇబ్బందులు, సమస్యల కారణంగా ఏడాదికి ఒకసారి, అధిక మాసంలో రెండుసార్లకు బ్రహ్మోత్సవాలు పరిమితం అయ్యాయి. ఈ వేడుకల్లో శ్రీ వేంకట్వేరుడు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తకోటికి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితులు తలెత్తినప్పటికీ శ్రీవారి బ్రహ్మోత్సవాలను రద్దు చేయడం తిరుమల క్షేత్ర చరిత్రలో లేదు.

కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమలలో ఏడాది వార్షిక (సాలకట్ల) బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు సాంప్రదాయ రీతిలో కన్నుల పండువగా కొనసాగ నున్నాయి. భాద్రపదంలో నిర్వహించే ఉత్సవాలను సాలకట్ల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్‌ 26 ‌నుండి అక్టోబర్‌ 5 ‌వరకు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలను ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా, లక్షలాది మంది భక్తుల మధ్య నిర్వహించడం ఆనవాయితీగా వొస్తుండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన కొవిడ్‌-19 ‌నిబంధనలకు అనుగుణంగా, మార్గదర్శకాలను పాటించి, గత రెండేళ్ళ నుండి భక్తుల భాగస్వామ్యం లేకుండానే ఉత్సవాలను నిర్వహించారు. ఈసారి భక్తుల సమక్షంలో నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాలలో మొదటిరోజు స్వామి ఊరేగే వాహనం పెద్దశేష వాహనం, రెండో రోజు ఉదయం చిన్నశేష వాహనంపై దర్శనమిస్తే, అదే రోజు రాత్రి సరస్వతి మూర్తిగా హంస వాహనంపై శ్రీవారు దర్శనం ఇస్తారు. మూడో రోజు ఉదయం సింహ వాహనంపై, రాత్రి ముత్యపు పందిరి వాహనంలో అధిరోహించనున్నారు. నాలుగోవ రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై, రాత్రి సర్వభూపాల వాహనంపై, ఇక ఐదోవ రోజు ఉదయం మోహిని అవతారంలో దర్శనమిస్తే, అదే రోజు రాత్రి స్వామి వారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఇక ఆరో రోజు ఉదయం హనుమంత వాహనం, సాయంకాలం స్వర్ణరథం, రాత్రి గజ వాహనం, ఏడో రోజు ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చందప్రభ వాహనం, ఎనిమిదో రోజు ఉదయం రధోత్సవం, అదే రోజు అశ్వ వాహనం, ఇక బ్రహ్మోత్సవాలలో చివరి రోజు చక్రస్నానం నిర్వహించనున్నారు. తొమ్మిదో రోజు ఉదయం శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించగా, బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు ఆలయ మాడ వీధుల్లో వాహన సేవలు జరుగ నున్నాయి. సెప్టెంబర్‌ 26‌న అంకురార్పణతో ప్రాంభమయ్యే ఉత్సవాలు 5వ తేదీతో ముగియనున్నాయి.

బ్రహ్మోత్సవాలను ప్రారంభించే ముందు ఎటువంటి ఆటంకాలు కలగకుండా, విజయవంతంగా జరగాలని కోరుకుంటూ వైఖాసన ఆగమనంలోని క్రతువులలో అంకురార్పణంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీవారి సేనాధిపతి అయిన విశ్వక్సేనుల వారి ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంత మండపానికి ఊరేగింపుగా వెళ్ళి, అక్కడ భూమాతకు ప్రత్యేక పూజలు చేసి, ఆ మట్టిలో నవధాన్యాలను నాటుతారు. అందుకే దీనిని అంకురార్పణం అంటారు. సెప్టెంబర్‌ 26‌న రాత్రి 7 నుండి 8 గంటల మధ్య అంకురార్పణ చేస్తారు. ప్రతిరోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామివారి వాహన సేవలు జరుగుతాయి.

గరుడ వాహనం రాత్రి 7 నుండి తెల్లవారు జామున 2 గంటల వరకు నిర్వహిస్తారు. సెప్టెంబరు 27న మొదటి రోజు సాయంత్రం 5.15 నుండి 6.15 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 నుండి 11 గంటల వరకు పెద్ద శేష వాహనంపై ఊరేగింపు ఉంటుంది. 28న రెండో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు హంస వాహనంపై విహరిస్తారు. 29న మూడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు సింహ వాహనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. 30న నాలుగో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై దర్శనమిస్తారు.

అక్టోబర్‌ 1‌న ఐదో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మోహినీ అవతారం, రాత్రి 7 నుండి గరుడ వాహనంపై భక్తులకు కనిపిస్తారు. 2న ఆరో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు రథరంగ డోలోత్సవం(స్వర్ణ రథం), రాత్రి 7 నుండి 9 గంటల వరకు గజ వాహనంపై స్వామి వారు దర్శనమిస్తారు. 3న ఏడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు చందప్రభ వాహనంపై కనిపిస్తారు. 4న ఎనిమిదో రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం (చెక్క రథం), రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనంపై విహరిస్తారు. అక్టోబర్‌ 5‌న తొమ్మిదో రోజు ఉదయం 6 నుండి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 9 నుండి 10 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తారు.

వాహనసేవల ముందు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఆంధప్రదేశ్‌, ‌తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి అపురూపమైన కళారూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.

తిరుమల ఆస్థాన మండపం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి వద్ద సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబర్‌ 27‌వ తేదీన ఆంధ్ర ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించ నున్నారు. సీఎం జగన్మోహన్‌ ‌రెడ్డి తిరుమలకు రానుండటంతో పోలీస్‌ ‌శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ముందుగా తాతయ్యగుంటలో గంగమ్మను దర్శించుకొని, సీఎం జగన్‌, ఆ ‌తర్వాత అలిపిరి చేరుకుని అక్కడ ఎలక్ట్రిక్‌ ‌బస్సులను ప్రారంభిస్తారు. తిరుపతి నగరంలోని కరకంబాడి మార్గం నుంచి లీలామహల్‌ ‌సర్కిల్‌ ‌మీదుగా కపిలతీర్థం రోడ్డులోని వాసవి భవన్‌ ‌వరకు నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను జగన్‌ ‌ప్రారంభిస్తారు. ఛైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి, ధర్మకర్తలు, అధికారుల పర్యవేక్షణలో విశేష కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలు సమయంలో అన్ని ప్రివిలేజ్‌ ‌దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని టీటీడీ నిర్ణయించిందని,  గదులకు సంబంధించి 50శాతం ఆన్‌లైన్‌లో భక్తులు బుక్‌ ‌చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచామని ఈఓ ధర్మారెడ్డి పేర్కొన్నారు.

Comments (0)
Add Comment