ఆవుల సుబ్బారావుకు 14 రోజుల రిమాండ్‌

‌చంచల్‌గూడ జైలుకు తరలింపు
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 25 : ‌సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్ల ప్రధాన సూత్రధారి ఆవుల సుబ్బారావుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ ‌విధించింది. దీంతో పోలీసులు సుబ్బారావును రైల్వే కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. సికింద్రాబాద్‌ అల్లర్లకు సుబ్బారావు ప్రధాన కుట్రదారుగా పోలీసులు నిర్దారించారు. అతనిని అరెస్టు చేసి రైల్వే కోర్టులో హాజరుపరిచారు. సుబ్బారావుతోపాటు అతని అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిని కూడా కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ ‌విధించారు.సుబ్బారావు కనుసన్నల్లోనే అల్లర్లు జరిగాయని రైల్వే పోలీసులు నిర్దారించారు. దీనికోసం అతడు ఎనిమిది వాట్సాప్‌ ‌గ్రూప్‌లను క్రియేట్‌ ‌చేశాడని, వాటిద్వారా అభ్యర్థులను రెచ్చగొట్టాడని తెలిపారు. బీహార్‌ ‌తరహాలో విధ్వంసం చేయాలని వాయిస్‌ ‌మెసేజ్‌లు చేశారని పేర్కొన్నారు.

ఈనెల 16న సాయంత్రమే సుబ్బారావు హైదరాబాద్‌ ‌చేరుకున్నాడని, అల్లర్ల కోసం రూ.35 వేలు ఖర్చు చేశాడని వెల్లడించారు. అభ్యర్థులను కూడా అతడే తరలించాడని, ఎనిమిది ఫంక్షన్‌ ‌హాళ్లలో వారికి మకాం ఏర్పాటు చేశాడని వెల్లడించారు. విధ్వంసాన్ని సుబ్బారావు అనుచరుడు బీసీ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించాడని తెలిపారు. మరో అనుచరుడు శివ ద్వారా రైల్వే స్టేషన్‌ ‌విధ్వంసానికి ఆదేశించాడని పేర్కొన్నారు. అయితే పోలీసుల కాల్పుల్లో యువకుడు మరణించడంతో సుబ్బారావు హైదరాబాద్‌ ‌నుంచి పారిపోయాడని, అల్లర్లు జరిగిన వెంటనే వాట్సాప్‌లో మెసేజ్‌లు డిలీట్‌ ‌చేయాలని ఆదేశించాడని చెప్పారు. సాక్షాలు లేకుండా చూడాలని ప్రయత్నించాడని తెలిపారు.

Comments (0)
Add Comment