- తుక్కుగా మార్చే యోచనలో ఏపి ప్రభుత్వం
- కేంద్రం ఆదేశాలతో ఏప్రిల్ 1 నుంచి అమలు
అమరావతి, మార్చి 23 : ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్రంలో వాహనాల తుక్కు పాలసీని అమల్లోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలను తుక్కు చేయనున్నారు. తుక్కు పాలసీ ప్రకారం 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు ఫిటెనెస్ టెస్ట్‌లో విఫలమైతే వాటిని తుక్కుగా మార్చాలని కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలో ఏపిలో ముందుగా ఈ పాలసీని ప్రభుత్వ శాఖల్లో అమలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వ శాఖలు, ఏపీఎస్‌ఆర్టీసీతో కలిపి 440 వాహనాలు ఉన్నట్లు లెక్కతెల్చారు. ప్రభుత్వ శాఖల్లో 15 ఏళ్లు దాటినవి ఇప్పటి వరకు 37 వేల వాహనాలు ఉంటాయని రవాణాశాఖ రికార్డులు తెలుపుతున్నాయి. వీటిల్లో 440 వాహనాలను తుక్కు చేయనున్నారు. ఈ 440 వాహనాల్లో ఆర్టీసీ బస్సుల ఉన్నట్లు గుర్తించారు. ఈ 220 బస్సుల్లో 8 డిపో గూడ్స్ ట్రాన్‌పోర్ట్ లు ఉన్నాయి.
మిగిలిన 212 బస్సుల్లో 93 విజయవాడ నగరంలో తిరుగుతున్న సిటీ బస్సులే. ఇవన్నీ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద గతంలో కొనుగోలుచేసిన సీఎన్‌జీతో నడిచే బస్సులు. మిగిలినవి రాష్ట్రంలో వివిధ డిపోల పరిధిలో ఉన్న ప్లలెవెలుగు సర్వీసులుగా తేల్చారు. వాణిజ్య, వ్యక్తిగత వాహనాల తుక్కు పాలసీలో వ్యక్తిగత వాహనాన్ని తుక్కుచేసి, దానిస్థానంలో కొత్తది కొనుగోలుచేస్తే జీవిత పన్నులో 25 శాతం, వాణిజ్య వాహన జీవితపన్నులో 15 శాతం రాయితీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆయా వాహనాలపై ఉన్న జరిమానాలన్నింటినీ రద్దు చేయాలి. ఇందుకు రాష్ట్రప్రభుత్వం సమ్మతి తెలపాల్సి ఉంటుంది. ఈ విధానం ఎప్పటి నుంచి అమలు చేయాలో కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీచేస్తుందని అధికారులు చెబుతున్నారు.