Take a fresh look at your lifestyle.

అమ్మా ..మీకు ‘శతాధిక’ వందనాలు..!

‘‘‌మా అమ్మ శ్రీమతి హీరాబా శత సంవత్సరంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో నాకెంతో సంతోషంగా ఉంది. అంతేగాక ఈ సందర్భాన్ని మీతో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఆమె జన్మశతాబ్ది సంవత్సరం.. మా తండ్రి నేడు జీవించి ఉంటే గతవారం ఆయన కూడా 100వ పుట్టినరోజు వేడుక చేసుకుని ఉండేవారు. మా అమ్మ జన్మ శతాబ్ది ప్రారంభమవుతున్న ఈ 2022 నాకొక ప్రత్యేక సంవత్సరం.. ’

అమ్మ – నిఘంటువులో ఇతర పదాల తరహాలో కనిపించే ఓ పదం కాదు.. ప్రేమ, సహనం, నమ్మకం వంటి ఎన్నో భావోద్వేగాలు ఈ పదంలో ఇట్టే ఇమిడిపోతాయి. దేశం లేదా ప్రాంతంతో నిమిత్తం లేకుండా ప్రపంచవ్యాప్తంగా పిల్లలు తమ తల్లులపై ప్రత్యేక అనురాగం కలిగి ఉంటారు. తల్లి కేవలం తన పిల్లలకు జన్మనివ్వడమే మాత్రమేగాక వారి మనోభావాలకు, వ్యక్తిత్వానికి, ఆత్మవిశ్వాసానికి కూడా రూపమిస్తుంది. ఆ క్రమంలో తల్లులు స్వార్థమనే మాటకు తావులేకుండా తమ వ్యక్తిగత అవసరాలు, ఆకాంక్షలను త్యాగం చేస్తారు.

మా అమ్మ శ్రీమతి హీరాబా శత సంవత్సరంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో నాకెంతో సంతోషంగా ఉంది. అంతేగాక ఈ సందర్భాన్ని మీతో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఆమె జన్మశతాబ్ది సంవత్సరం.. మా తండ్రి నేడు జీవించి ఉంటే గతవారం ఆయన కూడా 100వ పుట్టినరోజు వేడుక చేసుకుని ఉండేవారు. మా అమ్మ జన్మ శతాబ్ది ప్రారంభమవుతున్న ఈ 2022 నాకొక ప్రత్యేక సంవత్సరం.. ఇదే సందర్భంలో మా తండ్రి వందేళ్లు పూర్తిచేసుకుని ఉండేవారు.

మా కుటుంబంలో ఇంతకుముందు పుట్టినరోజు వేడుకలు చేసుకునే సంప్రదాయం లేదు. కానీ, మా తర్వాతి తరంలోని పిల్లలు మా తండ్రిగారి జయంతి నాడు ఆయన సంస్మరణార్థం 100 మొక్కలు నాటారు.

నా జీవితంలోని ప్రతి మంచి మలుపు.. నా వ్యక్తిత్వంలోని ప్రతి మంచి లక్షణాలకు నా తల్లిదండ్రులే కారణమని చెప్పడానికి నేనెంతమాత్రం సందేహించను. నేనివాళ దిల్లీలో కూర్చున్నప్పటికీ నా మదిలో గతకాలపు జ్ఞాపకాలే నిండి ఉన్నాయి.

నా తల్లి ఎంత అసాధారణమైనదో అమ్మలందరి తరహాలో అంతే సాధారణమైనది కూడా! నేను నా తల్లి గురించి రాస్తున్న ఈ సందర్భంలో మీలో చాలామంది ఆమె గురించి నా వివరణతో మమేకం అవుతారని నేను కచ్చితంగా భావిస్తున్నాను. అదేవిధంగా నా మాటలు చదువుతున్నప్పుడూ మీ మనో ఫలకం మీద సాక్షాత్తూ మీ అమ్మ రూపం మెదలడం ఖాయం.

ఓ తల్లి త్యాగం ఒక మంచి మనిషిని సృష్టిస్తుంది. ఆమె ఆప్యాయత పిల్లల్లో మానవీయ విలువలను, కరుణను నింపుతుంది. తల్లి ఒక వ్యక్తి లేదా వ్యక్తిత్వం కాదు.. మాతృత్వమన్నది ఓ సుగుణం కాదు.. దీన్ని మరింత లోతుగా చెప్పాలంటే- దేవతలు వారి భక్తుల స్వభావాన్ని బట్టి రూపొందుతారని తరచూ వింటుంటాం. అదే తరహాలో మన సొంత స్వభావం, మనస్తత్వానికి అనుగుణంగా మనం మన తల్లులను, వారి మాతృత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాం.

మా అమ్మ గుజరాత్‌లోని మెహసానాలో గల విస్‌నగర్‌లో జన్మించింది. ఇది మా స్వస్థలం వాద్‌నగర్‌కు సమీపంలోనే ఉంటుంది. ఆమె బాల్యంలో తన తల్లి ప్రేమను పొందలేకపోయింది. పసితనంలోనే ‘స్పానిష్‌ ‌ఫ్లూ’ మహమ్మారి వల్ల మా అమ్మమ్మ ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఆమెకు మా అమ్మమ్మ రూపం లేదా ఆమె ఒడిలోని వాత్సల్యం ఎలా ఉంటాయో కూడా గుర్తులేదు. తల్లి లాలన లేకుండానే మా అమ్మ బాల్యం గడిచిపోయింది. మనలాగా తల్లి ఒడిలో ముద్దుముద్దుగా అల్లరిచేసే అవకాశం ఆమెకు దక్కలేదు. మనందరిలాగా తన తల్లి ఒడిలో ఆమె సేదదీరలేకపోయింది. అలాగే ఆమె పాఠశాలకు వెళ్లి చదవడం-రాయడం కూడా నేర్చుకోలేకపోయింది. ఆమె బాల్యమంతా పేదరికం, ప్రేమరాహిత్యంతోనే గడచింది.

నేటి పరిస్థితులలో పోలిస్తే మా అమ్మ బాల్యం చాలా కష్టంతో కూడుకున్నది. బహుశా ఆ సర్వాంతర్యామి ఆమె నుదుటి రాతను ఇలా రాశాడేమో! అందుకు తగినట్లుగా ఇది దేవుని చిత్తమని అమ్మ కూడా నమ్ముతుంది. కానీ చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడం, కనీసం తన తల్లి రూపం కూడా తెలియకపోవడం నేటికీ ఆమెను బాధిస్తూనే ఉంది.

ఇలాంటి కష్టాలవల్ల మా అమ్మకు బాల్యం అంత సాఫీగా సాగలేదు సరికదా- ఆమె తన వయస్సుకు మించిన పరిణతి కనబరచాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె తన కుటుంబంలో పెద్ద కూతురు కాగా, పెళ్లి తర్వాత పెద్ద కోడలుగానూ మారింది. చిన్నతనంలో కుటుంబ భారమంతా ఆమె తన భుజాలకు ఎత్తుకుని, అన్ని పనులూ తానే చూసుకునేది. అదేవిధంగా పెళ్లయ్యాక కూడా ఆ బాధ్యతలన్నిటినీ ఆమె తన భుజాన వేసుకుంది. ఎంతో బరువైన బాధ్యతలు, రోజువారీ సంఘర్షణలు ఎన్ని ఉన్నప్పటికీ మా అమ్మ కుటుంబం మీద ఆ ప్రభావం పడనివ్వకుండా ప్రశాంతంగా, దృఢంగా ఉండేలా చూసింది.

వాద్‌నగర్‌లో మా కుటుంబం కనీసం కిటికీ కూడా లేని ఓ చిన్న ఇంట్లో నివసించేది. ఇక స్నానాలగది లేదా మరుగుదొడ్డి ఉండటమంటే విలాసమే! మట్టిగోడలు, మట్టి పెంకుల పైకప్పుగల ఈ ఒక్క గదినే మేం ‘ఇల్లు’ అని పిలిచేవాళ్లం. మేమందరం- నేనుసహా నా తల్లిదండ్రులు, తోబుట్టువులు అందరం నివసించేది అందులోనే!

మా అమ్మ వంటపనిని సులభం చేయడం కోసం మా నాన్న వెదురు కర్రలు, చెక్క పలకలతో ‘మంచె’ కట్టారు. ఇదే మా వంటగది… అమ్మ దానిపైకెక్కి వంట చేస్తే.. కుటుంబమంతా దానిపైనే కూర్చుని భోజనం చేసేది.సాధారణంగా ఏదైనా కొరతగా ఉందంటే ఒత్తిడి మొదలవుతుంది. కానీ, రోజువారీ సంఘర్షణలతో తలెత్తే ఆందోళన మా కుటుంబ వాతావరణాన్ని ఎన్నడూ చెడగొట్టకుండా నా తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ వహించేవారు. ఆ మేరకు వారిద్దరూ తమతమ బాధ్యతలను జాగ్రత్తగా విభజించుకుని, కచ్చితంగా నిర్వర్తించేవారు.

కాలంతో సమానంగా మా నాన్న తెల్లవారుజామున నాలుగు గంటలకల్లా పనికి బయల్దేరేవారు. అప్పుడు ఇరుగుపొరుగు.. ‘అబ్బో అప్పుడే 4 గంటలైంది.. దామోదర్‌ ‌బాబాయ్‌ ‌పనికి బయల్దేరారు’ అని చెప్పుకొనేవారు. అలాగే తన చిన్న టీ దుకాణం తెరవడానికి ముందు స్థానిక ఆలయంలో ప్రార్థనచేసే ఆనవాయితీని ఆయన ఎన్నడూ వీడలేదు.

అమ్మ కూడా అంతే కచ్చితంగా తన పనిలో తాను మునిగిపోతుంది. ఆ ప్రకారం నాన్నతోపాటు నిద్రలేచి, ఉదయం పూట చేయాల్సిన ఇంటిపనులన్నిటినీ చక్కబెట్టేది. పిండి రుబ్బడం దగ్గర్నుంచి బియ్యం, పప్పు జల్లెడ పట్టడందాకా ఎలాంటి సాయం లేకుండా అమ్మ చేసుకుపోయేది. పని చేస్తున్నప్పుడు ఆమె తనకిష్టమైన భక్తిగీతాలు, కీర్తనలను సన్నగా ఆలపిస్తూండేది. నర్సీ మెహతాజీ రచించిన ప్రసిద్ధ భక్తిగీతం  ‘జల్కమల్‌ ‌ఛడీ జానే బాలా.. స్వామి అమరో జగ్సే’’ అలాగే ‘శివాజీ ను హలార్దు’ అనే లాలిపాట కూడా ఆమెకు చాలా చాలా ఇష్టం.

పిల్లలు తన పనిలో సాయపడాలని మా అమ్మ ఎప్పుడూ ఎదురుచూసేది కాదు. చదువు మానేసి తనకు సాయం చేయాలని ఆమె ఎన్నడూ అడగలేదు. కానీ, అమ్మ కష్టం చూసి ఇంటిపనేల్లో ఆమెకు సహాయం చేయడం మా బాధ్యతగా మేం భావించేవాళ్లం. మా ఊరి చెరువులో ఈత కొట్టడమంటే నాకెంతో సరదా. అందుకోసం ఇంట్లో మాసిన దుస్తులన్నీ మూటగట్టి చెరువుకు తీసుకెళ్లి, ఉతికి తెచ్చేవాడిని. ఆ పనిలోపనిగా నా ఈత సరదా కూడా తీరేది.

ఇంటి ఖర్చుల కోసం మా అమ్మ కొన్ని ఇళ్లలో పాచిపని చేసేది. అంతేకాకుండా మా కొద్దిపాటి కుటుంబ ఆదాయానికి తోడుగా ఆమె చరఖా తిప్పి నూలు వడికేది. అలాగే దూది తీయడం దగ్గర్నుంచి నూలు వడకడందాకా పనులన్నీ చేసేది. వెన్నువిరిగేలా ఇంత పని చేస్తున్నా కూడా తనచుట్టూ తిరిగే మాకు పత్తి ములుకులు గుచ్చుకోకుండా చూడటానికి ఎంతో ప్రయాసపడేది.

ఇక తన పనిలో సాయం కోసం అమ్మ ఇతరులపై ఆధారపడటం లేదా అభ్యర్థించడం చేసేది కాదు. వర్షాకాలం వస్తే మా మట్టి ఇంటికి కష్టాలు మొదలైనట్టే. అయినప్పటికీ మేం ఎలాంటి అసౌకర్యానికీ లోనుకాకుండా మా అమ్మ జాగ్రత్త పడుతుంది. ఇక మండుటెండలు కాసే జూన్‌ ‌నెలలో ఆమె మా మట్టి ఇంటి పైకప్పు మీదికెక్కి పెంకులు బాగుచేస్తుంది. అయితే, ఆమె ఎంత చాకచక్యంగా ఈ పనులన్నీ చక్కబెట్టినా మా పాత ఇల్లు వర్షాల తాకిడిని తట్టుకోలేకపోయేది.

వర్షాలకు మా ఇంటి పైకప్పు కారుతూ లోపలంతా నీటితో నిండిపోయేది. నీరుకారే ప్రతి చోట బకెట్లు, పాత్రలు పెట్టడానికి మా అమ్మ చాలా అవస్థ పడేది. ఇంత విపత్కర పరిస్థితుల్లోనూ మానసిక స్థైర్యానికి ఆమె మారుపేరు అన్నట్లు ఉండేది. ఇక ఇలా ఒడిసి పట్టిన వాననీటిని ఆ తర్వాత కొద్ది రోజులు వాడుకునే తీరు తెలిస్తే మీరంతా ఆశ్చర్యపోతారు. జల సంరక్షణకు ఇంతకన్నా మంచి ఉదాహరణ మరేముంటుంది!

మేముండే చిన్న ఇంటిని చక్కగా ఉంచడంలో మా అమ్మ ఎంతో శ్రద్ధ చూపేది. ఇల్లు శుభ్రం చేయడానికి, అందంగా తీర్చిదిద్దడానికి ఆమె చాలా సమయం కేటాయించేది. ఆమె ఆవు పేడతో నేలను అలికేది. ఆవు పేడతో చేసిన పిడకలతో వంటచేసేటపుడు పొగ విపరీతంగా కమ్ముకుంటుంది. అయినప్పటికీ, కిటికీ కూడా లేని ఆ ఇంటిలో ఆ పొగలోనే మా అమ్మ వంట చేసేది! గోడలు మసితో నల్లబారుతాయి కాబట్టి, అప్పుడప్పుడూ వెల్లవేయడం అవసరం. ఈ పనిని కూడా నిర్ణీత వ్యవధి మేరకు ఆమె స్వయంగా చేసేది.  ఆ విధంగా మా శిథిల గృహానికి ఇది కొత్తదనాన్నిస్తుంది. అంతేకాకుండా ఇంటిని అందంగా అలంకరించడం కోసం చిన్నచిన్న మట్టి పాత్రలు కూడా తయారుచేస్తుంది. ఇక పాత గృహోపకరణాలను కొత్తగా తీర్చిదిద్దే భారతదేశపు అలవాటును పాటించడంలో ఆమెను మించినవారు లేరు.

మా అమ్మకు మరో ప్రత్యేకమైన అలవాటుండేది. ఆమె పాత కాగితాన్ని నీటిలో ముంచి, చింతగింజలతో కలిపి ఓ జిగురుముద్దను తయారుచేసేంది. ఈ జిగురు సాయంతో గోడలపై అద్దాల ముక్కలను అతికించడం ద్వారా అందమైన చిత్తరువులు రూపొందించేది. బజారు నుంచి చిన్నచిన్న అలంకరణ వస్తువులు తెచ్చి తలుపును అందంగా అలంకరించేది.

మంచం, దానిమీద పరుపు శుభ్రంగా-చక్కగా ఉంచడానికి మా అమ్మ చాలా ప్రాధాన్యం ఇచ్చేది. పడక మంచంమీద కాసింత దుమ్మును కూడా సహించేది కాదు. దుప్పటిమీద ఏ కాస్త మరక కనిపించినా తక్షణం దుమ్ము దులిపి మళ్లీ పరిచేది. ఈ విషయంలో మేమంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాళ్లం. నేటికీ, ఈ వయస్సులోనూ తన మంచం మీద దుప్పటి నలిగిపోకుండా చూసుకోవాలని మా అమ్మ తపన పడుతుంది!

అంతా సవ్యంగా ఉండాలన్న తాపత్రయం ఆమెలో నేటికీ పదిలమే. ఇప్పుడామె గాంధీనగర్‌లో నా సోదరుడు, మేనల్లుడి కుటుంబాలతో ఉంటున్నప్పటికీ, ఈ వయసులోనూ తన పనులన్నీ తానే స్వయంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. పరిశుభ్రతపై ఆమె శ్రద్ధ నేటికీ స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఆమెను పరామర్శించడానికి గాంధీనగర్‌కు వెళ్లినప్పుడల్లా తాను స్వయంగా చేసిన మిఠాయిలతో నా నోరు తీపిచేస్తుంది. అంతేకాదు.. పాలు తాగిన పసిబిడ్డకు మూతి తుడిచినట్లు నేను మిఠాయి తినడం పూర్తికాగానే రుమాలుతో నోరు తుడుస్తుంది. తన నడుము వద్ద చీర మడతలో సదా ఒక రుమాలు వంటిది ఉంచుకోవడం ఆమెకు అలవాటు.

ఇప్పటికీ, ఎవరైనా అమ్మను కలిసినపుడు, ఆమె ఎప్పుడూ ఒకమాట అంటుంటుంది ‘‘ఇతరుల చేత సేవచేయించుకోవడం నాకు ఇష్టం లేదు. నా అవయవాలన్నీ పనిచేస్తున్నప్పుడే పోవాలని ఉంది’’ అని .అమ్మ జీవిత కథలో, భారతదేశ మాతృశక్తి చేయూత, తపస్సు, త్యాగాన్ని నేను చూస్తున్నాను.  అమ్మను,  ఆమె వంటి కోట్లాది మంది మహిళలను చూసినప్పుడల్లా, భారతీయ మహిళలు సాధించలేనిది ఏదీ లేదని నేను కనుగొన్నాను.

ప్రతి లేమి కథను మించినది,  తల్లి గురించిన అద్భుతమైన కథ,తల్లి  బలమైన సంకల్పం, ప్రతి పోరాటం కంటే ఎంతో  ఉన్నతమైనది.

అమ్మా, మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

పుట్టిన రోజుకు సంబంధించి శత వసంతాల సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నందుకు శుభాకాంక్షలు.

ఇప్పటివరకు మీ జీవితం గురించి బహిరంగంగా,ఇంత సుదీర్ఘంగా రాసే సాహసం ఎప్పుడూ చేయలేదు.

మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని  భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. మా అందరికీ మీ ఆశీస్సులు ఉండాలి.

మీ పాదాలకు నమస్కరిస్తూ…….

– నరేంద్ర మోడీ, భారత ప్రధాన మంత్రి  

Leave a Reply