Take a fresh look at your lifestyle.

అమిత్‌ ‌షా ముస్లిం విద్వేష ప్రసంగం

రానున్న ఎన్నికలకు  తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య ఒక విధంగా యుద్ధ వాతావరణమే కనిపిస్తున్నది. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదాలు, సవాళ్ళు, దేవుళ్ళ మీద ప్రమాణాలతో రోజుకో అంశం రగులుతోంది. ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్‌లు ఏదో అంశంపైన అధికార బిఆర్‌ఎస్‌ ‌పార్టీని నగ్నంగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా పర్యటన తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడిని రగిలించింది. ఆదివారం నాడు చేవెళ్లలో భాజప నిర్వహించిన విజయ్‌ ‌సంకల్ప్ ‌సభ ఆ పార్టీ వర్గాల్లో కొత్త అశను చిగురింపజేసింది. విజయ్‌ ‌సంకల్ప్ ‌సభ విజయవంతమవడం క్యాడర్‌లో జోష్‌ను నింపిందనే చెప్పాలే. దానికి తగినట్లుగా అమిత్‌ ‌షా చేసిన ప్రసంగం ఆ వర్గాలను ఉరకలెత్తించేదిగా ఉంది.

దేశంలో మరోసారి అధికారంలోకి వొచ్చేది మోదీనే అన్న అమిత్‌ ‌షా ప్రకటనపై  ఈ సారి మోదీకి ఘర్‌ ‌వాపసీ తప్పదని బిఆర్‌ఎస్‌ ‌కౌంటర్‌ అటాక్‌ ‌చేస్తుండడంతో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.  చేవెళ్లలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో దాదాపు అరగంటసేపు మాట్లాడిన అమిత్‌ ‌షా తన ప్రసంగమంతా బిఆర్‌ఎస్‌, ఆ ‌పార్టీ అధినేత కెసిఆర్‌పైన గురిపెట్టి మాట్లాడారు.  కెసిఆర్‌తో పాటు, ఆయనకు మద్దతుగా నిలిచిన ఎంఐఎంను లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన తీరు రాజకీయవర్గాల్లో  చర్చనీయాంశంగా మారింది. ముస్లిం రిజర్వేషన్‌లపైన ఆయన మాట్లాడినతీరు కేవలం ఒక్క ఎంఐఎంకే కాకుండా కాంగ్రెస్‌తో పాటు వివిధ పార్టీల్లోని ముస్లింలకు ఆగ్రహాన్ని తెప్పించింది. అవునన్నా, కాదన్నా తెలంగాణ ఏర్పడినప్పటినుండి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో గతంలోలాగా కనీసం ఒక్కటంటే ఒక్క మత ఘర్షణ కూడా జరుగలేదన్నది వాస్తవం. కాని, బిజెపి కేంద్ర నాయకులు వొచ్చినప్పుడల్లా తమ ప్రసంగాల్లో ముస్లిం సమాజంపైన ఏదో ఒక చెణుకు విసరడం అనవాయితీగా మారింది.

తాజాగా అమిత్‌ ‌షా మరోసారి  అదే అంశాన్ని లేవనెత్తిన విధానం, ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేదిగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. దీనిపైన బిఆర్‌ఎస్‌ ‌నాయకత్వం తీవ్రంగా స్పందిస్తోంది. సంక్షేమంపైన దృష్టి పెట్టకుండా బిజెపి మతాలమధ్య నిప్పురాజేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. దేశంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన హోం శాఖమంత్రి హోదాలో ఉన్న అమిత్‌ ‌షానే ఇలా మాట్లాడటమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎంఐఎం కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నది. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వొస్తే కెసిఆర్‌ ‌ప్రభుత్వం కల్పించిన ముస్లిం మైనార్టీ  రిజర్వేషన్లను రద్దు చేస్తామనడం మైనార్టీలెవరూ తమకు వోటు వేయాల్సిన అవసరంలేదని పరోక్షంగా అమిత్‌షా పేర్కొనట్లేకదా అని ఆల్‌ ఇం‌డియా మజ్లీస్‌ ‌పార్టీ (ఎంఐఎం) జాతీయ అధ్యక్షుడు అసదుద్గీన్‌ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రిగా ఇలాంటి మాటలు షా కు శోభనివ్వవని, ఇది మతద్వేషాలను రెచ్చగొట్టే మాటలుగా ఆయన అభివర్ణించారు. ఒక పక్క వెనుకబడిన ముస్లింలను చేరదీయాలని ప్రధాని మోదీ మాట్లాడుతుంటే, ఉన్న రిజర్వేషన్లు తొలగిస్తామని అమిత్‌ ‌షా అనడం విడ్డూరమేకాదు, బాధ్యతారాహిత్యమంటా రాయన.

ఇదిలాఉంటే ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టాలనే అమిత్‌షా చూస్తున్నారని కాంగ్రెస్‌ ‌నాయకులు విరుచుకు పడుతున్నారు. ఎక్కడ అల్లర్లు జరుగకుండా చూడాల్సిన హోం శాఖ మంత్రే అల్లర్లకు ఆజ్యం పోసేలామాట్లాడటం దారుణమని ఆ పార్టీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేప్పుడు రాజ్యాంగంపైన ప్రమాణం చేసిన విషయాన్ని షా మరిచిపోతున్నట్లున్నారని ఆయన విమర్శిస్తుండగా, ముస్లింలు ఈ దేశం ప్రజలు కారా అని ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ప్రశ్నిస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్‌లను తొలగిస్తామని చెప్పడం బిజెపి అహంకారానికి నిదర్శనమంటారాయన. అమిత్‌ ‌షా చేసిన ప్రకటన ఆయన అవగాహన లోపానికి పరాకాష్ట అంటూ తమ రిజర్వేషన్లను తీసి వేయడం అమిత్‌ ‌షా తరంకాదని సవాలు  చేశారాయన. ముస్లింలలో వెనుకబడిన తరగతుల వారికి మాత్రమే  రిజర్వేషన్లు అమలులో ఉన్నాయన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అసలు దేశంలో అంబేద్కర్‌ ‌రాజ్యాంగం అమలులో ఉందా లేక బిజెపి రాజ్యాంగమా అని ప్రశ్నిస్తున్నారు. బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌కూడా షా మాటలను ఖండించారు. మత విద్వేశాలను రెచ్చగొట్టే తన వ్యాఖ్యలను ఇప్పటికైనా షా వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. కేవలం ఈ ప్రకటన చేసేందుకే అమిత్‌ ‌షా తెలంగాణకు వొచ్చి పోయి ఉంటాడని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి ప్రకటనలు ప్రజాస్వామ్య, లౌకిక విలువలకు వ్యతిరేకమని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ వ్యాఖ్యానించారు. కాగా, కులాలు, మతాలుగా ప్రజలను విడగొట్టడమే పనిగా పెట్టుకుందని మంత్రి కెటి రామారావు బిజెపిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్‌ ‌దేశ ప్రజలను ఏకం చేస్తే కమల నాథులు స్వార్థపూరిత రాజకీయాలతో కుట్రలకు పాల్పడుతున్నదన్నారు. దేశంలో కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అనేక విషయాల్లో ముందంజలో ఉందని, కనీసం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏకధాటిగా రాష్ట్రంపైన ఆరోపణలు చేయడమేంటని ఆయన ప్రశ్నిస్తూ, ఇలాంటి చర్యలవల్ల ఈసారి మోదీని ఘర్‌ ‌వాపసీ ఖాయమంటున్నారాయన.

Leave a Reply