అమరావతి కేసును 23న విచారిస్తాం : సుప్రీమ్‌ ‌కోర్టు ధర్మాసనం

  • అత్యవసరంగా చేపట్టాలని ఎపి ప్రభుత్వం పిటిషన్‌
  • ‌తమకు సమయం ఇవ్వాలని కోరిన అమరావతి రైతులు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 6 : ఏపీ రాజధాని అమరావతి కేసుపై ఈనెల 23న సుప్రీమ్‌ ‌కోర్టులో విచారణ జరుగనుంది. రాజధాని అమరావతి కేసును త్వరితగతిన విచారించాలని సోమవారం ఉదయం సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లను త్వరితగతిన విచారించాలని జస్టిస్‌ ‌కేఎం జోసెఫ్‌ ‌ధర్మాసనం వద్ద రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిరంజన్‌ ‌రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. విశాఖకు రాజధాని మారుస్తున్నట్లు ఇటీవల స్వయంగా సిఎం జగన్‌ ‌ప్రకటించారు. పెట్టుబడులకు సంబంధించిన ఓ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో త్వరగా అమరావతి కేసు తేల్చాలని ప్రభుత్వం కోరుకుంటోంది. అయితే కోర్టు ఇచ్చిన నోటీసులు తమకు జనవరి 27న అందాయని రైతుల  తరపు న్యాయవాదులు తెలిపారు. కౌంటర్‌ ‌దాఖలు చేయడానికి తమకు కనీసం రెండు వారాల సమయం ఇవ్వాలని కోరారు.

దీంతో ఈనెల 23న విచారణకు తీసుకుంటామని జస్టిస్‌ ‌కేఎం జోసెఫ్‌, ‌జస్టిస్‌ ‌నాగరత్న ధర్మాసనం వెల్లడించింది. అయితే త్వరితగతిన ఈ కేసును సుప్రీంకు తీసుకువచ్చి.. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదంటూ ఏపీ హైకోర్టు  ఇచ్చిన తీర్పుపై స్టే తెచ్చేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సుప్రీంలో స్టే వచ్చిన వెంటనే తన మకాంను విశాఖకు మార్చాలని ముఖ్యమంత్రి జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ‌సమ్మిట్‌ ‌లో సీఎం మాట్లాడుతూ.. మార్చి మొదటి వారంలో విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ ‌సమ్మిట్‌ ‌జరగబోతోందని… అక్కడి వచ్చిన ఏపీలో కూడా పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్ల ను ఆహ్వానించారు.

విశాఖ రాజధాని కాబోతోందని… తాము కూడా అక్కడకు మారబోతున్నట్లు సీఎం జగన్‌ ‌చెప్పిన విషయం పెను దుమారాన్ని రేపింది. అయితే రాజధాని అంశం సుప్రీం కోర్టులో ఉండగా… విశాఖ రాజధాని అంటూ ఎలా చెబుతారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకురావాలని రైతులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 23న అమరావతి రాజధాని కేసు మరోసారి సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. రిదటగా ఈ కేసును మెన్షన్‌ ‌లిస్టులో చేర్చాలని సుప్రీం కోర్టు రిజిస్ట్రాకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇందుకు రిజిస్ట్రా ‌నుంచి అనుమతి లభించలేదు. అయినప్పటికీ కూడా బెంచ్‌పై ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది నిరంజన్‌ ‌రెడ్డి ప్రస్తావించారు. దీంతో ఈనెల 23న కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది.

Comments (0)
Add Comment