Take a fresh look at your lifestyle.

‘‌డెల్టా’ ప్రభావంతో వణుకుతున్న అమెరికా

  • ఒక్కరోజే లక్షా 30 వేలకు పైగా కేసులు నమోదు
  • చైనాలోనూ పెరుగుతున్న కేసుల సంఖ్య

కోవిడ్‌ ‌వ్యాప్తి ప్రపంచాన్ని మరోసారి టెన్షన్‌కు గురిచేస్తున్నది. డెల్టా ఎఫెక్ట్‌తో అగ్రరాజ్యం అల్లాడుతుంది. అమెరికాలో తాజాగా ఒక్కరోజే లక్షా 30 వేలకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. మరణాల సంఖ్య కూడా 700 దాటింది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో పలు దేశాలు అల్లాడిపోతున్నాయి. అగ్ర రాజ్యం అమెరికాలో కొరోనా డెల్టా వేరియంట్‌ ‌వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో కేసులు అమాంతం పెరుగుతున్నాయి. చైనా భారీ ఎత్తున కోవిడ్‌ ‌పరీక్షలు జరుపుతుండగా..శ్రీలంకలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. జూన్‌ ‌చివరిలో సగటున రోజువారీ కేసుల సంఖ్య 11 వేలకు తగ్గిపోయిన అమెరికాలో ఈనెల 3 నుంచి రోజూ లక్షకు పైగా నమోదవుతున్నాయి. జూన్‌, ‌జులై మొదటి వారంలోనూ కేసుల సంఖ్య 20 వేలలోపే పరిమితమైనా.. ఆ తర్వాత మాత్రం అక్కడ వైరస్‌ ‌విజృంభిస్తున్నది. క్రమేపీ కేసుల సంఖ్య పెరుగుతుంది. గత ఏడాది కొరోనా ఫస్ట్ ‌వేవ్‌లో రోజువారీ కేసుల సంఖ్య లక్ష దాటడానికి 9 నెలలు పట్టగా.. ఇప్పుడు 6 వారాల్లోనే ఆ సంఖ్యను దాటేయడం తీవ్రతను తెలుపుతుంది.

హాస్పిటళ్లలో చేరుతున్న వారి సంఖ్య, మరణాలు కూడా పెరుగుతున్నాయి. రెండు వారాల క్రితం రోజుకి 270 కోవిడ్‌ ‌మరణాలు సంభవించగా..ఇప్పుడు ఆ సంఖ్య 700 దాటింది. అమెరికాలో ప్రధానంగా టీకా తీసుకోని వారిలో వైరస్‌ ‌వ్యాప్తి తీవ్రంగా ఉంది. ప్రత్యేకంగా దక్షిణ ప్రాంతంలో హాస్పిటళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. మరింత మంది అమెరికన్లు టీకాలు తీసుకోకపోతే కేసుల పెరుగుదల ఇంకా తీవ్రంగా ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతున్నది. చైనా కూడా వైరస్‌ ‌దెబ్బకు వణుకుతుంది. తొలిసారి వైరస్‌ ‌బయటపడిన వూహాన్‌ ‌నగరంలో వరుసపెట్టి టెస్టులు చేస్తున్నారు. అక్కడ మొత్తం జనాభా కోటి 20 లక్షల మంది ఉంటే.. కోటి 12 లక్షల మందికి టెస్టులు చేశారు. ఈ నెల 4 నుంచి ప్రత్యేక డ్రైవ్‌ ‌చేపట్టి మరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

శ్రీలంకలో కొరోనా డెల్టా రకం వ్యాప్తి తీవ్రంగా ఉంది. ప్రతి వ్యక్తికీ కోవిడ్‌ ‌ముప్పు పొంచి ఉందని.. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. గత కొద్ది రోజులుగా శ్రీలంకలో కేసులు, మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. అక్కడ హాస్పిటళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రాణాలు కోల్పోతున్న వారిలో ఎక్కువ మంది డెల్టా వేరియంట్‌ ‌సోకినవారే ఉన్నారు.

Leave a Reply