కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు ఈ నెల 23వ తేదీని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను గత వారంరోజులుగా కొనసాగిస్తున్నది. దాదాపు పదిహేను రోజుల కిందనే ప్రధాని నరేంద్రమోదీ వొచ్చివెళ్ళగా, ఇప్పుడు షా పర్యటనతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఉరకలు వేయిస్తున్నది. గతంలోకన్నా ఈసారి షా పర్యటనకు ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణపై కాషాయ జండా ఎగురవేస్తామని ఇంతకాలం చెబుతున్న ఆ పార్టీకి ఇప్పుడు సరైన సమయం వొచ్చింది. వొచ్చే నెల పదమూడున కర్ణాటక ఎన్నికలు ముగియనున్నాయి. కర్ణాటక తర్వాత జరిగేది తెలంగాణ శాసనసభ ఎన్నికలే అంటున్నారు. ఇక్కడ ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉన్నప్పటికీ బిజెపి తెలంగాణ లో ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా దూసుకువొస్తున్న క్రమంలో ఎన్నికలకు మధ్యఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది. దక్షిణాదిలో పాగా వేయాలనుకున్న బిజెపి కల కర్ణాటకతో తీరినప్పటికీ మొదటి నుండీ తెలంగాణపైనే ఆ పార్టీకి దృష్టి ఉంది. అందుకే బిజెపి అగ్రశ్రేణి నేతలు ఒకరి తర్వాత ఒకరిగా తెలంగాణలో పర్యటిస్తూ వొస్తున్నారు. గోలకొండ కోటపైన కాషాయ జండాను ఎగురవేయడమే తన లక్ష్యంగా అమిత్ షా గతంలోనే పేర్కొన్న విషయం తెలియందికాదు. తెలంగాణ రాజకీయ వ్యవహారాలను తానే చూస్తానన్న అమిత్ షా, ఇక నుండి ప్రతీ నెల తెలంగాణ టూర్ పెట్టుకోనున్నట్లుకూడా గతంలో తెలిపాడు. అవరసమైతే కొద్ది రోజులపాటు తెలంగాణలోనే ఉండి పార్టీని పరుగులు పెట్టిస్తానని కూడా చెప్పాడు. అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు, రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన పర్యటన కొనసాగలేదు. ఇప్పుడు తాజాగా కర్ణాటక ఎన్నికలతర్వాత తెలంగాణలోనే ఎన్నికలు జరిగే అవకావం ఉండడంతో ఈ నెల 23న అమిత్ షా పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన చేవెళ్ళలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో రాబోయే శాసనసభ ఎన్నికలు ఈ సభ నాంది కాబోతుందంటున్నారు ఆ పార్టీ నాయకులు. తెలంగాణ భవిష్యత్ రాజకీయా)కు ఈ సభ కీలక మలుపు అవుతుందంటున్నారు. ఈ సభను దిగ్విజయం చేసేందుకు రాష్ట్రంలోని ఆ పార్టీ ముఖ్యనాయకులంతా భారీ సంఖ్యలో ప్రజలను తరలిచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని చేవెళ్ళ, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, తాండూర్, వికారాబాద్, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఇన్‌ఛార్జిలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ సభా వేదికపైన బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలనుండి బహిష్కరించబడిన లేదా ఆయా పార్టీల్లో అసంతృప్తితో నలిగిపోతున్న సీనియర్ నాయకులు కాషాయకండువాను కప్పుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే తెలంగాణ ఉద్యమనేతలు, కాంగ్రెస్‌లో వివిధ పదవులు అలంకరించినవారు ఆ పార్టీలో చేరిపోయారు. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రితో పాటు తాజాగా బిఆర్‌ఎస్‌నుండి సస్పెండ్ చేయబడిన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కాషాయ కండువ కప్పుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో జూపల్లి, పొంగులేటి మాత్రం తామింకా ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లుగానే చెబుతున్నారు. అమిత్ షా వొస్తున్న రోజున్నే వీరిద్దరు కార్యకర్తలతో అత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే వీరిద్దరినీ తమ పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కాంగ్రెస్ ముఖ్యనాయకుడు రాహుల్‌గాంధీ తమ పార్టీ రాష్ట్ర నాయకులకు సూచించినట్లు తెలుస్తున్నది. ఆమేరకు వారు వీరిద్దరిని తమ పార్టీలో చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నారు. కాగా కర్ణాటక రాష్ట్రంలో ప్రచార కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి దిల్లీ వెళ్తూ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కాసేపు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో రాహుల్ ముచ్చటించారు. ముఖ్యంగా తెలంగాణలో ఒకరి తర్వాత ఒకరుగా వొస్తున్న బిజెపి జాతీయ నేతల పర్యటనలతో ఆ పార్టీ ప్రభావం తెలంగాణలో ఏమేరకుందన్న విషయాన్ని ఆయన ఆరా తీసినట్లు తెలుస్తున్నది.
బిజెపిపై ఇక్కడి ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది… ముస్లిం వోటర్ల రియాక్షన్ ఏవిధంగా ఉందన్న విషయాలను అడిగి తెలుసుకున్నట్లు ఆ వర్గాల ద్వారా తెలుస్తున్నది. శంషాబాద్‌లో రాహుల్‌ను కలుసుకున్న పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు పార్టీ ప్రచారకమిటి చైర్మన్• మధుయాష్కి గౌడ్, ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వి. హన్మంతరావులు రానున్న ఎన్నికలు, పార్టీపరంగా తీసుకోవాల్సిన కార్యక్రమాలపై చర్చించినట్లు తెలుస్తున్నది.ఈ చర్చల సందర్భంగా పిసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఒక సంతోషకరమైన వార్తను రాహుల్ అందజేశారు. రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ బిఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. గతంలో ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి పొత్తు విషయంలో చేసిన కామెంట్ ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ చర్చలకు, అనుమానాలకు రాహుల్ ఫుల్ స్టాప్• పెట్టడంతో ఆ పార్టీ శ్రేణులు ఊపిరి తీసుకున్నట్లైంది.