మార్చి 14న హైదరాబాద్కు అమిత్షా
పౌరసత్వ సవరణ బిల్లు, పౌర జనాభా నమోదు చట్టాలకు మద్దతుగా ప్రజల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా దేశంలో ఈ రెండు బిల్లులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న ప్రాంతాలలో దానిని చల్లబరచేందుకు కేంద్ర మంత్రులు బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో తెలంగాణలో భారీ బహిరంగను నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు మార్చి 14న అమిత్ షా హైదరాబాద్కు రానున్నారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలోపాల్గొననున్నారు. సీఏఏ, ఎన్పిఆర్ బిల్లులను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పార్లమెంటులో సీఏఏ అనుకూల బిల్లును ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లు ముస్లింలకు తీవ్ర వ్యతిరేకంగా ఉందనీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత ప్రాతిపదికన విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నదని ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటు వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర•, మంత్రి కేటీఆర్ సైతం సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు విస్పష్టంగా ప్రకటించారు. తాజాగా ఆదివారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలోనూ సీఏఏ బిల్లును వ్యతిరేకంగా మంత్రిమండలి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. అంతేకాకుండా మరో అడుగు ముందుకు వేసి ప్రధాని మోడీ దీనిపై పునరాలోచించుకోవాలని సూచించారు.
మరోవైపు, ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు, అలాగే, సామాజిక కార్యకర్తలు, మేధావుల సారద్యంలో ఏర్పడిన 31 సంఘాలు సీఏఏ,ఎన్పిఆర్ బిల్లులకు వ్యతిరేకంగా భారీ జన సమీకరణ చేసి హైదరాబాద్ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన ఈ సభకు ముస్లింలు, ఇతర వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్లో టీఆర్ఎస్, ఎంఐఎంల సీఏఏ వ్యతిరేక విధానాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు నిర్వహించాలన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఎల్బీ స్టేడియంలో భారీ అనుకూల ర్యాలీ నిర్వహిస్తోంది.