అబార్షన్‌ ‌మహిళల హక్కు

వివాహితలు, అవివాహితలకు కూడా ఒకే చట్టం
పరస్పర అంగీకారంతో 24 వారాల గర్భాన్ని మహిళలు తొలగించుకోవచ్చు
మెడికల్‌ ‌టర్మినేషన్‌ ‌కేసులో సుప్రీమ్‌ ‌కోర్టు సంచలన తీర్పు

న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 29(ఆర్‌ఎన్‌ఎ) : అబార్షన్‌ ‌మహిళల హక్కు అని సుప్రీమ్‌ ‌కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాహిత, అవివాహితులకు అబార్షన్‌ ‌హక్కు విషయంలో సుప్రీమ్‌ ‌కోర్టు గురువారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. వైవాహిక స్థితితో సంబంధం లేకుండా స్త్రీలు..చట్ట ప్రకారం సురక్షిత అబార్షన్‌ ‌చేయించుకోవచ్చని తేల్చి చెప్పింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. అబార్షన్‌ ‌చట్టం ప్రకారం వివాహిత, అవివాహిత మహిళ అని విభజించడం రాజ్యాంగ పరంగా సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. వైవాహిక స్థితితో సంబంధం లేకుండా స్త్రీలందరికీ సురక్షితమైన, చట్టబద్ధమైన అబార్షన్‌ ‌చేయించుకునే హక్కు ఉందని తెలిపింది. మెడికల్‌ ‌టెర్మినేషన్‌ ఆఫ్‌ ‌ప్రెగ్నెన్సీ(ఎంటీపీ) చట్టం ప్రకారం 24 వారాల లోపు గర్భాన్ని తొలగించుకునేందుకు అవివాహిత మహిళలకు అవకాశం ఉంటుందా అన్న అంశంపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఈ మేరకు తీర్పు చెప్పింది. అబార్షన్‌ ‌చట్టం ప్రకారం వివాహిత, అవివాహిత మహిళ అని విభజించడం రాజ్యాంగపరంగా సరికాదని జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌, ‌జస్టిస్‌ ‌జేబీ పార్దీవాలా, జస్టిస్‌ ఏఎస్‌ ‌బోపన్నతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

Also Read: రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఇలాంటి విభజన వల్ల..వివాహం అయిన మహిళలే లైంగిక కార్యకలాపాలలో భాగం అవుతారన్న మూస భావనకు దారితీస్తుందని కోర్టు పేర్కొంది. గర్భంపై హక్కులు వివాహిత, అవివాహిత మహిళలకు సమానంగా ఉంటాయని ఉద్ఘాటించింది. ఈ సందర్భంగా చట్టంలో అత్యాచారంపై ఉన్న నిర్వచనంలో.. వైవాహిక అత్యాచారాన్నీ భాగం చేయాలని జస్టిస్‌ ‌చంద్రచూడ్‌ ‌సూచించారు. ప్రస్తుతం పెళ్లి కాని మహిళలు, సింగిల్‌గా ఉన్న మహిళలకు అబార్షన్‌ ‌చేయించుకునే గడువు 20 వారాలుగా ఉంది. వివాహిత మహిళలకు మాత్రం ఇది 24 వారాలుగా ఉంది. అవివాహిత మహిళల విషయంలో ఈ తేడా.. వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని కేసు విచారణ సందర్భంగా ఆగస్టు 7న సుప్రీమ్‌ ‌కోర్టు అభిప్రాయపడింది. ఇద్దరి విషయంలో రిస్క్ ఒక్కటే అయినా.. సమయంలో ఎందుకు తేడా ఉంటోందని ప్రశ్నించింది. ఏకపక్షంగా ఉన్న ఈ క్లాజును రద్దు చేస్తామని అప్పుడే పేర్కొంది. ఈ కేసుపై ఆగస్టు 23న తీర్పు రిజర్వ్ ‌చేసింది సుప్రీమ్‌ ‌కోర్టు. భారతదేశంలో అబార్షన్‌ ‌చట్టం ప్రకారం వివాహితులు, అవివాహిత మహిళలు అనే తేడా లేదని కోర్టు పేర్కొంది.

ఆధునిక కాలంలో చట్టం అనేది వ్యక్తుల హక్కులకు వివాహం ఒక ముందస్తు షరతు అనే భావనను తొలగిస్తోందని సుప్రీం పేర్కొంది. పరస్పర అంగీకారంతో 24 వారాల గర్భాన్ని మహిళలు తొలగించుకోవచ్చని పేర్కొంది. పెళ్లికాకుండా గర్భం దాల్చే విషయంపై సుప్రీం విచారణ చేపట్టింది. మెడికల్‌ ‌టెర్మినేషన్‌ ఆఫ్‌ ‌ప్రెగ్నెన్సీ యాక్ట్ ‌పరిధిలో పెళ్లి కాని మహిళలను కూడా చేర్చవచ్చని తెలిపింది. మణిపూర్‌కు చెందిన 25 ఏళ్ల యువతి 24 వారాల గర్భవతి. సహజీవనం చేసిన వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో….ఆమె అబార్షన్‌ ‌చేసుకునేందుకు అనుమతివ్వాలంటూ కోర్టుకు వెళ్లింది. దీనిపై జస్టిస్‌ ‌చంద్రచూడ్‌ ‌ధర్మాసనం విచారణ చేపట్టింది. 2021లో సవరించిన చట్టంలోని నిబంధనలతో సెక్షన్‌ 3‌కి వివరణలో భర్త అనే పదానికి బదులుగా భాగస్వామి అనే పదం ఉందని గుర్తుచేసింది. ఇది పెళ్లి కాని వారికి కూడా వర్తించేలా..చట్టసవరణకు పార్లమెంట్‌ ‌కూడా ఆమోదం తెలిపిందని సుప్రీమ్‌ ‌కోర్టు స్పష్టం చేసింది. వైవాహిక అత్యాచారాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. భార్య సమ్మతి లేకుండా భర్త ఆమెతో బలవంతంగా కలిస్తే..అది కూడా అత్యాచారం కిందకే వస్తుందని స్పష్టం చేసింది. అది బలవంతపు గర్భధారణ కిందకు వొస్తుందని తెలిపింది. ఇలాంటి గర్భధారణల నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని సుప్రీమ్‌ ‌కోర్టు అభిప్రాయపడింది. చట్టంలో అత్యాచారానికి అర్థంలో వైవాహిక అత్యాచారాన్ని కూడా చేర్చాల్సిన అవసరముందని తెలిపింది.

Comments (0)
Add Comment