Take a fresh look at your lifestyle.

ఢిల్లీ మంటలారకముందే హైదరాబాద్‌లో సిఏఏ సభకు ఏర్పాట్లు !

Massive popularization of Amit Shah meeting

మెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌భారతదేశానికి వచ్చిన రోజున ఢిల్లీలో చెలరేగిన మంటలవేడి ఇంకా చల్లారకముందే హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా సభకు భారతీయ జనతాపార్టీ భారీగా ఏర్పాట్లు చేస్తున్నది. మరో పదిహేను రోజుల్లో ఎల్‌బిస్టేడియంలో లక్షలాదిమందితో ఈ సభను నిర్వహించేందుకు బిజెపి రాష్ట్రనాయకత్వం విస్తృత ఏర్పాట్లుచేస్తున్నది. పౌరసత్వ సవరణ (సిఏఏ) చట్టంపై ప్రజలకు అవగాహన పెంచేఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ సభకు సాధ్యమైనంత ఎక్కువస్థాయిలో జనాన్ని సమీకరించేందుకు జిల్లాలవారీగా బాధ్యులను ఏర్పాటుచేసింది. ఇదే అంశంపై చెలరేగిన వివాదంతో గడచిన •  కొన్ని రోజులుగా ఢిల్లీ ఇప్పటికే తగులబడుతోంది. కేంద్ర ప్రభుత్వం అమలుపర్చనున్న సిఏఏ చట్టంపై అనుకూల, వ్యతిరేక వర్గాలమధ్య చెలరేగిన ఘర్షణ చివరకు ముప్పైకిపైగా ప్రాణాలను హరించగా, క్షతగాత్రులైన పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆందోళనలతో ఎలాంటి సంబంధంలేని పలువురి ఇండ్లు, పెట్రోల్‌ ‌పంపులు, ద్విచక్ర, భారీ వాహనాలు ధ్వంసమైనాయి..దగ్ధమైనాయి. ఫలితంగా ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో కొన్ని రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతోంది. కనిపిస్తే కాల్చివేయాలన్నఆదేశాలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాలను డ్రోన్లద్వారా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు వందకుపైగా మందిని అదుపులోకి తీసుకున్నారు.  సుమారు ఇరవై మందిపైన ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదుచేశారు. అయినప్పటికీ ఈ మొత్తం పరిణామాలకు పోలీసుల వైఫల్యమేకారణమన్న తీవ్ర విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పోలీసులు సకాలంలో స్పందించిఉంటే ఇంత హింసచెలరేగేదికాదన్న వాదనఉంది. అయితే పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు తమవద్ద తగినన్ని బలగాలులేవని ఢిల్లీ ఉన్నత పోలీసు వర్గాలే స్వయంగా ఒప్పుకోవడం గమనార్హం. ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టుకూడా పోలీసువర్గాలను తీవ్రంగా మందలించింది. పోలీసులు, పారా మిలటరీ, సైన్యం అందుబాటులో ఉండే ఢిల్లీలోనే ఇలాంటి పరిస్థితులు ఎదురైన ఈ స్థితిలో, హైదరాబాద్‌లాంటి ప్రాంతంలో సిఏఏ సదస్సును నిర్వహించేందుకు బిజెపి ఏర్పాట్లు చేయడం ఎంతవరకు సమంజసమన్న విమర్శలు వినవస్తున్నాయి. ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో అమిత్‌షా హైదరాబాద్‌ ‌పర్యటనను విరమించుకోవాలని ఇప్పటికే తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి నిరంజన్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. అన్నివర్గాల ప్రజల మనోభావాలను ఆకళింపుచేసుకుని సరైన నిర్ణయంతీసుకోవాలెగాని, తొందరపడి నిర్ణయాలు తీసుకుని ప్రజలమధ్య చిచ్చుపెట్టడం సరైందికాదంటూ ని•ంజన్‌ ‌కేంద్రానికి సూచించారు. పౌరసత్వ చట్ట సవరణద్వారా కొన్ని వర్గాల వారికి పౌరసత్వాన్నివ్వడం మతపరమైన వివక్ష చూపడమే అవుతుందని, అది ఒకవర్గ ప్రజలను ఆందోళనకు, అభద్రతకు గురిచేస్తున్నది. ఇది సామాన్యుడికికూడా అర్థమయ్యే విషయమే అయినా కేంద్రానికి అర్థంకాకపోవడమేంటని ఆయన కేంద్రం తీరును తీవ్రంగా తప్పుపట్టాడు. ఇదిలాఉంటే హైదరాబాద్‌ ‌సభ విషయానికొస్తే.. తెలంగాణరాష్ట్రం ఏర్పడినప్పటినుండి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ‌నగరం ఇప్పటివరకు ప్రశాంతంగాఉందని, ఈ సభ ఆ ప్రశాంతతకు ఎక్కడ భంగం కలిగిస్తుందేమోనన్న భయం పలువురిని కలవరపరుస్తున్నది. తెలంగాణ ఏర్పడినప్పటినుండి ఈ రాష్ట్రంపై కాషాయ జెంఢాను ఎగురవేయాలని బిజెపి శతవిధాల ప్రయత్నిస్తున్నవిషయం తెలియందికాదు. అయితే ప్రజాస్వామ్యయుతంగా జరిగే ప్రత్యక్ష ఎన్నికల్లో ఇక్కడ అధికారంలోఉన్న పార్టీతో బిజెపి తూగలేకపోతున్నది. అయినా తన ప్రయత్నాలను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో అమిత్‌షా అనేకసార్లు హైదరాబాద్‌కు వచ్చి, రెండుమూడు రోజులు మకాంవేసి తనవంతు  ప్రయత్నాలను కొనసాగించాడు.

 

ఇప్పుడు తాజాగా కేంద్ర హోంమత్రి హోదాలో మొదటిసారిగా తెలంగాణలో అడుగుపెట్టనున్నాడు. దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమలును ఇప్పటికే అనేకరాష్ట్రాలు  వ్యతిరేకిస్తున్నాయి. అందులో తెలంగాణరాష్ట్రం మొదట్లోనే తన అభిప్రాయాన్ని తెలిపింది. తన వ్యతిరేకతను తెలియజేస్తూ పదిలక్షల మందితో ఓ బహిరంగసభనుకూడా ఏర్పాటుచేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇప్పటికే ప్రకటించాడు కూడా. త్వరలో జరుగనున్న రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ ‌సమావేశంలో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఓ తీర్మానాన్నికూడా చేయనున్నట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రప్రభుత్వ నిర్ణయానికి ఎంఐఎంపార్టీకూడా మద్దతు ప్రకటించింది. ఇలా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాల దూకుడుకు కళ్ళెం వేయడంతోపాటు, ముస్లిం జనాభా అధికంగాఉన్న రాష్ట్రాల్లో సిఏఏ సమావేశాలు ఏర్పాటుచేయాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను ఆదేశించిన దరిమిలానే హైదరాబాద్‌లో అమిత్‌షాసభను ఏర్పాటుచేస్తున్నట్లు తెలుస్తున్నది. తాజా మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా  ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లా  భైంసాలో జరిగిన ఘర్షణ, విధ్వంస వాతావరణానికి కారణాలేవైనా, అధికారపార్టీపై ఆగ్రహించినప్పుడల్లా బిజెపి ఈ అంశాన్ని గుర్తుచేస్తూనేఉంది. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ సిఏఏ సభను ఏర్పాటుచేయడం ఎటు దారితీస్తుందోనంటూ రాజకీయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

Leave a Reply