ఇండోర్, మార్చి 31 : మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్‌లో శ్రీరామనవమివేడుకల సందర్భంగా మెట్లబావి పైకప్పు కూలిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది. ఇండోర్‌లోని పటేల్ నగర్‌లోని బలేశ్వర్ మహదేవ్ జులేలాల్ గుడిలో హవనం జరుగుతున్నప్పుడు ఆలయంలో ఉన్న మెట్ల బావి పైకప్పు కూలిపోయింది. పైకప్పు ఒక్కసారిగా కూలడంతో దాదాపు 50 మంది భక్తులు అందులోపడిపోయారు. దీంతో ఇప్పటివరకు 35 మంది చనిపోయారు. మరో 18 మంది గాయపడి చికిత్స పొందుతున్నారని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు.
19 మందిని ప్రమాదం నుంచి రక్షించారు. ఇండోర్‌లోని మహదేశ్ జులేలాల్ ఆయంలో గురువారం జరిగిన రామనవమి ఉత్సవాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయంలో స్థలం లేకపోవడంతో వేడుకలను చూసేందుకు కొందరు భక్తులు గుడిలో ఉన్న మెట్ల బావిపై కూర్చున్నారు. అయితే బరువు అధికమవడంతో పురాతనమైన ఆ బావి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో సుమారు 50 మంది భక్తులు అందులో పడిపోయారు.