- ఎంఐఎంతో కేసీఆర్‌కు రహాస్య ఒప్పందం ఎందుకు ?
- రోహింగ్యాలను ఏరివేస్తామంటే పార్లమెంటులో అడ్డుకున్నదెవరో ఒవైసీ చెప్పాలి
- హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ హబ్‌గా మారుస్తాం
- హైదరాబాద్ ప్రజల ఆదరణకు ధన్యవాదాలు
- వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారు…ఆయన ఫాం హౌస్ నుంచి బయటికి రావాలి
- హైదరాబాద్‌ను నిజాం సంస్క•తి నుంచి ఆధునిక నగరంగా మారుస్తాం
- కేసీఆర్ సచివాలయానికి వెళితే కదా కేంద్రం సాయం గురించి తెలిసేది ..కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
హైదరాబాద్ మేయర్ పీఠం బీజేపీదేనని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఓట్లు, సీట్లు పెంచుకోవడానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో పోటీ చేయడం లేదనీ, మేయర్ సీటు గెలుచుకోవడానికే పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థికి మేయర్‌గా ఒక్క అవకాశం ఇవ్వండి….హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చివేస్తామని హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసి ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన ఆదివారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చిన అమిత్ షా ముందుగా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వారాసిగూడ నుంచి సీతాఫల్మండి వరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో కలసి రోడ్ షో నిర్వహించారు. అనంతరం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ వోటర్లు బీజేపీ అభ్యర్థికి మేయర్‌గా అవకాశం ఇస్తే నగరాన్ని నిజాం సంస్క•తి నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు నడిపిస్తామని చెప్పారు.
ఎంఐఎం అండతోనే నగరంలో అక్రమ కట్టడాలు వెలిశాయనీ, ఆ పార్టీ మార్గదర్శనంలోనే టీఆర్ఎస్ నడుస్తోందని విమర్శించారు. గత ఆరేళ్లలో హైదరాబాద్‌లోని ఒక్క కట్టడాన్ని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కూల్చివేయలేదనీ, బీజేపీ మేయర్ ఆ పనిని చేసి చూపిస్తారని పేర్కొన్నారు. తన హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఘన స్వాగతం పలికిన హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదా)లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చి దాదాపు 7 లక్షల మంది ప్రజలు ఇబ్బందులకు గురయితే సీఎం కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ నివాస స్థలానికి సమీపంలో నివసించే ప్రజలు కూడా వరదల కారణంగా ఇబ్బంది పడ్డారనీ, అయినా ఆయన పట్టించుకోలేదనీ, ఇప్పటికైనా కేసీఆర్ ఫాం హౌజ్ దాటి బయటికి రావాలని పేర్కొన్నారు.
వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులలో ఉన్నప్పుడు కేసీఆర్, ఒవైసీ బయటికి ఎందుకు రాలేదనీ, కేసీఆర్ తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేకిన్ ఇండియా ఫలాలు హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయనీ, నగరాన్ని ప్రపంచ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామనీ, అయితే, అందుకు సంబంధించిన మౌలిక సౌకర్యాలు కల్పించే బాధ్యత స్థానిక సంస్థలదేనని స్పష్టం చేశారు. నగరానికి భవిష్యత్లులో మరిన్ని ఐటీ సంస్థలు వచ్చేలా చూస్తామనీ, ఐటీ ఉద్యోగులు ఎక్కడి నుంచైనా పనిచేసేలా వర్క్ ఫ్రం ఏనీవేర్ సౌకర్యం కల్పించిన ఘనత ప్రధాని మోడీకే దక్కిందన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం నేతృత్వంలోని కార్పొరేషన్‌తో హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారడం సాధ్యం కాదని పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్రం ఏమీ చేయలేదన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ కేసీఆర్ ఎప్పుడైనా సచివాలయానికి వెళ్లే కతా కేంద్రం ఇచ్చే నిధుల గురించి తెలిసేది, వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్‌కు రెండు విడతల్లో రూ. 500 కోట్లు ఇచ్చామనీ, లక్షా 30 వేల ఇళ్లకు కేంద్రం నిధులిచ్చిందనీ, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందనీ, పరిపాలనా సామర్థ్యం ఇంకెవరికీ లేదా ? అని ప్రశ్నించారు. గత ఎన్నికల తరువాత వంద రోజుల ప్రణాళిక అన్నారు ఏమైంది ? లక్ష ఇళ్లు కడతామనీ, కనీసం 1000 ఇళ్లు కూడా కట్టలేదు ? హుస్సేన్‌సాగర్‌ను శుద్ధి చేస్తామన్నారు, పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు రూ. 1000 కోట్లతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామన్నారు,…కొరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం రాష్ట్రంలో అమలు చేస్తే రూ. 5 లక్షల సాయం అందేది…ప్రధాని మోదీకి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ తెలంగాణలో ఆ పథకాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. ఆ వాగ్దానాలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. రాజకీయాలలో పొత్తులు సహజమనీ, ఎవరు ఎవరితోనైనా అవగాహన ఒప్పందం పెట్టుకోవచ్చనీ, ఎంఐఎంతో టీఆర్ఎస్కు రహాస్య ఒప్పందం ఎందుకు ఆ పార్టీతో పొత్తు ఉందని కేసీఆర్ బహిరంగంగా చెప్పొచ్చు కదా అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో రోహింగ్యాలు వస్తుంటే కేంద్రం ఏం చేస్తుందన్న ఒవైసీ వ్యాఖ్యలపై స్పందిస్తూ హైదరాబాద్‌లో రోహింగ్యాలు ఉన్నారని నివేదిక ఇవ్వండి నేనేం చేస్తానో చూడండి అని జవాబిచ్చారు. హైదరాబాద్‌లో రోహింగ్యాలను ఏరిపారేస్తామని కేంద్రం పార్లమెంటులో ప్రకటించినప్పుడు ఒవైసీ అడ్డుకున్నారనీ, దీనిని ప్రజలంతా ప్రత్యక్ష ప్రసారాల్లో చూశారనీ, దీనిపై ఒవైసీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం తన వ్యక్తిగత విషయమని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా..ఒక్కసారి బీజేపీకి మేయర్‌గా అవకాశం ఇస్తే అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని హామీ ఇస్తున్నాననీ, తద్వారా హైదరాబాద్ మళ్లీ వరదల కారణంగా మునగకుండా ప్రజల ఇళ్లల్లో నీరు చేరకుండా శాశ్వతంగా విముక్తి కల్పిస్తామని వాగ్దానం చేస్తున్నామని ఈ సందర్భంగా అమిత్ షా స్పష్టం చేశారు.